జట్టుపోలుగాడు : అరె మావా కేతిగా... మనిషి యంత్రాన్ని నడుపుతాడా? యంత్రం మనిషిని నడుపుతుందా?
కేతిగాడు : ఏం ప్రశ్నరా ఇది. మనిషే యంత్రాన్ని నడుపుతాడు.
జుట్టుపోలుగాడు : అవును కదా... ఏడాది వయసున్న పిలగాడ్ని తీసుకో. వాడ్ని సెల్‌ఫోన్, అందులో చూసే రీల్స్ ఆడిస్తున్నాయా లేక వాడు ఆడిస్తున్నాడా? సెల్‌ఫోన్ ఇవ్వందే అసలు అన్నమే తినడు. ఏడుస్తూ నానా యాగీ చేస్తాడు. సెల్‌ఫోన్ ఇచ్చాకే ఊరుకుంటాడు. గమనించలేదా?
కేతిగాడు : అరె.. ఇది ప్రతి ఇంట్లో వుండే భాగోతమేగా.
జుట్టుపోలుగాడు : అందుకే నేనంటున్నది... సెల్‌ఫోన్ అనే యంత్రం మనిషిని ఆడిస్తుంది. నడిపిస్తుంది అని.
కేతిగాడు : అరె సెల్‌ఫోన్ కనిపెట్టింది మనిషి. అందులో రీల్స్ చేసి అప్‌లోడ్ చేసేది మనిషి. అవి చూసి ఆనందించేదీ మనిషే. ఏదైనా మనిషి చేస్తేనే రూపొందుతుంది.
జుట్టుపోలుగాడు : అక్కడే నువ్ పప్పులో కాలేసావ్. నువ్వు ఏం చూస్తున్నావో కనిపెట్టి, అలాంటి వాటినే పదేపదే నీకు ఆ సెల్‌పోన్ చూపిస్తుంది. అంటే నీ మనసుని లాగేసుకుని నిన్ను బానిసను చేస్తుంది. అవునా? కాదా?
కేతిగాడు : అలా దానికి ఫీడ్ చేసి పెట్టేది కూడా మనిషేరా. అదంతా ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్. కృత్రిమ మేధస్సురా.
జుట్టుపోలుగాడు : హమ్మయ్య. ఇప్పుడు నువ్వు నా దార్లోకి వచ్చావు. మనిషి యంత్రం కనిపెట్టాడు. మళ్లీ అదే యంత్రానికి బానిసైపోయాడు. ఇక రానున్న కాలంలో ఏఐనే మనల్ని ఆడిస్తుంది. ఏమంటావ్?
కేతిగాడు : ఏదైనా అంతేరా. మనిషి చేతికి కత్తి వచ్చింది. దాంతో కూరగాయలు కోసుకుంటాం. కోపం వస్తే మనుషుల పీకలు కోస్తాం. ఆ కోపం, ద్వేషం మనిషిది తప్ప కత్తిది కాదు కదా. ఇదీ అంతే.. మనుషుల విచక్షణ పెరగకపోతే ఏదైనా భస్మాసుర హస్తం అవుతుంది. అయినా సైన్స్, సాంకేతిక జ్ఞానాన్ని ఎవరూ ఆపలేరు. బాంబులు, ఆటంబాంబులు కనిపెట్టింది మనిషే. జపాన్ నగరాలు హిరోషిమా, నాగసాకీలపై అమెరికా ఆటంబాబులు వేసి లక్షలాది జనాన్ని పొట్టన పెట్టుకుని ఎనభై ఏళ్లు అవుతుంది. అయినా మనుషుల వినాశనానికి, యుద్ధాలకు రకరకాల బాంబులు, మారణాయుధాలు ఇంకా తయారు చేస్తూనే వున్నారు. నీవన్నట్టు శాస్ర్త సాంకేతికతలు మానవ పురోగమనానికి కాక తిరోగమనానికి ఉపయోగపడే దశలో మనం జీవిస్తున్నాం. అదే పెను విషాదం.
జుట్టుపోలుగాడు : నాకు అర్థమయ్యీ అర్థం కానట్టుంది మావా. కొంచెం వివరంగా చెప్పు.
కేతిగాడు : నీకు ఏది కావాలనుకుంటే దాన్ని క్షణాల్లో నీకు రూపొందించి ఇస్తుంది. దాన్నే చాట్ జిపిటి అంటున్నాం. ఇదో సాఫ్ట్‌వేర్. దీనికి మాతృసంస్థ ఓపెన్ ఏఐనే. అది ఇప్పుడు హార్ట్‌వేర్ రూపంలోకి కూడా పోయి హ్యూమనాయిడ్ రోబోలు విరివిగా తయారయ్యేలా రూపొందుతుంది. అంటే మనలాంటి మనుషుల్ని పోలే భౌతిక మనుషులను రూపొందించే ప్రాజెక్టులు కూడా ముందుకొస్తున్నాయి. మరబొమ్మలే అయినప్పటికీ మనుషులు చేసే పనులు చాలా వరకు అవి చేసిపెడ్తాయి. ఇప్పటి వరకు కంప్యూటర్స్ రాకతో బ్యాంక్ ఉద్యోగాలు వంటి వైట్ కాలర్ జాబ్స్ చాలా వరకు పోయాయి. ఇప్పుడీ రోబోలతో ఇక కూలీలు, పనిమనుషులు వంటి బ్లూకాలర్ జాబ్స్ కూడా ప్రమాదంలోకి పోతాయని ఆందోళన పడ్తున్నారు.
బంగారక్క : నిజమే... వచ్చే భయాన్ని చూసి మనం భయపడకూడదు. దాన్ని ఎలా ఎదుర్కోవాలి? అని ఆలోచించాలి. మరో విషయం. ఆ మార్పుతో సానుకూల అంశాలు గ్రహించాలి. పెద్ద ఎత్తున పేరుకుపోయే చెత్తను, మురికిని తీసేయడానికి ఈ రోబోలను ఉపయోగించవచ్చు. అలాగే లోడింగ్ అన్‌లోడింగ్ పనులకు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల నుండి మానవాళిని రక్షించే పనులకు వీటిని ఉపయోగించుకోవచ్చని అంటున్నారు. ఆస్పత్రి రోగులకు, వృద్ధుల సేవలకు, టీచింగ్ వంటి బోధనాపనులకు కూడా వీటిని వాడొచ్చు అంటున్నారు కానీ నేను దానిని అంగీకరించలేను. ఈ సేవలకు, పనులకు భావోద్వేగమైన మానవీయ స్పర్శ అవశ్యం. వాటికవేమీ వుండవు. ఏదైనా యాంత్రికంగా వుంటే మనుషులు సేదతీరరు. సంతృప్తి పొందరు. ఆనందం అనుభవించలేరు.
ఇద్దరూ : మరి దీనికి పరిష్కారం ఏమిటి?
బంగారక్క : మానవాళికి ముప్పుగా ఏఐ మారకూడదనే లక్ష్యంతో అంతర్జాతీయ అణుశక్తి నియంత్రణ మాదిరి ఏఐ వాడుక నియంత్రణకు కూడా ఐక్యరాజ్యసమితి స్థాయిలో ఓ సంస్థ ఏర్పాటు చేయాలని రాజకీయ మేధావులు నేడు సూచిస్తున్నారు. ఏఐని కేవలం ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు విడిచిపెటితే అవి తమ లాభాల వేటలో ప్రజాజీవనం, భద్రత, ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. జీవ సంబంధమైన వినాశకర వైరస్‌లను రూపొందించడంలో ఏఐది ఎప్పటికీ పై చేయి కాకుండా ప్రభుత్వాలు అప్రమత్తంగా వుండాలని నోబుల్ బహుమతి గ్రహీత జెప్రీహంటన్ హితవు పలికారు. నిజమే కదా. మానవాళికి ముప్పుగా, అర్థం కాని రీతిలో సృష్టించే ఏఐ బ్లాక్‌బాక్స్‌లను విచక్షణ గల మానవజాతి మాత్రమే నియంత్రిస్తుంది. తుదముట్టిస్తుంది. అదే పురోగమనం. అభ్యుదయం.
కె.శాంతారావు, 99597 45723






కామెంట్‌లు (0)