తూర్పులో బెంగాలు వారు, పడమటలో బొంబాయి వారు, దక్షిణ భారతాన చోళ మండలం వారు స్వతంత్ర భారత గుర్తింపు కోసం మన సమాజం, తమ తమ సంస్కృతిక జీవనం, చిహ్నాలను గుర్తులుగా చిత్రాలు వేసి వారి ఆలోచనా పద్ధతిన సంస్థలు నిలిపారు. బెంగాల్ స్కూలు, బాంబే ప్రోగ్రెసివ్‌లు, చోళమండల ప్రాంతీయ కళలుగా వారి సంస్థలకు పేరు పెట్టుకున్నారు. వీటి నుండే మిశ్రమ ఆలోచనలూ, కొంత వైవిధ్యం చూపిస్తూ గుజరాత్, పంజాబ్ వంటి ప్రాంతాల కళాకారులు వారి ప్రాంతీయతను ముందుంచారు. ఉత్తరాన ఢిల్లీ రాజధానిలో మరో కళాసంస్థ ప్రాంభించారు కళాకారులు. ఆ సంస్థ ‘ఢిల్లీ శిల్పి చక్ర’ ఈ సంస్థ కళాకారులు వారి జీవన పోరాటంలో వారి ఉనికి వెతుకుతూ ఏర్పరచుకున్న సంస్థ. ఈ సంస్థకు అంకురార్పణ, ఏర్పరచుకున్న ఉద్దేశ్యాలు మిగిలిన సంస్థల కంటే ఎంతో విరుద్ధం.
1947వ సంవత్సరం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని సంతోష పడాలో, దేశం 2 ముక్కలుగా విభజించబడి, దేశ వాసులు అటు, ఇటూ వలసపోతూ ఎదుర్కొన్న విలాపాలకు బాధపడాలో అర్థం కాని సమయం. విభజన ముందు కళా సంస్కృతులకు పేరున్న లాహోర్ పాకిస్తాన్‌కి ఇవ్వబడ్డాక, భారతీయ కళాకారులు తమ దేశానికి తిరిగి వచ్చారు. ఢిల్లీ చేరారు చాలామంది కళాకారులు. భభేష్ చంద్ర సాన్యాల్, కన్వల కృష్ణ, ధనరాజ్ భగత్, ప్రాణనాథ్ మాగో వంటి ఇంకా ఎందరో కలిసి ఇక్కడ తమ స్థానం ఏర్పరచుకుని పని చేయమొదలెట్టారు. ఢిల్లీలో ముందుగానే వున్న కళాకారుల సిద్ధాంతాలకు, ఆల్ ఇండియా ఫైన్ ఆర్ట్ & క్రాఫ్ట్ సొసైటీ వారి పద్ధతులలో ఇమడలేక వీరందరూ మరోసంస్థగా ఏర్పడి పనిచేయదలిచారు. ఈ కొత్త ప్రదేశాన బతుకు తెరువు వెతుకులాట, జీవన సమరంలో అస్థిత్వం కోసం మొదలు పెట్టిన సంస్థ. దీనిపేరే ఢిల్లీ శిల్పి చక్ర. కళలు జీవితానికే వెలుగునిస్తాయి అనే సిద్ధాంతంతో అలాగే కళలు సమాజంలో భాగం కావాలనే ఆలోచనతో ప్రజలు వచ్చే ప్రదేశాలలో, మార్కెట్ ప్రాంతంలో ప్రదర్శనలు ఇచ్చేవారు.
భభేష్ చంద్రసాన్యాల్ : 1902లో అస్సాంలో జన్మించాడు. ఢిల్లీ శంకర్ మార్కెట్‌లో ముందుగా ఇతను కళాకారుల స్టూడియో అని మొదలు పెట్టాడు. ఇతనితో పాటూ మరింతమంది కలిసి ఢిల్లీ శిల్పి చక్ర అని మొదలుపెట్టారు. ఈ అంకురార్పణ రాబోయేకాలంలో ధూమిమల్ ఆర్ట్ గ్యాలరీ అయింది. బిసి సాన్యాల్‌గా పిలువబడిన ఈయన చిత్రకారుడు, శిల్ప, కళాధ్యాపకుడు. 1905 లో జరిగిన బెంగాలు విభజన, 1947 పాకిస్తాన్ విభజన, 1970ల్లో బంగ్లాదేశ్ విభజన ఇలా 3 దేశ విభజనలు, విలాపాలు చూశాడు. చిన్నతనంలో తండ్రిని కోల్పోయాడు. తల్లి బొమ్మలు చేస్తూ పోషించింది. అదే ఇతనిని శిల్పిగా మార్చింది. బెంగాల్, సెరంపూర్‌లో కళాధ్యాపకుడిగా పని చేస్తున్నప్పుడు బెంగాల్ వారి కళాపద్ధతులు కానీ, బ్రిటీష్‌వారి పద్ధతులూ పాటించక తన పద్ధతి తాను నిర్దేశించుకున్నాడు. 1929లో లాహోర్ లాలాలాజ్ పత్ రాయ్ పోట్రేట్ చేయడానికి వెళ్లి అక్కడే వుండిపోయి, 1936 వరకూ అక్కడి మయో కాలేజీలో పనిచేశాడు. 1937లో లాహోర్ కాలేజీ ఆఫ్ ఆర్ట్‌ని నిర్మించాడు. 1947 వరకూ అక్కడే వుండి, ఢిల్లీ వచ్చేసినాక 1949లో ఢిల్లీ శిల్పి చక్ర నిర్మాణానికి తోడ్పడ్డాడు. ఇందులో తోడ్పడిన, భాగమైన ముఖ్య కళాకారులు దినకర కౌషిక్, కె.ఎస్.కులకర్ణి, జయ అప్పస్వామి, పి.ఎన్.మాగో, శంకర పిళ్లై కన్యల కృష్ణ వంటి ఎందరో.
ఆపై సాన్యాల్ ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌లోనూ అధ్యాపకుడయ్యాడు. ఈయన చిత్రాలు రంగుల మేళవింపులైనా కూడా, ఎక్కడో వెనక్కి చూస్తున్నట్టు, ఏదో వెతుకుతున్నట్టు, నిశ్శబ్దంగా వుంటాయి. ఆ నిశ్శబ్దం ఈయన శిల్పంలోనూ వుంటుంది. చివరకు హిమాచల్ ప్రదేశ్ ఆండ్రెట్టాలో స్టూడియో నిర్మించాడు. 2003లో కన్నుమూశాడు.
లలిత కళా అకాడమీ కార్యదర్శిగా వున్నాడు. ఆపై వైస్ చైర్మన్ అయ్యాడు. 1984లో పద్మభూషణ్‌తో సత్కరించబడ్డాడు. 1980లో లలిత కళా అకాడమీ వారి లైఫ్‌టైమ్ పురస్కారం అందుకున్నాడు.
కన్యల కృష్ణ : 1910లో కమాలియా అనే ఆనాటి పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో జన్మించాడు. 1945లో ఈయన, ఈయన పత్ని దేవయాని కృష్ణని పాకిస్తాన్ గవర్నర్ సర్ జార్ట్ కునింగమ్, ప్రకృతి దృశ్యాల చిత్రీకరణ కోసం, ఆఫ్ఘనిస్తాన్, ఖైబర్ పాస్, స్వాత్‌లోయ చుట్టుపక్కల ప్రాంతాలకు పంపాడు. అలాగే వీరిద్దరికీ కాశ్మీరు, యూరప్ ప్రకృతి దృశ్యాల చిత్రీకరణే కాదు, అనుమతి అందరికీ అందని టిబెట్ కూడా వెళ్లి ప్రకృతి దృశ్య చిత్రీకరణ చేసే అవకాశం అందింది. ఆ సందర్భాన దలైలామా మకుట అధిరోహరణ సందర్భం కూడా చూసి చిత్రం గీసే అవకాశం దొరికింది. నిజం చెప్పాలంటే ఈయన వేసిన చిత్రాలే దలైలామా అధిరోహణ మొదటి చిత్రాలుగా చెప్పవచ్చు. ఈయన చిత్రాలలో ఒక లోతు కోణాలు, రంగుల మార్పులు చక్కగా చిత్రిస్తాడు. తాను సంచార జీవినన్నాడు. అందుకనే అన్ని ప్రదేశాలు తిరిగి చిత్రాలు వేశాడు. ఢిల్లీ శిల్పి చక్రలో ముఖ్యుడు. లలిత కళ అకాడమీ సభ్యుడు. ఈయన ముద్రణ కళలోనూ అందెవేసిన చేయి. ఈయన ఢిల్లీ మాడ్రన్ స్కూల్‌లో ఆర్ట్ నేర్పాడు. 1993లో కన్నుమూశాడు.
పి.ఎన్.మాగో : 1923లో పాకిస్తాన్‌లో గుజేర్ ఖాన్ పుట్టాడు. ఆపై లాహోర్‌లో వుండేవాడు. 1947 విభజనలో ఢిల్లీ వచ్చేశాడు. బొంబాయి జె.జె.స్కూల్‌లో కళాభ్యాసం చేశాడు. ఆపై ఢిల్లీలో సాన్యాల్ స్టూడియోలోనూ కళాభ్యాసం చేశాడు. దినచర్యలను తన చిత్రాలలో చిత్రించేవాడు. అలాగే ప్రకృతి దృశ్యాలనూ, మానవ భావాలనూ చిత్రించాడు. తైలవర్ణం, ఆక్రిలిక్, చార్‌కోల్, ఇంక్, పెన్సిల్, నీటి రంగులతో చిత్రాలు వేశాడు. పల్లెలు, పట్టణం, గుట్టలు, మైదానాలు ఒకటేమిటి ఏ దేశమైనా ఏ వాతావరణమైనా అది చిత్రంలో బంధించేవాడు. దేశ విభజనలో ఎన్నో తన చిత్రాలను లాహోర్‌లో వదిలి రావలసి వచ్చింది. ప్రభావం చూపించిన అధ్యాపకుడు, చిత్రకారుడు. అటు పాశ్చాత్య కళాపద్దతులు ఇటు భారతీయ సంప్రదాయం కళాపద్ధతులూ రెంటి మధ్య సంతులనం తెస్తూ చిత్రం వేశాడు. ఆల్ ఇండియా హాండీక్రాప్ట్స్ బోర్డ్ అధ్యక్షుడు, అంతర్జాతీయ సలహాదారుగా కూడా పనిచేశాడు. 2006లో కన్నుమూశాడు.
అమర్‌నాథ్ సెహగల్ : 1922 లో పాకిస్తాన్‌లోని అటోక్‌లో జన్మించాడు. ముందు ఇంజినీరింగ్ చదువుకుని పని మొదలుపెట్టినా, కళల అభ్యాసం చేసి కళలు చేయమొదలెట్టాడు. 1947 దేశ విభజనలో ఢిల్లీ వచ్చాడు. 1950లో కళాభ్యాసం చేశాడు. ఢిల్లీ కాలేజీ ఆఫ్ ఆర్ట్‌లో కళా అధ్యాపకుడిగా పనిచేశాడు. చిత్రం, కవితలూ రాశాడు. 1979లో లుక్సెంబర్గ్‌లో స్టూడియో పెట్టుకుని పనిచేశాడు. అక్కడ, భారతదేశంలోనూ పనిచేశాడు. 2004లో ఢిల్లీకి తిరిగి వచ్చేవాడు. ఈయన శిల్పం, చిత్రం, ఏదో వ్యధ చూపుతున్నట్టు సాగిపోయి, కొంత భయం కల్గిస్తుంటాయి. 2023లో భారత ప్రభుత్వం ఆయన పేరు మీద ఒక స్టాంప్ విడుదల చేసింది. 1993లో లలిత కళా అకాడమీ వారి ఫెలోషిప్ వచ్చింది. ఆయన మరణానంతరం 2008లో ఆయనను పద్మభూషణ్‌తో ప్రభుత్వం సత్కరించింది. 2007లో కన్నుమూశాడు.
ధనరాజ్ భగత్ : 1917లో లాహోర్‌లో జన్మించాడు. అక్కడే శిల్పం అభ్యసించాడు. 1947లో విభజనలో ఢిల్లీ వచ్చి ఢిల్లీ కాలేజీ ఆఫ్ ఆర్ట్‌లో అధ్యాపకుడయ్యాడు. ఈయన కాగితం, చెక్క, రాగి, రాయి వంటి ఎన్నో పదార్థాలతో శిల్పం చేశాడు. డ్రాయింగులు కూడా ఎన్నో చేశాడు. 1937 నుండి 1947 వరకు పంజాబ్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ లాహోర్‌లో పనిచేశాడు. 1977లో పద్మశ్రీతో భారత ప్రభుత్వం సన్మానించింది. ఛండీగఢ్‌లో విభజన వలస వచ్చిన వారి శిల్పవనం చేశాడు. విభజనలో వలస వచ్చేముందు ఈయన శిల్పాలు ఒక సున్నిత నునుపుతో మలచి కనిపిస్తాయి. దేశ విభజనలో చేదు నిజాల జీవితానుభవం తరువాత ఈయన శిల్పాలు, డ్రాయింగులలో ఒక గరుకుతనం కనిపిస్తుంది. 1988లో లోకం వీడాడు.
ఢిల్లీ శిల్పిచక్రలో మరెంతోమంది కళాకారులు కలుస్తూ వచ్చారు. ఈ సంఘం ఎంతోకాలం పనిచేసింది.
డా.యం. బాలామణి, 8106713356






కామెంట్‌లు (0)