నిబంధనల ప్రకారం భూసేకరణ పరిహారాన్ని చెల్లిస్తాం
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
సానుకూలంగా స్పందించిన విష్ణుదేవ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద ప్రతిపాదించిన సమ్మక్క సాగర్ బ్యారేజీకి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన మంగళవారం రాయపూర్‌లో భేటీ అయ్యారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు కలిగే ప్రయోజనాలను రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా వివరించారు. బ్యారేజీ నిర్మాణం పూర్తయిందనీ, పూర్తి స్థాయి నీటి మట్టం 83 మీటర్ల వద్ద 6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉందని తెలిపారు. కరువు ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలకు గోదావరి జలాలను వినియోగించాలనేది ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని పేర్కొన్నారు. భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. ఎల్‌నినో పరిస్థితుల వల్ల తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని వివరించారు. సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్‌ఓసీని త్వరగా జారీ చేయాలని కోరారు. మిగిలిన అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిపై ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలంగా స్పందించారు. ఎన్‌ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
స్థలం మార్పుతో తగ్గిన ముంపు
సమ్మక్క సాగర్ ప్రాజెక్టును తొలుత కాంతనపల్లి వద్ద ప్రతిపాదించారు. ఆ ప్రాంతంలో 11,408 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. 17 ఆదివాసీ గ్రామాలు, భద్రతా మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని గుర్తించారు. ముంపును తగ్గించేందుకు బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని తుపాకులగూడెంకు మార్చారు. ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనం ప్రకారం పూర్తి స్థాయి నీటి మట్టం వద్ద ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 33 ఎకరాలు ముంపునకు గురి కానుంది. భారీ వరదల సమయంలోనూ ప్రభావిత ప్రాంతం వంద ఎకరాలకు మించదు. ఐఐటీ ఖరగ్‌పూర్ తన నివేదికను జులై 30న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి సమర్పించింది. అధ్యయనం కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరిన రూ.9.88 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లోనే చెల్లించింది. సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను వినియోగించుకుని ఎస్సారెస్పీ రెండో దశ కింద 4 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టును స్థిరీకరించాలని రాష్ర్ట ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రామప్ప-పాకాల లింక్ కెనాల్ ద్వారా మరో 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రణాళిక రూపొందించింది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి ఎన్‌వోసీ పొందితే సమ్మక్క సాగర్ బ్యారేజీ ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.






కామెంట్‌లు (0)