తెలంగాణ ఎదుగుతోంది.. ప్రగతి ప్రస్థానంలో భాగస్వాములు కండి
ఢిల్లీ ఇన్వెస్ట్ తెలంగాణ కర్టెన్‌రైజర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ తన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది : కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ ఎదుగుతున్నది, ఈ ప్రగతి ప్రస్థానంలో అందరూ భాగస్వాములు కావాలి, కలిసి నడుద్దాం రండి అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. గురువారం ఢిల్లీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ డిసెంబర్ ఏడు, ఎనిమిది, తొమ్మిది తేదీల్లో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాని చెప్పారు. సుమారు
400 ఏండ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఒక ప్రపంచస్థాయి నగరంగా వెలుగులీనిందని తెలిపారు. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వ్యాపారులు హైదరాబాద్‌లోని చార్మినార్ పరిసరాలకు వచ్చి వ్యాపారాలు చేసేవారనీ, ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు, వెండి నగషీ కళాకృతులను కొనుగోలు చేసేవారని గుర్తు చేశారు. నిజాం పాలకులు అద్భుతమైన కట్టడాలు, ప్రపంచస్థాయి మ్యూజియం, టంకశాల (నాణేల ముద్రణాలయం), విమానాశ్రయం, రైల్వేలు, అత్యుత్తమ విద్యా సంస్థలతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని తెలిపారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రపంచం గర్వించే మేధో నిపుణులు, నాయకులను అందించింది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, ప్రేమ్ వత్స వంటి ప్రముఖులంతా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నవారేనని చెప్పారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ స్థాయి ప్రతిభావంతులను తయారు చేయడంలో హైదరాబాద్‌కు ప్రత్యేకత ఉందన్నారు. భారత దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో, దేశ ఆర్థిక ప్రగతికి బాటలు వేసిన మహా నేతలను మనం స్మరించుకోవాలని వివరించారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల సమక్షంలో నిలబడి, దేశ ప్రగతికి బాటలు వేసిన ఆ మహానేతలకు నేను సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. అతి పిన్న వయసులో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ల రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారనీ, నేడు ఫోన్, ఇంటర్నెట్ లేని జీవితాన్ని మనం ఊహించలేమని అభిప్రాయపడ్డారు.
రాజీవ్ గాంధీ హైదరాబాద్‌లో పైలట్ శిక్షణ పొందారనీ, పైలట్‌గా కూడా పనిచేశారని వివరించారు. అందుకే హైదరాబాద్‌లోని ప్రపంచస్థాయి విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టుకున్నామన్నారు. ‘1991లో పీవీ నరసింహారావు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తెలంగాణకు చెందినవారు. ఆ సమయంలో భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ఆయన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్‌పీజీ) సంస్కరణలను అమలు చేశారని’ వివరించారు. హైదరాబాద్ జీవనంలోనే ప్రపంచస్థాయి దృక్పథం ఉంది. సంస్కరణలను స్వీకరించే తత్వం, పారిశ్రామిక స్ఫూర్తి ఉన్నాయని చెప్పారు. 1991 నుంచి హైదరాబాద్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రభుత్వాలు అధికారంలోకి ఉన్నాయనీ, రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్న ప్పటికీ, హైదరాబాద్ పెట్టుబడుల ప్రస్థానానికి అంతా మద్దతుగా నిలిచారని వివరించారు. నేను ఇక్కడ సుదీర్ఘంగా ప్రసంగించడానికి రాలేదు. పెట్టుబడిదారుల అభిప్రాయాలను వినడానికి వచ్చాను. వ్యాపార రంగం గురించి మాకంటే మీకే ఎక్కువ అవగాహన ఉంది. మీ నుంచి నేర్చుకుంటాం, మీ అభిప్రాయాలను అర్థం చేసుకుంటాం, వాటిని ఆచరణలో పెడతామని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. తెలంగాణలో మీరు పెట్టే పెట్టుబడులకు భద్రత కల్పించడం, అవి వృద్ధి చెందేలా చూడడం నా వ్యక్తిగత బాధ్యత. మీ పెట్టుబడులకు సంరక్షకుడిగా ఉంటానని హామీనిచ్చారు. ముందుగా మీకో విజ్ఞప్తి చేస్తున్నా. మీరు తెలంగాణలో ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ముందుగా మీ మనసులో ఒక సంఖ్యను నిర్ణయించుకోండి. ఆ మొత్తాన్ని ఇప్పుడు రెట్టింపు చేయండి అని అన్నారు. మీరు ఆశిస్తున్న వృద్ధి అంచనాలను రెట్టింపు చేయండి. మీరు ఆశిస్తున్న లాభాలనూ రెట్టింపు చేయండి అని తెలిపారు. మీకు నా నుంచి ఏం కావాలో చెప్పండి. విధానపరమైన నిర్ణయాలైనా, ప్రభుత్వ సహకారమైనా, మీకు అవసరమైన మద్దతు అందించే బాధ్యతను నేను తీసుకుంటానని తెలియజేశారు.
‘తెలంగాణ రైజింగ్ 2047’ తెలంగాణ భవిష్యత్ ప్రణాళిక. ఇది ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి అనుగుణంగా ఉంది. 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగితే, అందులో తెలంగాణ వాటా 10 శాతంగా ఉండాలి. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా ఐదు శాతంగా ఉందన్నారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యమని వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారుల్లో చాలామందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన సంబంధాలపై సందేహాలున్నాయని అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇప్పుడే చెప్పారనీ, అభివృద్ధి విషయంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మధ్య సంబంధాలు ఏమిటనేది కేంద్ర మంత్రి చెప్పారని తెలిపారు. దేశంలో ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందనీ, వాటిలో మూడు హైదరాబాద్‌కు అనుసంధానం కానున్నాయని తెలిపారు.
హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–పుణె మార్గాల్లో ఈ కారిడార్లు ఏర్పాటుకానున్నాయని గుర్తు చేశారు. వరంగల్, ఆదిలాబాద్‌లలో రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరిస్తున్నదన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నుంచి మెట్రో రైలు విస్తరణ వరకు, నేవీ రాడార్ కేంద్రం నుంచి అనేక ఇతర అభివృద్ధి కార్యక్రమాల వరకు కేంద్రం నుంచి సహకారం పొందుతున్నామని చెప్పారు. అభివృద్ధి విషయంలో ప్రభుత్వ జోక్యం కంటే, అవసరమైన చోట ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించి అవకాశాలను విస్తరించాలి. మీ విజయపథంలో ఉన్న అడ్డంకులను తొలగించడమే నా పని తెలియజేశారు. హైదరాబాద్ ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు నగరాలతో పోటీ పడదు. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలి అని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి మీ అత్యుత్తమ ఆలోచనలను అందించండి. మంచి విధానపరమైన సూచనలు చేయండి. మీ సూచనలను పరిశీలించి, వాటిని ప్రభుత్వ విధానాలుగా అమలు చేస్తామని సీఎం ప్రకటించారు.
తెలంగాణ తన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది : కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్
తెలంగాణ తన లక్ష్యానిన నిర్దేశించుకుందని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ అన్నారు. మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధిస్తామనే ధీమాతో ఉన్నారనీ, బలంగా కృషిచేస్తే అనుకున్నదని సాధించవచ్చని చెప్పారు. పశ్చిమాసియా వంటి అనేక ఉద్రిక్తతలు ఎదురవుత న్నాయనీ, తమ ఆశయాలు, లక్ష్యాలను అన్ని రాష్ర్టాలు ఒక వేదికపై తప్పక తెలియజేయాలని అన్నారు. తాండూరు కందిప$ ఎగుమతి అవుతోందనీ, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఇటీవల జహిరాబాద్‌లో టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన జరిగిందనీ, పీఎం మిత్ర కింద కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌కు ప్రధాని శ్రీకారం చుట్టారని చెప్పారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు భారతీయులందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశ ఆర్థికాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమం ఢిల్లీ వేదికగా ఘనంగా జరుగుతున్నది. ప్రస్తుతం దసరా, కర్వా చౌత్, దీపావళి పండుగల రోజులు నడుస్తున్నాయని అన్నారు.
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026తో మరో పండుగ వచ్చిందని పేర్కొన్నారు. 700 ఏండ్ల క్రితమే కాకతీయ గణపతి చక్రవర్తి నౌకా వాణిజ్యంపై మోటుపల్లి శాసనం వేయించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. నాడే వ్యాపారులు తమ పెట్టుబడులకు భద్రత, విధాన నిర్ణయాల్లో స్థిరత్వాన్ని కోరుకున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పారిశ్రామికవేత్తలూ అవే కోరుకుంటున్నారని వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో ప్రపంచంలోని మొదటి ఐదు ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందని కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఊహించిన దానికంటే దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి సాధిస్తున్నదని తెలిపారు. ప్రస్తుతం మధ్య ఆసియా సంక్షోభం వంటి అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, సంప్రదాయ అంచనాలు, ఊహలను అధిగమించి ఎగుమతులను పెంచామని వెల్లడించారు. మరోవైపు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని సీఎం రేవంత్ పెట్టుకోవడాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వాగతించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , వాకిటి శ్రీహరి , మహమ్మద్ అజహారుద్దీన్ , పారిశ్రామికవేత్తలకు, విధాన రూపకర్తలకు, అధికారులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)