వెకిలిగా ట్వీట్ చేసి పీఎం స్థాయి దిగజార్చొద్దు
ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రలో బీజేపీ ఓడిపోబోతుందా? : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వెకిలీగా ట్వీట్ చేస్తూ ప్రధానమంత్రి స్థాయిని దిగజారుస్తున్న నరేంద్రమోడీకి నిజంగా ధైర్యముంటే ప్రెస్ మీట్ పెట్టాలని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. కర్నాటక ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పనై పోతుందంటున్న, బీజేపీ ఓడిన ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రలలో అక్కడి ప్రభుత్వాలు ఓడిపోబోతున్నాయని చెబుతున్నారా అని ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి టీచర్స్ నియోజకవర్గంలో, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్ లో, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సొంత పట్టణంలో, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నోలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానంలో, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ప్రాబల్యం ఉన్న పాట్నా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ ఓడిపోయిందని గుర్తుచేశారు.
వారణాసిలో ఓటమి వైఫల్యాలకు మోడీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. యుపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత ప్రాంతం గోరఖ్ పూర్ లో బీజేపీ గట్టిపోటీ ఎదుర్కొందని తెలిపారు. చదువుకున్న వారితో పాటు, క్రమేణా అన్ని వర్గాల ప్రజల ఆదరణను బీజేపీ కోల్పోతున్నదని తెలిపారు. బీజేపీకి బ్యాలెట్ తో బుల్లెట్ దింపామని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం లేని నరేంద్రమోడీ ట్వీట్ పెట్టి పైశాచికానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మూడంకెల స్థానాలు కూడా రావనీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధపడ్డారని తెలిపారు. ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా తొలగించిన 13.3 కోట్ల ఓట్లను వెంటనే తిరిగి చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాకతో తెలంగాణకు ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని కొట్టిపారేశారు.
ఎల్ నినో ప్రభావంపై మాజీ మంత్రి హరీశ్ రావు మాటలు విని సిద్ధిపేట ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖకు అండగా ఉంటామని తెలిపారు.
వార్ రూం, కనెక్ట్ సెంటర్ తో కలిసి పని చేయండి :మహేశ్ కుమార్ గౌడ్
నల్లగొండ - వరంగల్ - ఖమ్మంతో పాటు రంగారెడ్డి - హైదరాబాద్ - మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ కోరారు. గురువారం టీపీసీసీ వికలాంగుల విభాగం అధ్యక్షులు ముత్తినేని వీరయ్య మహేశ్ కుమార్ గౌడ్ ను కలిసి క్షేత్రస్థాయిలో చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. వికలాంగుల విభాగం తరపున 77 నియోజకవర్గాలకు 233 మంది ఇంచార్జిలను నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వికలాంగుల విభాగం చేస్తున్న కృషిని మహేశ్ కుమార్ గౌడ్ అభినందించారు. వికలాంగ పట్టభద్రులతో పాటు ఇతర పట్టభద్రుల నమోదుకు కృషి చేయాలని ఆయన సూచించారు.






కామెంట్లు (0)