Magazines

రిమ్స్‌లో నిండు గర్భిణి మృతి

1 గంట క్రితం

Pregnant
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 3 నిమిషాల చదవడం

కడుపులోనే ప్రాణం కోల్పోయిన ఇద్దరు కవలలు

బంధువుల ఆందోళన.. పోలీసులకు ఫిర్యాదు
సమగ్ర విచారణకు కమిటీ ఏర్పాటు

నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్

​కడుపులో ఎదుగుతున్న ఇద్దరు బిడ్డల భవిష్యత్‌ గురించి ఎన్నో ఆశలతో కాలం గడిపిన గర్భిణి ప్రాణం కోల్పోవడం ఆదిలాబాద్‌‌ రిమ్స్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లితోపాటే కడుపు లోని కవల పసికందులు ప్రాణం కోల్పోయారు. ఇటీవల రిమ్స్‌ ఏసీ పేలి ఐదుగురు పసికందులు మృతి చెందిన విషాద ఘటన మరకముందే నిండు గర్భిణి ప్రాణం కోల్పోవడం రిమ్స్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివరాలిలా ఉన్నాయి..

పాత ఉట్నూర్‌కు చెందిన బోర్కరి సునీత(31) 8 నెలల గర్భిణి. కడుపులో కవల పిల్లలు ఉం డటం, కాళ్ల వాపులు, ప్రీ-ఎక్లాంప్సియా లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఈ నెల 21న ఆమెను రిమ్స్ ప్రసూతి విభాగంలో చేర్చారు. ప్రారంభంలో ఆమె ఆరోగ్య పరిస్థితి, కడుపులోని బిడ్డల గుండె స్పందనలు నిలకడగానే ఉన్నాయని వైద్యులు చెప్పారు. అయితే, ఈ నెల 24 తెల్లవారు జామున ఆమె పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. తీవ్ర శ్వాసకోశ ఇబ్బందికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో సునీతను మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌‌కు తరలించారు. అత్యవసర చికిత్స, సీపీఆర్ అందించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఉదయం 6:30 గంటలకు సునీత మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. తల్లితో పాటు కడుపు లో ఊపిరి పోసుకుంటున్న ఇద్దరు పసికందులు కూడా విగతజీవులుగా మారడం ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.

​​నిర్లక్ష్యం చేశారని కుటుంబీకుల ఆరోపణలు

శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలోనే సునీత పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, ఆ విషయాన్ని అక్కడున్న సిబ్బందికి, వైద్యులకు చెప్పినా సరైన సమయంలో స్పందించలేదని బంధువులు కన్నీటి పర్యంతమ య్యారు. సకాలం లో సరైన చికిత్స అందించి ఉంటే తమ బిడ్డ బతికేదని, వైద్యుల నిర్లక్ష్యమే ఆమెను, పుట్టబోయే బిడ్డలను బలితీసుకుందని ఆరోపిస్తూ ఎంఐసీయూ వద్ద ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. సునీత మరణంపై రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్ జై సింగ్, డీఎంహెచ్‌ఓ సాధన స్పందిస్తూ.. ప్రాథమిక విచారణ చేప ట్టారు. గర్భధారణ సమయంలో అరుదుగా వచ్చే పల్మనరీ ఎంబోలిజం (ఊపిరి తిత్తుల్లో రక్తం గడ్డకట్టడం) లేదా పెరిపార్టమ్ కార్డియోమయోపతి (గుండె కండరాల వైఫల్యం) వంటి క్లిష్టమైన సమస్యల వల్లే అకస్మాత్తుగా గుండె పనిచేయడం ఆగిపోయి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తు న్న‌ట్టు అధికారులు తెలిపారు. అయితే అసలు కారణాన్ని నిర్ధారించడానికి అనుభవజ్ఞు లైన వైద్యులతో కూడిన సమగ్ర విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.


​వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణి మృతి : సీపీఐ(ఎం)

రిమ్స్‌లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే గర్భిణి బోర్కర్ సునీత మృతిచెందిందని సీపీఐ(ఎం) ఆదిలాబాద్‌ ఏరియా కమిటీ కార్యదర్శి లంక రాఘవులు అన్నారు. ఈ ఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శనివారం రిమ్స్ ను సందర్శించిన అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహిం చిన మీడియా సమావేశంలో రాఘవులు మాట్లాడారు. సునీత ప్రసవం కోసం నాలుగు రోజుల కిందట రిమ్స్ లో చేరినప్పటికీ, సరైన వైద్యం అందక మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపినట్టు చెప్పారు. చికిత్స అందించాలని వేడుకున్నా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు ఆరోపిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని, ఆమె భర్త రాజుకు రిమ్స్‌లో ఉద్యోగం కల్పించాలని కోరారు. వారి కుమార్తె బాధ్యతను ప్రభుత్వం తీసుకొని, చదువుతో పాటు ఇతర అవసరాలకు పూర్తి సహకారం అందించాలని అన్నారు. రిమ్స్‌లో వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టేందుకు ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్