Magazines

పోలీస్ వ్యవస్థ విశ్వసనీయతను కాపాడాలి

14 నిమిషాల క్రితం

police
avatar
balaji

ప్రచురించబడింది నవం 11, 2026 | 3 నిమిషాల చదవడం

హోదాను జాగ్రత్తగా ప్రజల కోసం వాడాలి

అవసరమైతే అధ్యయనం కోసం విదేశాలకు పంపిస్తా...
ప్రొబేషనరీ డీయస్పీల ముఖాముఖిలో సీఎం రేవంత్ రెడ్డి


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

సమాజంలో పోలీస్ వ్యవస్థకు ఉన్న విశ్వసనీయతను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మంగళవారం హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రొబేషనరీ డీయస్పీల ముఖాముఖి కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొబేషనరీ డీయస్పీల శిక్షణకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రొబేషనరీ డీయస్పీలకు అవార్డు లను అందజేశారు. క్రైమ్ సీన్స్ ఫోరెన్సిక్ హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనేక మంది సీనియర్ పోలీసు అధికారులు నిక్కచ్చిగా పని చేయడం వల్లనే సమాజంలో పోలీసు వ్యవస్థకు గుర్తింపు వచ్చిందని తెలిపారు. వారు సర్వం ఒడ్డి శాంతిభద్రతలను కాపాడినందునే ప్రజలు పోలీసు వ్యవస్థను విశ్వసిస్తున్నారని గుర్తుచేశారు. ఆ విశ్వసనీయతను కాపాడందుకు డీయస్పీ తమ హోదాను జాగ్రత్తగా ప్రజల కోసం వాడితే అంత బాగుంటుందని సూచించారు.

2011 తర్వాత గ్రూప్ -1 నియామకాలు లేవనీ, మరి కొన్ని నెలలు ఆలస్యమైతే అభ్యర్థులు వయో పరిమితి దాటిపోయే సంక్లిష్ట పరిస్థితిలో ప్రభుత్వం నియామకాలు చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో ప్రశ్నాపత్రాలు, ఇతర అంశాల్లో గందరగోళంలో బాధితులుగా ఆనాటి ప్రభుత్వ నిర్ణయాలతో కష్టనష్టాలు పడ్డారని గుర్తుచేశారు. తాను సీఎం అయ్యాక యూపీఎస్సీ విధానాలను అధ్యయనం చేసి టీజీపీయస్సీని ఆ తరహాలో రూపొందించినట్టు తెలిపారు. పోటీ పరీక్షలు నిర్వహించడంలో అనుభవం కలిగి చిత్తశుద్ధి ఉన్న వారిని బోర్డు సభ్యులుగా నియమించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలోని విద్యార్థుల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఉండాలనీ వెంకటేశంను చైర్మెన్ గా నియమించినట్టు తెలిపారు. 112 మంది డీయస్పీల నియామకాల్లో పూర్తి స్థాయిలో పారదర్శకత పాటించామనీ, ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న వారి పిల్లలు కూడా ఈ నియామకాల్లో ఉన్నారని ముఖ్యమంత్రి ఉదహరించారు.

పని గట్టుకుని కొంత మంది రూ.కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేసినీ సుప్రీంకోర్టు వరకు వెళ్లి నియామకాన్ని సాధించామని ఆయన గుర్తుచేశారు. జ్ఞానం, చిత్తశుద్ధి, అంకితభావంతో డియస్పీల నియామకమైన వారంతా తమ నేపథ్యాన్ని మరిచిపోవద్దని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కోరారు. ఏ ఉద్దేశంతో పోలీస్ శాఖలో చేరారో అది గుర్తుపెట్టుకోవాలని కోరారు. లక్ష్యం పెట్టుకుని ప్రయత్నిస్తే అసాధ్యమైందేది ఉండదన్నారు. లక్ష్యం పెట్టుకున్నందునే డియస్సీ పోస్టులను సాధించగలిగారని గుర్తుచేశారు. రాబోయే 30 ఏండ్ల తెలంగాణ భవిష్యత్తు ఏ దిశగా నడిపించాలో డియస్పీల చేతుల్లోనే ఉంటుందనీ, వారి ఫీడ్ బ్యాక్, నిర్ణయాలే ప్రభుత్వ పనితీరుకు గీటురాయి అని సీఎం స్పష్టం చేశారు. నిజాయితీగా డ్యూటీ చేయాలనీ, బాధ్యతను గుర్తించి పని చేస్తే ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుందన్నారు. ప్రజల సమస్యలను వినాలనీ, అర్థం చేసుకుని పరిష్కరించాలని కోరారు. బాధితులును కూర్చోబెట్టి ప్రేమ పూర్వకంగా మాట్లాడాలనీ, సమస్యను అర్థం చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగం రాసే సమయంలో దేశంలో అత్యాచారాలు, హత్యలు, ఆహార కొరత అనే మూడు సమస్యలు అధికంగా ఉన్నాయని సీఎం తెలిపారు.


మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఓపెన్ ఎకానమీ తీసుకువచ్చిన తర్వాత ప్రపంచంలోని అన్ని సమస్యలు మన దగ్గరకు వచ్చాయనీ, అందులో ముఖ్యమైనది సైబర్ క్రైమ్ అని చెప్పారు. వ్యక్తుల మధ్య పరిచయం లేకుండా, కనీసం చూడకుండా సర్వం దోచుకునే పరిస్థితి సైబర్ క్రైమ్‌లో ఉందని గుర్తుచేశారు. " ఇప్పుడు నేరాలు, వాటి ప్రవృత్తి మారిపోయింది. డ్రగ్స్ సరఫరాను నియంత్రించడంలో యుద్ధ వీరులను ఇచ్చిన పంజాబ్ కూడా విఫలమైంది. సిక్కు రెజిమెంట్‌లో ఇప్పుడు సిక్కులు లేరు. బ్రిటీషర్లు కూడా భయపడిన సిక్కు జాతి డ్రగ్స్ విషయంలో నిర్వీర్యమైంది. డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ ఫోర్స్‌ను తీసుకువచ్చి అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ, ట్రాఫిక్, డ్రగ్స్ కంట్రోల్, సైబర్ క్రైమ్‌ల కోసం సరికొత్త వ్యవస్థలను తీసుకువచ్చాం. అవసరమైతే నూతన డీయస్పీలను అధ్యయనం కోసం విదేశాలకు పంపిస్తాం. డీయస్పీలు తమ ఫిట్‌నెస్‌పై మరింత ఫోకస్ పెట్టాలి. గరం, నరం, బేషరమ్ పరిస్థితి మీకు ఎదురుకావొద్దని నేను కోరుకుంటున్నాను....." అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు శివధర్ రెడ్డి, ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ వైస్ చైర్‌పర్సన్ శాంత‌కుమారి, డీజీపీ సీవీ ఆనంద్, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్