Magazines

కార్మికులకిచ్చిన హామీలు అమలు చేయాలి

1 గంట క్రితం

The promises made to the workers must be implemented.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 3 నిమిషాల చదవడం

ప్రజా భవన్ లో వినతి పత్రం అందజేసిన సీఐటీయూ నేతలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హమీలను ప్రభుత్వం అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ ‌చేసింది. ఈ నెల 25,26 తేదీల్లో హైదరాబాద్‌ ‌ధర్నా చౌక్‌‌లో నిర్వహించిన మల్టీపుల్‌ ‌డేస్‌ మహాధర్నా సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా తరలి వచ్చిన వివిధ రంగాల కార్మికులు తమ సమస్యల గోడును ‌వెళ్లబోసుకున్నారు. వాటిని పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్‌‌లోని ప్రజాభవన్‌‌లో ‘సీఎం ప్రజావాణి’ ఇన్ చార్జి గద్వాల్ విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అనేక సమస్యలు పరిష్కారం కాకపోవటంతో కార్మికులు తీవ్ర ఆసంతృప్తిలో ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రాష్ట్రంలో అమలు చేస్తే వారు మరింత నష్టపోయి వెట్టిచాకిరి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాలరాసే ఆ కోడ్‌‌ల అమలు నిర్ణయాన్ని రాష్ట్రంలో నిలుపుదల చేయాలని, ఇతర సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రయివేట్ రంగంలో భారీ, మధ్యతరహా, చిన్న, సూక్ష్మ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు సవరించాలని విజ్ఞప్తి చేశారు. 15వ ఐఎల్ సీ తీర్మానం, 1992 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికుల జీవన వ్యయం లెక్కిస్తే ప్రస్తుతం రూ.42వేలు కనీస వేతనంగా నిర్ణయించాలని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో నెం.6లో అతి తక్కువ వేతనాలు నిర్ణయించారని తెలిపారు. ఆ వేతనాలను కూడా రాష్ట్రంలో ఎక్కడా, ఏ పరిశ్రమల్లో అమలు చేయడం లేదని తెలిపారు. జీఓ నెం. 6ను అన్ని పరిశ్రమల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. భౌగోళికంగా (జోన్స్ ఆధారంగా) నిర్ణయించిన వేతనాల పద్ధతిని రద్దు చేయాలని కోరారు. కార్మిక సంక్షేమ చట్టాలైన కనీస వేతనం, ఈఎస్ఐ, పీఎఫ్. బోనన్, సెలవులు, రక్షణ సౌకర్యాలు, పని ప్రదేశంలో సౌకర్యాలు పటిష్టంగా అమలు చేసేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు...‘ఆశ, అంగన్‌‌వాడీ, ఐకేపీ వీవోఏలకు ఫిక్స్డ్ వేతనం రూ.18వేలు ఇవ్వాలి, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10వేలు కనీస వేతనం ఇవ్వాలి, మల్టీపర్సన్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి, మున్సివల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి, పీఆర్‌‌సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలి, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు,ప్రయివేట్ ట్రాన్స్పోర్ట్, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, బీడీ కార్మికులకు కనీస పెన్షన్ రూ.7వేలు ఇవ్వాలి, 55 ఏండ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి, వీఆర్‌ఏ వారసులకు జీవో నెం.81 ప్రకారం వెంటనే ఉద్యోగాలివ్వాలి, వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ గార్డ్‌‌లకు లాస్ట్ గ్రేడ్ 4 విధానం అమలు చేయాలి, ప్రభుత్వ మీ-సేవ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వేతనాలు చెల్లించాలి, వైద్య ఆరోగ్యశాఖలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉ ద్యోగుల సర్వీసులను రెగ్యులైజేషన్ చేయాలి, 104 ఉద్యోగుల బకాయి జీతాలు చెల్లించాలి, ఆర్టీసీ కార్మికులకు పెండింగ్లో ఉన్న పీఆర్‌‌సీ బకాయిలు చెల్లించడంతో పాటు ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు చెల్లించాలి...’ అని డిమాండ్‌ ‌చేశారు. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయటం, పెర్మ్స్ పైన ఇన్‌‌కం టాక్స్ రీ-ఎంబర్స్‌‌మెంట్ చేయాలనీ, సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలనీ. రాష్ట్ర ప్రభుత్వ హామీతో జెన్‌‌కో, ఇతర సంస్థలకు సింగరేణి బొగ్గు సప్లై చేసినందున, రూ.56 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. వాటిని తక్షణం చెల్లించి సంస్థను ఆదుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. సింగరేణిలో 30వేల మంది కాంట్రాక్ట్ పర్కర్లకు హైపవర్ వేజెన్ చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. విద్యుత్ రంగంలో 23వేల మంది ఆర్టిజెన్స్ సర్వీసులను కన్వర్షన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, ఎస్వీ రమ, పి. జయలక్ష్మి, వి.ఎస్. రావు, కె. ఈశ్వర్‌‌రావు, రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, ఎం. పద్మశ్రీ, కె. రమేష్, పుప్పాల శ్రీకాంత్, కె. గోపాలస్వామి, వి. సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, ఎ. సునీత, మధ్యాహ్న భోజనం యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వై. స్వప్న, ఐకెపి విఓఏ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నగేష్, ఇంజనీరింగ్ కాలేజ్ వర్కర్స్ యూనియన్ నాయకులు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్