పీఎంయూ సరఫరాలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలు గురుకులాలు కేజీబీవీలకు ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన నిత్యావసర సరుకులు, విద్యా సామగ్రి, విద్యార్థుల కిట్లను నిర్ణీత గడువులోగా అందించడంలో ఎలాంటి జాప్యం జరిగినా ఉపేక్షించేది లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఆహారం, వసతి, నిత్యావసరాల సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా బాధ్యులను చేస్తామని, విద్యార్థుల సంక్షేమానికి విఘాతం కలిగించే లోపాలను ఎంతమాత్రం సహించబోమని హెచ్చరించారు.
శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురుకుల విద్యాసంస్థలకు పీఎంయూ (ప్రాజెక్ట్ మానిట రింగ్ యూనిట్) ద్వారా జరుగుతున్న నిత్యావ సర సరుకులు, విద్యార్థుల కిట్లు, ఇతర సామగ్రి సరఫరాపై మంత్రి సమగ్ర సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారుల నుంచి సరఫరా పురోగతి, పెండింగ్లో ఉన్న వస్తువులు, వాటి నాణ్యత, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ తదితర అంశాలపై వివరాలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.
సరఫరాలో జాప్యంపై మఫత్లాల్ సంస్థకు హెచ్చరిక
గురుకుల విద్యాసంస్థలకు అవసరమైన వస్తువుల సరఫరా కోసం ఆగస్టు నెలలోనే టెండర్ ప్రక్రియను ఖరారు చేసి సంబంధిత కాంట్రాక్టర్లకు ఆర్డర్లు జారీ చేసినప్పటికీ, విద్యా సంస్థల నుంచి అందిన ఇండెంట్లకు అనుగుణం గా పూర్తిస్థాయిలో సరుకులు సరఫరా కాకపోవడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మఫత్లాల్ సంస్థ సరఫరాలో వెనుకబడటాన్ని ప్రస్తావిస్తూ, పెండింగ్లో ఉన్న వస్తువులన్నింటినీ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పాఠశాలలకు చేరవేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా సరఫరా చేయకపోతే టెండర్ ఒప్పందంలోని నిబంధ నలు, షరతుల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో మఫత్లాల్ సంస్థ ప్రతినిధి, పెండింగ్లో ఉన్న వస్తువులను ఈ నెల 16 లోపు అన్ని వస్తువులు సరఫరా చేస్తామని మంత్రికి హామీ ఇచ్చారు.
సరఫరాపై స్పష్టమైన నివేదిక
విద్యాసంస్థలు సమర్పించిన ఇండెంట్లకు అనుగుణంగా అన్ని వస్తువుల సరఫరాను పూర్తి చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. నవంబర్ 25 నాటికి సరఫరా సంస్థలు అన్ని వస్తువుల సరఫరా పురోగతిపై సమగ్ర వివరాలు అందించాలని, పెండింగ్లో ఉన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని సూచించారు. ఏవైనా లోటుపాట్లు గుర్తిస్తే తక్షణమే సరిదిద్ది, విద్యార్థులకు అవసరమైన వస్తువులు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
సంక్షేమంలో నిర్లక్ష్యానికి తావులేదు
గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత, ఆహార పదార్థాల సరఫరా, ఇతర నిత్యావసరాల నిర్వహణ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, వారి ఆహారం, ఆరోగ్యం, విద్య, వసతి విషయంలో ఏ చిన్న లోపం జరిగినా బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ సమీక్షలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి, పీఎంయూ చైర్మెన్ గుగులోతు రవి, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి బి.ఎల్. సంతోష్, పీఎంయూ గుత్తేదారులు , తదితరులు పాల్గొన్నారు.
ప్రతి వస్తువు నాణ్యతపై నిఘా..
గురుకులాలకు సరఫరా చేస్తున్న ప్రతి వస్తువు నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని మంత్రి సూచించారు. సరఫరా చేసిన వస్తువులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? వాటిని పరిశీలించి ధ్రువీకరిస్తున్న అధికారులు ఎవరు? ప్రతి విద్యాసంస్థలో సరుకుల స్వీకరణ, నిల్వ, పంపిణీ బాధ్యతలను ఎవరు పర్యవేక్షిస్తున్నారు? అనే అంశాలపై అన్ని శాఖల అధిపతులు (హెచ్ఓడీలు) సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
బఫర్ స్టాక్ తప్పనిసరి
గురుకుల విద్యాసంస్థల్లో నిత్యావసర సరుకులు, విద్యార్థులకు అవసరమైన సామగ్రి కొరత ఏర్పడకుండా ముందస్తుగా బఫర్ స్టాక్ (అదనపు నిల్వలు) నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. అన్ని జిల్లాల్లోని గురుకులాలను పర్యవేక్షించేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలని, ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని గుత్తేదారులు నియమించి సరుకుల నిల్వలు, సరఫరా, పంపిణీపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. సంక్షేమ గురుకులాల అధికారులతో సమన్వయం చేసుకొని ఎలాంటి జాప్యానికి తావు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.





కామెంట్లు (0)