450 స్థానాలకుగాను 349 స్థానాలు కైవసం
పదేండ్లలో తొలిసారిగా
60 శాతానికి పైగా పోలింగ్ నమోదు
ఎన్నికల వేళ రష్యాపై
1110 డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్
మాస్కో : రష్యా పార్లమెంటరీ ఎన్నికల తుది ఫలితాల్లో పుతిన్ పార్టీ సత్తా చాటింది. ఊహించినట్లుగానే ఈ ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన 'యునైటెడ్ రష్యా' పార్టీ ఏకపక్ష విజయం సాధించింది. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల సమయంలో ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు పాల్పడినా పోలింగ్ మాత్రం రికార్డు స్థాయిలో నమోదైంది.
450 స్థానాలకు గాను 349 స్థానాలు కైవసం
రష్యా దిగువ సభ 'స్టేట్ డూమా' ఎన్నికల్లో క్రెమ్లిన్ ఆధిపత్యం మరోసారి నిరూపితమైంది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఎన్నికల తుది ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 450 స్థానాలకు గాను పుతిన్ నేతృత్వంలోని 'యునైటెడ్ రష్యా' పార్టీ ఏకంగా 349 స్థానాలను కైవసం చేసుకుని మూడొంతుల మెజారిటీ సాధించింది. ఆ పార్టీకి రికార్డు స్థాయిలో 58 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 11 కోట్లకుపైగా ఓటర్లలో దాదాపు 60 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత పదేళ్లలో రష్యా పార్లమెంటరీ ఎన్నికల్లో ఇంత భారీ పోలింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు మూడు రోజుల పాటు ఆఫ్‌లైన్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఆన్‌లైన్ ఓటింగ్‌కు కూడా అవకాశం కల్పించారు. ప్రభుత్వానికి మద్దతు పలికే 'సిస్టమిక్ అపోజిషన్'కు చెందిన పలు చిన్న పార్టీలు 97 స్థానాలు గెలుచుకోగా, మిగిలిన నాలుగు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. మాస్కో ఆక్రమించుకున్న నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాలతో పాటు 2014లో విలీనం చేసుకున్న క్రిమియాలోనూ రష్యా పోలింగ్ నిర్వహించింది. దీన్ని ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ ఈ ఘనవిజయం తమ విధానాలకు ప్రజల మద్దతుకు నిదర్శనమని అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.
మాస్కోలో డ్రోన్ దాడుల కారణంగా ముగ్గురు మృతి, 38 మందికి గాయాలు
మరోవైపు ఈ ఎన్నికలకు ఆటంకం కలిగించేందుకు ఉక్రెయిన్ తీవ్రంగా ప్రయత్నించింది. పోలింగ్ సమయంలో రష్యాపై భీకర డ్రోన్ దాడులకు పాల్పడింది. ఆదివారం రాత్రి ఏకంగా 1,110 డ్రోన్లను రష్యా సైన్యం కూల్చివేసింది. రాజధాని మాస్కోపై ఏకంగా 450 డ్రోన్లతో దాడి చేయగా వాటిని గాల్లోనే అడ్డుకున్నట్లు మాస్కో మేయర్ తెలిపారు. మాస్కోపై ఇదే అతిపెద్ద దాడి అని ఆయన పేర్కొన్నారు. డ్రోన్ దాడుల కారణంగా ఒక చమురు శుద్ధి కర్మాగారంతో పాటు ఒక నివాస భవనం దెబ్బతింది. మాస్కో పరిధిలో ముగ్గురు పౌరులు మరణించగా, 38 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ కాల్పుల కారణంగా ఆరుగురు పోలింగ్ సిబ్బంది మృతి చెందారని, 75 పోలింగ్ కేంద్రాలు ధ్వంసమయ్యాయని రష్యా ఎన్నికల సంఘం వెల్లడించింది.






కామెంట్‌లు (0)