హాకీ అమ్మాయిల చారిత్రక పసిడి
లవ్లీనా, అంకుశ్, పర్వీన్ బంగారు పంచ్
ఆర్చరీ రికర్వ్‌లో మహిళల పసిడి గురి
రెజ్లింగ్‌లో
సుజిత్ పసిడి పట్టు
ఆసియా క్రీడలు 2026
ఆసియా క్రీడల 13వ రోజు భారత్ పసిడి సిక్సర్ కొట్టింది. 44 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ హాకీ అమ్మాయిలు స్వర్ణం సాధించగా.. బాక్సింగ్‌లో లవ్లీనా బొర్గొహైన్, పర్వీన్, అంకుశ్‌లు బంగారు పంచ్‌తో మెరిశారు. ఆర్చరీ రికర్వ్ మహిళల జట్టు బంగారు పతకం సాధించగా, రెజ్లింగ్‌లో సుజీత్ పసిడి పతకం పట్టుకొచ్చాడు. ఒక్క రోజులో ఆరు పసిడి పతకాలు సాధించిన టీమ్ ఇండియా పతకాల పట్టికలో టాప్-5లోకి దూసుకొచ్చింది.
నగోయా (జపాన్)
టోక్యో ఒలింపిక్స్‌లో నాల్గో స్థానంలో నిలిచి పతకానికి అడుగు దూరంలో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు.. ఆసియా క్రీడల్లో పసిడి పతకంతో లాస్‌ఎంజెలిస్ ఒలింపిక్స్‌కు బెర్త్ బుక్ చేసుకుంది. ఆసియా క్రీడల్లో పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం. అందుకు చైనాపై పైచేయి సాధించాల్సి ఉందని జపాన్‌కు బయల్దేరుతూ హాకీ కెప్టెన్ సలీమా టెటె వ్యాఖ్యానించింది. పసిడి వేటలో చైనాను ఢీకొట్టిన భారత్ 1-0తో విజయం సాధించింది. ఆసియా క్రీడల పసిడితో పాటు 2028 ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించింది. 44 ఏండ్ల తర్వాత ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో చైనా ఫేవరేట్‌గా బరిలోకి దిగినా.. భారత అమ్మాయిలదే పైచేయిగా నిలిచింది. ఆట మొదలైన పదో నిమిషంలోనే భారత్ ఆధిక్యంలో నిలిచింది. పదో నిమిషంలో సాక్షి నుంచి పాస్ అందుకున్న లాల్‌రెమిసియామి మెరుపు గోల్‌తో చైనా గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించింది. 22వ నిమిషంలో చైనా గోల్‌కు చేరువైనా భారత గోల్‌కీపర్ గోడ కట్టేసింది. ప్రథమార్థంలో ఆధిక్యం నిలుపుకున్న భారత్.. ద్వితీయార్థంలోనూ అదే జోరు కొనసాగించింది. బలమైన డిఫెన్స్‌తో చైనా ఎదురుదాడికి భారత్ చెక్ పెట్టింది. 1-0తో చైనాపై గెలుపొందిన భారత్ చారిత్రక ఆసియా క్రీడల పసిడి పతకం సొంతం చేసుకుంది.
బాక్సింగ్‌లో తీన్‌మార్
బాక్సింగ్‌లో మనోళ్లు తీన్‌మార్ మోగించారు. శుక్రవారం జరిగిన పసిడి బౌట్స్‌లో ముగ్గురు బాక్సర్లు బంగారు పతకాలు సాధించారు. మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గొహైన్, మహిళల 65 కేజీల విభాగంలో పర్వీన్, పురుషుల 80 కేజీల విభాగంలో అంకుశ్ గోల్డ్ మెడల్స్ గెల్చుకున్నారు. చైనా బాక్సర్ బావోపై 5-0తో గెలుపొందిన లవ్లీనా బొర్గొహైన్ 2014 తర్వాత ఆసియా క్రీడల్లో పసిడి పతకం సాధించిన రెండో మహిళా బాక్సర్‌గా నిలిచింది. తైవాన్ బాక్సర్ చెన్ చిన్‌తో హోరాహోరీ బౌట్‌లో పర్వీన్ హుడా 3-2తో విజయం సాధించింది. దక్షిణ కొరియా బాక్సర్ మిన్సియోంగ్‌పై 4-0తో అంకుశ్ గెలుపొంది పసిడి పంచ్ విసిరాడు.
ఆర్చరీ, రెజ్లింగ్‌లోనూ జోరు
కాంపౌండ్ ఆర్చరీలో భారత జట్లు పసిడి ధమాకా చూపించగా.. రికర్వ్ జట్టు సైతం మెప్పించింది. రికర్వ్ మహిళల జట్టు పసిడి పతకం సాధించింది. కుమ్‌కుమ్ మహ్మద్, అంకిత, కీర్తి శర్మ త్రయం పసిడి పతకం అందుకుంది. పది సార్లు పసిడి విజేత దక్షిణ కొరియాపై 5-3తో భారత్ గెలుపొందింది. ఆసియా క్రీడల్లో రికర్వ్ ఆర్చరీ 1978లో ప్రవేశపెట్టగా.. భారత్‌కు ఫైనల్‌కు చేరటం, దక్షిణ కొరియా ఫైనల్లో ఓడిపోవటం ఇదే ప్రథమం!. రికర్వ్ పురుషుల జట్టు ఇరాన్‌పై 6-0తో ఫైనల్‌కు చేరినా.. పసిడి వేటలో దక్షిణ కొరియా చేతిలో 1-5తో ఓటమి చెందారు. నీరజ్ చౌహాన్, ధీరజ్, యశ్‌దీప్‌లు సిల్వర్‌తో సరిపెట్టుకున్నారు. రికర్వ్ మిక్స్‌డ్ ఫైనల్లో ధీరజ్, కుమ్‌కుమ్ జోడీ 3-5తో చైనా చేతిలో ఓటమి చెంది రజత పతకం దక్కించుకున్నారు. రెజ్లింగ్‌లో అరంగేట్ర సుజీత్ కల్‌కల్ బంగారు పతకం నెగ్గాడు. పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ పసిడి పోరులో తజికిస్తాన్ రెజ్లర్ కుడీవ్‌పై 10-9తో సుజీత్ గెలుపొందాడు. ఆసియా క్రీడల్లో తొలిసారి పోటీపడిన సుజీత్ తొలి ప్రయత్నంలోనే బంగారు పట్టుతో ఆకట్టుకున్నాడు.
ఆ రెండింట కాంస్య పతకాలు
సెపక్‌తక్రా, సెయిలింగ్‌లో భారత్ పతకాలు సాధించింది. సెపక్‌తక్రాలో పురుషుల జట్టు సెమీఫైనల్లో ఆతిథ్య జపాన్ చేతిలో ఓటమి చెందింది. 12-15, 13-15వో వరుస సెట్లలో భారత జట్టు నిరాశపరిచింది. సెమీస్‌లో ఓడినా, భారత జట్టు కాంస్య పతకం దక్కించుకుంది. సెయిలింగ్‌లోనూ భారత్‌కు కాంస్యం దక్కింది. మహిళల స్కిఫ్ విభాగంలో హర్షిత తోమర్, శీతల్ వర్మ 24 నెట్ పాయింట్లు, 28 ఓవరాల్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకున్నారు.
సీఎం, మంత్రి అభినందనలు
ఆసియా క్రీడల్లో పసిడి పతకం సాధించిన మహిళల హాకీ జట్టుకు సీఎం రేవంత్‌రెడ్డి, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలిపారు. ఆసియా క్రీడల పర్యటనలో శుక్రవారం భారత సెపక్‌తక్రా సెమీఫైనల్ మ్యాచ్‌కు వీక్షించిన వాకిటి శ్రీహరి కాంస్య పతకం సాధించిన అబ్బాయిలను అభినందించారు.






కామెంట్‌లు (0)