మహిళల రిలే పరుగులో గోల్డ్ మెడల్
ట్రాప్ షూటింగ్‌లో నీరూ బంగారు గురి
ఆసియా క్రీడలు 2026
నగోయా (జపాన్) : ఆసియా క్రీడల్లో భారత్ 44 ఏండ్ల పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పసిడి రికార్డును పదిలంగా కొనసాగిస్తోంది. 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడల నుంచి ప్రతిసారి అథ్లెటిక్స్‌లో భారత్ అథ్లెటిక్స్‌లో కనీసం ఓ పసిడి పతకం సాధిస్తూనే ఉంది. 2026 నగోయా ఆసియా క్రీడల్లోనూ ఆ సంప్రదాయం కొనసాగింది. మహిళల 4(400) రిలే పరుగులో భారత్ పసిడి పతకం సాధించింది. కిరణ్, పూవమ్మ, ప్రాచి, విథ్య రామరాజ్‌లు 400 మీటర్ల రిలే పరుగును 3 నిమిషాల 29.69 సెకండ్లలో ముగించారు. అగ్రస్థానంలో నిలిచిన భారత అమ్మాయిల జట్టు బంగారు పతకం సొంతం చేసుకుంది. బహ్రెయిన్ అమ్మాయిలు 3 నిమిషాల 30.21 సెకండ్లతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ సాధించగా, చైనా అమ్మాయిలు 3 నిమిషాల 31.02 సెకండ్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నారు. స్పింటర్ విథ్య రామరాజ్‌కు ఈ క్రీడల్లో ఇది మూడో మెడల్ కావటం విశేషం. మిక్స్‌డ్ రిలే 4(400) జట్టు తరఫున సిల్వర్ సాధించిన విథ్య, 400మీటర్ల హార్డిల్స్‌లో కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు షూటింగ్‌లో నీరూ దండా సైతం బంగారు ప్రదర్శన కనబరిచింది. టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు సిల్వర్ మెడల్ అందించిన నీరూ దండా.. వ్యక్తిగత ట్రాప్ ఈవెంట్‌లో ఏకంగా పసిడి పతకమే గురి పెట్టింది. అర్హత రౌండ్‌లో అగ్రస్థానంలో నిలిచిన నీరూ దండా.. మంగళవారం జరిగిన ఫైనల్లో 30 టార్టెట్స్‌లో 28 షూట్ చేసింది. చైనా షూటర్ సన్ యునాంగ్ 26 షూట్స్‌తో సిల్వర్ మెడల్ సాధించగా, కువైట్ షూటర్ 21 షూట్లతో కాంస్యం సాధించింది. అంతకుముందు, జరిగి మహిళల ట్రాప్ జట్టు విభాగంలో నీరూ దండా, ఆషిమా అహ్లావత్, మనీశ ఖేర్ త్రయం 328 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. నీరూ దండా ట్రాప్‌లో పసిడి, రజత పతకాలతో అదరగొట్టింది. ఆసియా క్రీడల్లో భారత్ ఆరు పసిడి పతకాలు, 21 సిల్వర్ మెడల్స్, 25 కాంస్యాలు సహా 52 పతకాలతో టాప్-10లో కొనసాగుతోంది. చైనా 143 పసిడి, 62 సిల్వర్, 49 బ్రాంజ్ సహా 254 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అథ్లెటిక్స్‌లో భారత్ పతకాల జోరు కొనసాగిస్తోంది. మహిళల జట్టు రిలే విభాగంలో పసిడి సాధించగా.. పురుషుల జట్టు సైతం 4(400) రిలే రేసులో కాంస్య పతకం సాధించింది. 4 (400) మిక్స్‌డ్ రిలే రేసులో సైతం కాంస్య పతకం సొంతమైంది. మహిళల హైజంప్‌లో పూజ కాంస్య పతకంతో మెరువగా, గుల్వీర్ సింగ్ ఆసియా క్రీడల్లో ముచ్చటగా మూడో మెడల్ సాధించాడు. పురుషుల 5000మీటర్ల రేసులో గుల్వీర్ సింగ్ కాంస్య పతకం దక్కించుకున్నాడు. ఇక బాక్సింగ్‌లో మెన్స్ 90+ కేజీల విభాగం సెమీస్‌లో నరేందర్ ఓటమిపాలై కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. మహిళల 65 కేజీల విభాగంలో పర్వీన్, మెన్స్ 80 కేజీల విభాగంలో అంకుశ్ పంఘాల్ సెమీఫైనల్లో విజయాలతో ఫైనల్‌కు చేరుకుని కనీసం రజత పతకం ఖాయం చేసుకున్నారు.






కామెంట్‌లు (0)