మధ్యాహ్నం 2 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
సిరీస్ విజయంపై
గిల్‌సేన గురి
భారత్, వెస్టిండీస్
రెండో వన్డే నేడు
నవతెలంగాణ-గువహటి
తిరువనంతపురంలో తిరుగులేని విజయం సాధించిన టీమ్ ఇండియా.. నేడు గువహటిలో సిరీస్ విజయం సాధించాలని ఎదురుచూస్తోంది. భారత్, వెస్టిండీస్ రెండో వన్డే నేడు గువహటిలో జరుగనుండగా, భారత్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఇటు బ్యాట్‌తో, అటు బంతితో కొందరు తొలి ప్రాధాన్య ఆటగాళ్లు అందుబాటు లో లేకపోయినా.. శుభ్‌మన్ గిల్ సేన బలంగా కనిపిస్తోంది. మరోవైపు వెస్టిండీస్ బ్యాట్‌తో ఫర్వాలేదు అనిపించినా, బంతితో మరీ తీసికట్టు గా తయారైంది. 2027 ఐసీసీ వన్డే ప్రణాళికల నేపథ్యంలో భారత్ ప్రణాళికలు సాగుతుండగా.. ఐసీసీ 2027 వన్డే వరల్డ్‌కప్ అర్హత టోర్నమెంట్ కు సిద్ధమయ్యేందుకు కరీబియన్లు ఈ సిరీస్‌ను చక్కటి అవకాశంగా వినియోగించుకుం టున్నా రు. భారత్, వెస్టిండీస్ రెండో వన్డే నేడు మధ్యా హ్నం 2 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్, హాట్‌స్టార్ లో ప్రసారం కానుంది. ఆ ఇద్దరు మళ్లీ మెరుస్తారా? :
గతంలో గువహటిలో వెస్టిండీస్‌తో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి శతక మోత మోగించారు. విరాట్ కోహ్లి తొలి వన్డేలోనూ అజేయ సెంచరీతో మెరిసినా, రోహిత్ ఆరంభంలో దూకుడుగా ఆడినా వికెట్ నిలుపుకోలేదు. వన్డేల్లోనూ కనిపిస్తున్న కోహ్లి, రోహిత్ నుంచి అభిమానులు స్పెషల్ ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి క్రీజులో కదం తొక్కితే ఆ రోజు క్రికెట్ ప్రియులకు పండుగే. అచ్చొచ్చిన గువహటిలో ఈ జోడీ గత ప్రదర్శన పునరావృతం చేస్తుందేమో చూడాలి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో జోరందుకున్నాడు. కెఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడేందుకు ఎదురుచూస్తున్నాడు.
భారత్ నేడు సైతం ముగ్గురు ఆల్‌రౌండర్లతో ఆడే అవకాశం కనిపిస్తోంది. నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, నమన్ ధిర్ త్రయంలో మార్పులు ఉండకపోవచ్చు. మహ్మద్ సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని అనుకుంటే.. ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బరార్‌లలో ఒకరిని బెంచ్‌కు పరిమితం చేసే అవకాశం లేకపోలేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ కొనసాగనున్నాడు.
విండీస్ పుంజుకుంటుందా? :
కరీబియన్లు గువహటిలో పుంజుకోవాలని చూస్తున్నారు. ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించని విండీస్.. అర్హత టోర్నీలో తలపడాల్సి ఉంది. తొలి వన్డేలో ఓపెనర్లు మెరిసినా.. మిడిల్, లోయర్ ఆర్డర్‌లో ఆశించిన ప్రదర్శన చేయలేదు. కాంప్‌బెల్, గ్రీవ్స్‌తో పాటు జాంగో, కార్టీ, హోప్‌లు రాణిస్తే విండీస్‌కు గట్టి పోటీ ఇవ్వగలదు. బంతితో అల్జారీ జొసెఫ్‌పై విండీస్ ఆశలు పెట్టుకున్నా.. బౌలర్లు సమిష్టిగా భారత్‌పై ఒత్తిడి పెంచటంలో విఫలం అవుతున్నారు. నేడు విండీస్ గెలుపు అవకాశాలు ఆ జట్టు బౌలింగ్‌పై ఆధారపడి ఉన్నాయి.
పిచ్, వాతావరణం
గువహటిలో ఇప్పటివరకు రెండు వన్డేలు జరిగాయి. ఆ రెండింట భారీ స్కోర్లు నమోదయ్యాయి. 2018లో విండీస్‌పై కోహ్లి, రోహిత్ శతకాలతో 323 లక్ష్యాన్ని ఊదేయగా.. శ్రీలంకపై 373 కొట్టిన భారత్ 67 పరుగులతో గెలుపొందింది. నేడూ పిచ్ బ్యాటర్లకు అనుకూలించనుంది. ఇరు జట్ల బౌలర్లకు నేడు గడ్డు కాలమే!. వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో టాస్ నెగ్గిన తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నమన్ ధిర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, గుర్నూర్ బరార్, ప్రసిద్ కృష్ణ. వెస్టిండీస్ : జాన్ కాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్, కీసీ కార్టీ, షాయ్ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆమీర్ జంగో, రూథర్‌ఫోర్డ్, రోస్టన్ ఛేజ్, మాథ్యూ ఫోర్డె, మోటీ, అల్జారీ జొసెఫ్, జేడెన్ సీయెల్స్.






కామెంట్‌లు (0)