- ఏండ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని 5 కి.మీ రోడ్డు
నవతెలంగాణ ఆత్మకూర్ : ఆత్మకూర్ పట్టణంలోని ములమల్ల క్రాసింగ్ పెట్రోల్ పంపు నుండి ములమల్ల గ్రామం వరకు ఉన్న దాదాపు 5 కిలోమీటర్ల ప్రధాన బి టి రహదారి గుంతలమయంగా మారి, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ రోడ్డుపై కిలోమీటర్ కూడా సాఫీగా ప్రయాణం చేయలేని పరిస్థితి. అడుగడుగునా పెద్ద పెద్ద గుంతలు, లేచిన తారు, విరిగిన కంకర రోడ్డు. ద్విచక్ర వాహనదారులు ఈ రోడ్డుపై వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. గుంతను తప్పించబోయి ఎదురుగా వచ్చే వాహనాన్ని ఢీకొనే ప్రమాదం ఉంది. ఆటోలు, కార్ల వంటి వాహనాల విడిభాగాలు తరచూ,దెబ్బతింటున్నాయని వాహనదారులు గ్రామస్తులు వా బోతున్నారు
వర్షాకాలంలో ఈ రోడ్డు దుస్థితి వర్ణనాతీతం. గుంతల్లో వర్షపు నీరు నిలిచి రోడ్డు ఎక్కడో, గుంత ఎక్కడో తెలియని పరిస్థితి. పాదచారులు నడవాలన్నా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా బురదమయంగా మారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయంలో గర్భిణీలు రోగులకు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలంటే అంబులెన్స్ కూడా సకాలంలో గ్రామానికి చేరుకోలేని దుస్థితి ఉంది.ఈ దారి కేవలం ములమల్ల గ్రామానికే కాదు, అక్కడి నుండి నందిమల్ల మీదుగా జూరాల డ్యాం వరకు వెళ్లే ప్రధాన మార్గం. జూరాల డ్యాంకు వచ్చే పర్యాటకులు, పంటలను మార్కెట్ కు తరలించే రైతులు ఈ రోడ్డుపైనే ఆధారపడి ఉన్నారు. రోడ్డు బాగోలేక రైతులు తమ ఉత్పత్తులను సకాలంలో మార్కెట్ కు తీసుకెళ్లలేకపోతున్నారు.
ఏళ్ల తరబడి రోడ్డు పరిస్థితి ఇలాగే ఉంది.ఇప్పటికైనా మంత్రి వాకిడి శ్రీహరి,జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులు స్పందించి, ఆత్మకూరు - ములమల్ల - జూరాల డ్యాం రహదారిని పూర్తిస్థాయిలో పరిశీలించి, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గ్రామ సర్పంచ్ రంగారెడ్డి గ్రామస్తులు, భీమన్న, షరీఫ్ రైతులు, ప్రయాణికులు కోరుతున్నారు.





కామెంట్‌లు (0)