Magazines

విద్యార్థుల హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తాం

1 గంట క్రితం

students
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్ 

నవతెలంగాణ-సంగారెడ్డి 

భగత్‌సింగ్ స్ఫూర్తితో విద్యార్థుల హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. భగత్‌సింగ్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ సమావేశంలో విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వ విద్యారంగంలో చోటుచేసుకుంటున్న మార్పులు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ప్రభుత్వ పాఠశాలలు, పాలిటెక్నిక్ విద్య తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్ మాట్లాడుతూ.. భగత్‌సింగ్ కేవలం స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాదని, శాస్త్రీయ ఆలోచన, సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప యువకుడని అన్నారు. భగత్‌సింగ్ స్ఫూర్తితో విద్యార్థుల హక్కుల కోసం ఎస్ఎఫ్ఐ  నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన సమయంలో పాఠశాలల ఏకీకరణ పేరుతో ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను భారీగా తగ్గించే చర్యలు విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. 27 వేల ప్రభుత్వ పాఠశాలలను సుమారు 4 వేల పాఠశాలలకు పరిమితం చేసే ప్రతిపాదనపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు సమీపంలోనే నాణ్యమైన ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.


స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సకాలంలో విడుదల చేయాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకుండా పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి రాకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని నాయకులు అన్నారు. అదేవిధంగా పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను నిర్వీర్యం చేసే లేదా ప్రైవేటీకరణకు దారితీసే విధానాలను విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తాయని తెలిపారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు డిప్లొమా ద్వారా సాంకేతిక విద్య మరియు ఉన్నత విద్యకు లభిస్తున్న అవకాశాలను కాపాడాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎస్ఎఫ్ఐ  నాయకులు జయరాజు మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ విద్య, విద్యార్థుల హక్కులు, సామాజిక న్యాయం కోసం ఎస్ఎఫ్ఐ  ఎల్లప్పుడూ ముందుండాలని, భగత్‌సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని అన్నారు.

ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ  నాయకులు కృపసాగర్, ప్రేమ్‌దాస్, ముస్కాన్, మహేశ్వరి తదితరులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు. భగత్‌సింగ్ జయంతిని పురస్కరించుకుని విద్యార్థుల హక్కుల కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని సమావేశం లో పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్