74 శాతం
పార్రిశామికవేత్తల విదేశీ బాట
సింగపూర్ వైపు అత్యధిక మొగ్గు..
ఫ్రాన్స్, యూకే, అమెరికాలపై ఆసక్తి
న్యూఢిల్లీ: సంపన్నులు, పారిశ్రామికవేత్తలు క్రమక్రమంగా భారత్‌లో నివాసాలకు ముఖం చాటేస్తున్నారు. ఇక్కడ సంపద ఆర్జిస్తున్నప్పటికీ.. జీవన ప్రమాణాలు, భవిష్యత్ నివాసం కోసం విదేశాల వైపు చూస్తున్న వారి సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని రిపోర్టులు స్పష్టం చేస్తోన్నాయి. గ్లోబల్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్‌ఎస్‌బిసి తాజాగా విడుదల చేసిన ‘గ్లోబల్ ఎంట్రప్రెన్యూరియల్ వెల్త్ రిపోర్ట్ 2026’ ఈ దిగ్భ్రాంతికరమైన నిజాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనిక వ్యాపార వర్గాల ధోరణిపై సర్వే చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. దాదాపు 74 శాతం మంది ఇక్కడి పారిశ్రామికవేత్తలు భారత్‌ను వీడి విదేశాలకు మారాలని లేదా అక్కడ అదనపు నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రపంచ సగటు 70 శాతంతో పోలిస్తే మన దేశంలో విదేశాల వైపు మొగ్గు చూపుతున్న సంపన్నుల శాతం అధికంగా ఉండటం గమనార్హం. విదేశాల్లో నివాసానికి అత్యధికంగా సింగపూర్‌ను 14 శాతం మంది ఎంచుకోగా.. ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాలను చెరో 11 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు.
విదేశాల్లో నివాసాలను ఏర్పాటు చేసుకున్నప్పటికీ భారత్‌లో తమ వ్యాపార భవిష్యత్తుపై మాత్రం ఆశలు వదులుకోవడం లేదు. దేశంలో రాబోయే సంవత్సరాల్లో వ్యక్తిగత సంపద మెరుగుపడుతుందని 97 శాతం మంది భావిస్తున్నారు.
ప్రస్తుత వ్యాపార అవకాశాలు, వృద్ధిపై కూడా 97 శాతం మంది సానుకూలంగా ఉన్నారు. సాంకేతిక పురోగతి, వ్యాపార అవకాశాలు, మెరుగైన పనితీరు, కృత్రిమ మేధస్సు తమ ఆశావాదానికి ప్రధాన కారణాలని పేర్కొన్నారు. భారత్‌లో సంపాదించుకోవడానికి విస్తృత అవకాశాలున్నాయని తెలిపారు. మరోవైపు జీవనశైలి, అంతర్జాతీయ వ్యాపార విస్తరణ, సంపద పరిరక్షణ కోసం విదేశీ నివాసాల వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వే వెల్లడించింది.తమ వ్యాపార కార్యకలాపాలను ఎఐకి అనుగుణంగా మార్చామని లేదా మార్చనున్నామని 99 శాతం మంది తెలిపారు. ప్రపంచ సగటు 95 శాతంతో పోలిస్తే ఇది అధికం. రాబోయే రెండేళ్లలో ఎఐ వల్ల ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని 45 శాతం మంది అంచనా వేయగా.. 25 శాతం మంది మాత్రం తగ్గుతుందని భావిస్తున్నారు. ఎఐ పెట్టుబడులతో పోటీ ప్రయోజనం లభిస్తుందని 46 శాతం, కొత్త మార్కెట్లను గుర్తించవచ్చని 42 శాతం, ఉద్యోగుల ఉత్పాదకత, లాభాల మార్జిన్లు మెరుగుపడతాయని 39 శాతం మంది పేర్కొన్నారు. అయితే డేటా గోప్యత, భద్రతా ముప్పులు 44 శాతం, ఉద్యోగుల వ్యతిరేకత 38 శాతం, పాత వ్యవస్థల్లో ఎఐ అనుసంధానం 35 శాతం మందికి ప్రధాన ఆందోళనలుగా ఉన్నాయి. సంపాదించిన మొత్తాన్ని విభిన్న రంగాల్లో పెట్టుబడులుగా పెడుతున్నారు. అత్యధికంగా బంగారం, నగదు, రియల్ ఎస్టేట్ ఫండ్లు, ప్రయివేటు ఈక్విటీ ఫండ్లలో వ్యక్తిగత పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. నివాసం, పెట్టుబడులు, వ్యాపార విస్తరణలో విదేశాల వైపు భారతీయ సంపన్నుల అడుగులు వేగంగా పడుతున్నాయని నివేదిక స్పష్టం చేస్తోంది.







కామెంట్‌లు (0)