జెండా ఊపి ప్రారంభించిన అమిత్ షా
న్యూఢిల్లీ : దేశంలో మొట్టమొదటి ఎల్‌ఎన్‌జీ-డీజిల్ డ్యూయల్ ఫ్యూయల్ డెము రైలు ఆదివారం ప్రారంభమయింది. ఆదివారం తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. చెన్నైలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) దీన్ని అభివృద్ధి చేసింది. ఈ రైలు డ్యూయల్-ఫ్యూయల్ వ్యవస్థను కలిగిఉండటం వలన కేవలం ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) పైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులను బట్టి డీజిల్‌కు కూడా మారవచ్చు. భారతీయ రైల్వేల్లో డీజిల్ వినియోగాన్ని తగ్గించడం, స్వచ్ఛమైన, ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ రైలు ప్రారంభం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీనిని వెస్ట్రన్ రైల్వే (డబ్ల్యూఆర్) పరిధిలోని అహ్మదాబాద్ డివిజన్ నడుపుతుంది. దీని నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తుంది. గుజరాత్‌లోని సబర్మతి రైల్వే స్టేషన్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. సబర్మతి- మహేసన జంక్షన్ మధ్య ఈ రైలు నడుస్తుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య ఉన్న 62 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు సుమారు 1 గంట 20 నిమిషాల్లో చేరుకుంటుందని అంచనా. జులసాన్, దంగర్వా, అంబిలియాసన్, జగూదాన్ వంటి ముఖ్యమైన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ రైల్లో ఎనిమిది కోచ్‌లు ఉన్నాయి. ఇవన్నీ నాన్-ఏసీ చైర్ కార్ కోచ్‌లు. ఈ రైలు ప్రారంభానికి ముందు 2 వేల కిలోమీటర్లకు పైగా క్షేత్రస్థాయిలో ట్రయల్స్‌ను నిర్వహించారు. ఎల్‌ఎన్‌జీ ఇంజిన్ పనితీరు, విశ్వసనీయతను తనిఖీ చేయడానికి ఈ ట్రయల్స్ చేశారు. ఎల్‌ఎన్‌జీ ఇంజిన్ వినియోగంతో కర్బన్ ఉద్గారాల విడుదల తగ్గడంతో పాటు ఆర్థికంగా కూడా ఆదా అవుతుందని రైల్వే అధికారులు తెలిపారు.






కామెంట్‌లు (0)