Magazines

30న ఇండియా బ్లాక్ కీల‌క భేటీ

2 గంటల క్రితం

rahul
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 2 నిమిషాల చదవడం

సర్‌పై ఆందోళనల నేపథ్యంలో కీలక నిర్ణయాలు

జ్ఞానేష్ కుమార్‌ రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్‌

పార్లమెంట్‌లో మరోసారి తొలగింపు నోటీసు

దేశవ్యాప్త ఆందోళనలపై చర్చ


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయత, ఎన్నికల కమిషన్‌ వ్యవహారశైలి, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ప్రతిపక్షాలు ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఇండియా బ్లాక్ కీలక భేటీకి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌ సమన్వయ స‌మావేశం కానుంది. సెప్టెంబరు 30న న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఇండియా బ్లాక్ పార్టీల నేతలు సమావేశం కానున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ పార్లమెంట్‌లో మరోసారి నోటీసు ఇచ్చే అంశంతోపాటు సర్‌పై ఉమ్మడి కార్యాచరణను ఖరారు చేయనున్నట్టు సమాచారం. ఎన్నికల కమిషన్‌లోనే సర్‌కు సంబంధించిన నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు వచ్చిన నివేదికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్య‌త‌ పెరిగింది. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌సింగ్‌ సంధు, వివేక్‌ జోషి పలు సందర్భాల్లో సర్‌కు సంబంధించిన నిర్ణయాలు, ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు వచ్చిన వార్తలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. ఇండియా బ్లాక్‌ స‌మన్వయానికి ఎంఎ బేబీ చొర‌వ‌ ఎన్నికల కమిషన్‌ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలను సమన్వయం చేసేందుకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ చొరవ తీసుకున్నారు.

ఇండియా బ్లాక్‌, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలకు సమావేశం కోసం సంప్రదింపులు జరిపారు. వివిధ పార్టీల నేతలతో చర్చలు జరిపి ఉమ్మడి కార్యాచరణకు అనుకూలత సాధించే ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 30 సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు వివిధ పార్టీల నేత‌ల‌తో ఎంఎ బేబీ మాట్లాడారు. ఎన్నికల కమిషన్‌ అంశంపై సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయంతో ఆమె ఏకీభవించినట్టు సమాచారం. దేశవ్యాప్త ఆందోళనలకు కార్యాచరణ సర్‌, ఎన్నికల కమిషన్‌ పనితీరుపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతున్నాయి. శుక్రవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్‌ కార్యాలయాల ఎదుట ఆందోళనలు జరిగాయి. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వ‌ర్యంలో ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ద్ద ఆందోళ‌న జ‌రిగింది. జమ్మూకాశ్మీర్‌, అసోం, ఉత్తరాఖండ్‌, యూపీ, చండీగఢ్‌, మణిపూర్‌, పశ్చిమ బెంగాల్‌ తదితర ప్రాంతాల్లో నిరసనలు నమోదయ్యాయి. సీఈసీ రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. సెప్టెంబరు 30 సమావేశంలో దేశవ్యాప్త కార్యాచరణ, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహం, సర్‌పై ఉమ్మడి వైఖరి వంటి అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన (యూబీటీ), ఆర్‌జేడీ, డీఎంకే, ఆప్‌ తదితర పార్టీల అగ్రనేతలు సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎన్నికల కమిషన్‌ స్వతంత్రత, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత, సంస్థాగత నిర్ణయాలపై నెలకొన్న వివాదం తదితర అంశాల నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది.


మరోసారి తొలగింపు నోటీసు

జ్ఞానేష్‌కుమార్‌పై పార్లమెంట్‌లో మరోసారి తొలగింపు నోటీసు ఇచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. న్యాయ నిపుణులతో పరిశీలించిన అనంతరం లోక్‌సభ, రాజ్యసభల్లో నోటీసు సమర్పించే అవకాశముందని సమాచారం. ఇది ప్రతిపక్షాల నుంచి జ్ఞానేష్‌కుమార్‌పై చేపడుతున్న మూడో ప్రయత్నంగా మారనుంది. ఇప్పటికే జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాలని ప్ర‌తిప‌క్షాలు 
డిమాండ్ చేస్తోన్నాయి. సర్‌ అమలుపై తమ ఆందోళనలను ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సెప్టెంబరు 29న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్