తొమ్మిది శాతం మంది విద్యార్థుల్లో తరచూ ఆత్మహత్య ఆలోచనలు
క్యాంపస్‌లో 34 శాతం మందిలో బయటి వ్యక్తులమనే భావన : సుప్రీం నియమించిన ఎన్‌టీఎఫ్ సర్వేలో వెల్లడైన కీలక విషయాలు
న్యూఢిల్లీ : దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిస్థితిపై సుప్రీంకోర్టు నియమించిన నేషనల్ టాస్క్‌ఫోర్స్ (ఎన్‌టీఎఫ్) నిర్వహించిన సర్వే కీలక అంశాలను బయటపెట్టింది. సర్వేలో భాగంగా 2.43 లక్షల మందికి పైగా విద్యార్థుల నుంచి సమాధానాలు సేకరించింది. ఇందులో తొమ్మిది శాతం మంది గతేడాది తరచుగా ఆత్మహత్య ఆలోచనలు వచ్చినట్టు తెలిపారు. మరో 15 శాతం మంది గత ఆరు నెలల్లో కొన్ని వారాల పాటు తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, నిరాశను ఎదుర్కొన్నట్టు చెప్పారు.
కౌన్సెలింగ్ సేవలపైనా లోటు
తమ విద్యాసంస్థలు తీవ్రమైన సమస్యలను న్యాయంగా పరిష్కరిస్తాయన్న నమ్మకం 56 శాతం మంది విద్యార్థుల్లో మాత్రమే కనిపించింది. దాదాపు 32 శాతం మంది తమ సంస్థల్లో కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో లేవని చెప్పారు. విద్యా విభాగం ఎంపిక, భవిష్యత్ ఉద్యోగాలపై ఆందోళన కూడా విద్యార్థుల్లో సాధారణంగా కనిపించినట్టు అధికారులు తెలిపారు.
విద్యా ఒత్తిళ్లు.. వివక్షపై ఫిర్యాదులు
టాస్క్‌ఫోర్స్... సంస్థలను సందర్శించి విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర వర్గాలతో చర్చలు కూడా నిర్వహించింది. ఢిల్లీ–ఎన్‌సీఆర్, తమిళనాడు, కర్నాటక, అసోం, పశ్చిమ బెంగాల్‌లోని 19 విద్యాసంస్థల్లో 30 సమావేశాలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. విద్యార్థులు కఠిన హాజరు నిబంధనలు, అధిక విద్యాభారం, వైద్య విద్యలో ఎక్కువ పని గంటలు, ఇంజినీరింగ్‌లో తీవ్ర పోటీ, ప్లేస్‌మెంట్ల ఒత్తిడి వంటి సమస్యలను ప్రస్తావించారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత కారణంగా తగిన విద్యా సహాయం అందకపోవడం, డెంటల్, నర్సింగ్, మానసిక ఆరోగ్య విద్యలో ప్రాక్టికల్ శిక్షణ లోపించడం, పీహెచ్‌డీ పరిశోధకులకు గైడ్‌ల నుంచి నిర్లక్ష్యం, అధిక నియంత్రణ వంటి అంశాలు కూడా సర్వేలో వెల్లడయ్యాయి.
క్యాంపస్‌లో ‘బయటి వ్యక్తుల’మనే భావన
సర్వేలో పాల్గొన్న వారిలో 34 శాతం మంది తమను తాము క్యాంపస్‌లో ఏదో స్థాయిలో బయటి వ్యక్తులుగా భావిస్తున్నట్టు తెలిపారు. ఇక సర్వేలో పాల్గొన్నవారిలో 67 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. అయితే ప్రస్తుత నమూనా పూర్తిగా పరిస్థితులను ప్రతిబింబించకపోవచ్చనీ, అందువల్ల ఈ ఫలితాలను ప్రాథమిక, తాత్కాలిక అంచనాలుగానే చూడాలని అధికారులు స్పష్టం చేశారు.
కుల, లింగ వివక్షపై ఆందోళన
టాస్క్‌ఫోర్స్ గతంలో సమర్పించిన మధ్యంతర నివేదికలో ఉన్నత విద్యా వ్యవస్థల్లో సామాజిక, కుల వివక్ష, లైంగిక వేధింపులు, లింగ వివక్ష, కులపరమైన అవమానాలు ఉన్నట్టు పేర్కొంది. ప్రవేశాలు, మార్కుల కేటాయింపు, భాష, అధ్యాపకుల నుంచి లభించే శ్రద్ధ వంటి అంశాల్లో కూడా వివక్ష ఎదురవుతున్నట్టు విద్యార్థులు వెల్లడించినట్టు నివేదిక వివరించింది. విద్యార్థుల ఆత్మహత్యలు, మానసిక ఆరోగ్య సమస్యలపై పరిశీలన కోసం సుప్రీంకోర్టు గతేడాది మార్చిలో నేషనల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ నేతృత్వంలోని ఈ బృందం విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలను సూచించనుంది. తుది నివేదికను అక్టోబర్ 31లోగా సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. కాగా విద్యార్థులకు సమర్థమైన కౌన్సెలింగ్, అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ, మానసిక ఆరోగ్యంపై ఉన్న అపోహలను తొలగించడం, సంక్షోభ పరిస్థితుల్లో అనుసరించాల్సిన స్పష్టమైన విధానాలు, విద్యార్థుల సమస్యలను త్వరగా పరిష్కరించే పారదర్శక వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని టాస్క్‌ఫోర్స్ సూచించింది.






కామెంట్‌లు (0)