Magazines

తుమ్మిడిహెట్టి నిర్మాణానికి అనుమ‌తులు ఇప్పించండి

2 గంటల క్రితం

Thummidihetti projec
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 2 నిమిషాల చదవడం

‘పాలమూరు-రంగారెడ్డి, సీతారామ’ కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు మంజూరు చేయండి
కృష్ణా జ‌లాల వినియోగంపై త్వ‌ర‌గా టెలీమెట్రీలు ఏర్పాటు చేయాలి : జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం ఎ.రేవంత్ రెడ్డి విన‌తి


నవతెలంగాణ-న్యూ ఢిల్లీ బ్యూరో

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఒప్పించి త్వ‌ర‌గా అనుమ‌తులు ఇప్పించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర కోరిన సమాచారాన్ని ఇప్పటికే స‌మ‌ర్పించామ‌ని తెలిపారు. మంగ‌ళ‌వారం నాడిక్క‌డ జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణ ప్రాజెక్టుల‌కు సంబంధించిన ప‌లు అంశాల‌పై కేంద్ర మంత్రితో చ‌ర్చించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీని ఎఫ్‌ఆర్‌ఎల్‌ +152 మీటర్ల స్థాయిలో నిర్మించేందుకు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య త్వరగా అంగీకారం కుదిరేలా చూడాల‌ని కోరారు. ఆ స్థాయిలో బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ఆధారంగా నీటిని ఎల్లంప‌ల్లికి త‌ర‌లించేందుకు వీలుంటుంద‌ని తెలిపారు. దాంతో నీటి తరలింపున‌కు అవసరమయ్యే విద్యుత్‌ వినియోగం, విద్యుత్‌ వ్యయం తగ్గుతుందని వివ‌రించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్‌), డిండి ఎత్తిపోతల పథకం (డీఎల్‌ఐఎస్‌), సీతారామ సాగర్ బ‌హుళార్ధ‌క ప్రాజెక్టు (ఎస్‌ఎస్‌ఎంపీ), గౌరవెల్లి రిజర్వాయర్ల‌కు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఇటీవ‌ల సుప్రీంకోర్టు తీర్పు ప్ర‌కారం పర్యావరణ అనుమతులకు మార్గదర్శకాలను జారీ చేస్తామ‌ని కేంద్రం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆయా ప్రాజెక్టుల‌కు వెంట‌నే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాల‌ని కోరారు.

అనుమ‌తుల జాప్యంతో ప్రాజెక్టుల నిర్మాణ వ్య‌యం పెరుగుతోంద‌ని తెలిపారు. సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం (సీడ‌బ్ల్యూసీ) వద్ద పెండింగ్‌లో ఉన్న అనుమతులను త్వరగా మంజూరు చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడ‌బ్ల్యూసీకి స‌మ‌ర్పించామ‌ని, నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట్ర అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాల‌ని కోరారు. ఈ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం పొందేందుకు తాము చర్చిస్తున్నామ‌ని వివ‌రించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఆధ్వ‌ర్యంలో చేపడుతున్న టెలీమెట్రీ యంత్రాల‌ను త్వ‌ర‌గా ఏర్పాటు చేయాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మొదటి దశ టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటుకు అవసరమైన రూ.4.15 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జమ చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా సీఎం గుర్తు చేశారు. మొదటి దశ టెలీమెట్రీ యంత్రాల‌ ఏర్పాటు త్వ‌ర‌గా పూర్తి చేయ‌డంతో పాటు రెండు, మూడో దశలకు సంబంధించిన యంత్రాల‌నూ త్వరగా ఏర్పాటు చేయాల‌ని కోరారు. స‌మావేశంలో రాష్ట్ర మంత్రి జి. వివేక్ వెంక‌ట‌స్వామి, ఎంపీ గ‌డ్డం వంశీకృష్ణ‌, ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (నీటిపారుద‌ల‌) ఆదిత్య‌నాధ్ దాస్‌, సీఎం సెక్రెట‌రీ మాణిక్‌రాజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్