రాష్ట్రపతి ఉత్తర్వులను పాటించాల్సిందే
తేల్చి చెప్పిన సర్వోన్నత
న్యాయస్థానం
తెలంగాణ జీవోను సవాల్ చేస్తూ
దాఖలు చేసిన
పిటిషన్ కొట్టివేత
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో :
తెలంగాణ స్థానికత అంశంపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టత ఇచ్చింది. తెలంగాణ స్థానికత రిజర్వేషన్ పొందాలంటే నాలుగేండ్ల రూల్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశ కొరకు కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం(కెఎన్ఆర్ యూహెచ్ఎస్) ఒక జీవో తెచ్చింది. దీని ప్రకారం... ఒక విద్యార్థి స్థానికత కింద స్థానిక కోటా(స్థానికత) కింద సీటు పొందాలంటే, నీట్ అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేండ్లు తెలంగాణలో చదువుకొని ఉండాలనే నిబంధన చేర్చింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఈ జీవోను సవాల్ చేస్తూ... జెల్ల అంకిత అనే విద్యార్థిని ఈ నెల 20 న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను సోమవారం జస్టిస్ పి.ఎస్. నరసింహా, జస్టిస్ అలోక్ అరాధే ల ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు అడ్వొకేట్ వాదనలు వినిపిస్తూ... విద్యార్థిని తెలంగాణలో జన్మించిందని, 10వ తరగతి వరకు తెలంగాణలో చదువుకుందని వివరించారు. విద్యార్థిని తల్లిదండ్రులు, తాతయ్య సైతం తెలంగాణకే చెందిన వారని తెలిపారు. అయితే... ఉన్నత చదువుల కోసం రెండేండ్లు ఏపీలో విద్యనభ్యసించింది నివేదించారు. ఈ ఒక్క కారణంతో విద్యార్థినికి స్థానిక రిజర్వేషన్లు నిరాకరించడం సరికాదని వాదించారు. ఇది ప్రత్యేకమై కేసని, ఈ విషయంలో స్థానికతపై గతంలో ఇచ్చిన తీర్పులతో ఈ పిటిషన్ ను చూడలేమన్నారు. ఈ వాదనలపై జస్టి స్ నరసింహా స్పందిస్తూ... ఇది విభిన్నమైన కేసని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ... తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జీవో లు జారీ చేసిందని, వాటి ప్రకారమే ముందుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. అంతేకాకుండా ఈ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వుల స్పష్టంగా ఉన్నాయని, వాటి ప్రకారం నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. స్థానికతపై తెలంగాణ ప్రభుత్వ జీవోను సమర్థిస్తూ... పిటిషన్ కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.
స్థానికతలో నాలుగేండ్ల నిబంధన తప్పనిసరి
52 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్లు (0)