Magazines

కదంతొక్కిన యువజనం

3 గంటల క్రితం

spirited rally
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 5 నిమిషాల చదవడం

జంతర్‌‌మంతర్‌లో ఉద్రిక్తత

డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ భారీ ప్రదర్శన
ఆందోళనకారుల్ని అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు
సీఈసీ రాజీనామా, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, బృందా కరత్‌, ఎంపీ ఏఏ రహీం సహా
పలువురి అరెస్టు.. తీవ్ర నిర్బంధం విధించిన మోడీ సర్కార్‌


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ఆంక్షలు, ఢిల్లీ పోలీసుల నిర్బంధాలను ఛేదించి యువజనం కదంతొక్కింది. యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూనే, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జరిగిన అక్రమాలు, లక్షలాది ఓట్ల తొలగింపునరకు బాధ్యుడైన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్‌‌మంతర్‌ ‌వద్ద శుక్రవారం భారీ ఆందోళన నిర్వహించారు. ప్రజలు దానిలో భాగస్వాములు కాకుండా ఉండేందుకు మోడీ ప్రభుత్వం తీవ్ర నిర్భంధాలు విధించింది. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆందోళన కారుల ప్రదర్శనను అడ్డుకొని వందలాదిమందిని అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలో జంతర్‌‌మంతర్‌ ‌వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నేతలతో పాటు ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ ప్రదర్శనలో పాల్గొన్న సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎమ్‌ఏ బేబీ, ఆపార్టీ సీనియర్‌ ‌నాయకురాలు బృందాకరత్‌, ఎంపీ ఏఏ రహీం సహా పలువురిని పోలీసులు బలవంతంగా అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురు గాయపడ్డారు. డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునకు స్పందించి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది యువత శుక్రవారం తెల్లవారుజామునే ఢిల్లీకి చేరుకున్నారు. కేరళం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, కర్నాటక, త‌మిళ‌నాడు, హ‌ర్యానా, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌, రాజ‌స్తాన్‌ త‌దిత‌ర రాష్ట్రాల‌ నుంచి వందలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. ‌

ఆందోళ‌న‌కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఈ ప్రదర్శన అఖిల భారత కిసాన్‌ సభ కార్యాలయం నుంచి జంతర్‌మంతర్‌ వరకు మూడు బృందాలుగా సాగింది. మ‌హాత్మా గాంధీ, భగత్‌సింగ్‌, అంబేద్కర్‌ చిత్రాలను చేతబూని ముందుకు సాగిన యువత హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీష్‌ తదితర భాషల్లో నినాదాలు చేశారు. ఉద్యోగాలు కల్పిం చకుండా నిరుద్యోగాన్ని పెంచుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తారు. దీంతో పోలీసులు వారిపై తీవ్ర నిర్బంధానికి దిగారు. జంతర్‌ మంతర్‌కి వెళ్లే మార్గాలన్నీ మూసి వేశారు. జంత‌ర్‌ మంత‌ర్ మార్గంలో ఎనిమిది అంచెల బారికేడ్ల‌ను ఏర్పాటు చేశారు. వేలాది మంది ఢిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్ష‌న్ ఫోర్స్ (ఆర్ఎఎఫ్‌) బ‌ల‌గాలు మోహ‌రిం చాయి. బిఎన్ఎస్ఎస్ సెక్ష‌న్ 163 కింద నిషేధాజ్ఞ‌లు అమ‌ల్లోకి తీసుకొచ్చారు. జ‌న్‌ప‌థ్, ప‌టేల్ చౌక్‌, సెంట్ర‌ల్ సెక్ర‌టేరియ‌ట్‌, రాజీవ్ చౌక్‌, సేవా తీర్థ్‌, మండీ హౌస్‌, లోక్ క‌ల్యాణ్ మార్గ్ , ఐఎన్ఎ, చోర్ బ‌జార్‌, రామ‌కృష్ణ ఆశ్రం మార్గ్‌, న్యూఢిల్లీ త‌దిత‌ర‌ 11 మెట్రో స్టేషన్లను మూసివేశారు. జంత‌ర్ మంత‌ర్‌తోపాటు న్యూఢిల్లీలోని ప‌లు ప్రాంతాల్లో ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని నిలిపివేశారు. దీంతో పాటు యాప్ బుకింగ్ ఊబ‌ర్‌, ఓలా, భార‌త్ టాక్సీ, ఫోన్ పే, గూగుల్ పే సేవ‌లు ఆగిపోయాయి. ఆందోళనకారులను తరలించేందుకు 70 పోలీసు బస్సులను రంగంలోకి దించారు. . యువకులను ఈడ్చుకెళ్లి అరెస్టులు చేశారు. పోలీసు అధికారి ఓ యువకుడి ముఖంపై కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూశాయి. ఈ దాడిలో డీవైఎఫ్‌ఐ కేరళం రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే ఎం. విజిన్‌ చేయి విరిగింది. రెండు గంటలకు పైగా సాగిన అరెస్టుల పర్వంలో దాదాపు వెయ్యి మంది నాయకులు, కార్యకర్తలను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. అరెస్టు చేసిన నేత‌లు, కార్య‌కర్త‌ల్లో కొంత మందిని వివిధ ప్రాంతాల్లో తిప్పుకుంటూ ఢిల్లీ స‌రిహ‌ద్దు ప్రాంతాల‌కు త‌రలించారు.


అయినా... ఆగని పోరు
ఈ ఆందోళనలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, సీనియర్‌ ‌నాయకురాలు బృందాకరత్‌, డీవైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ ఎఎ రహీం, ప్రధాన కార్యదర్శి హిమాగ్నరాజ్‌ భట్టాచార్య, డీవైఎఫ్‌ఐ అఖిల భారత కోశాధికారి సంజీవ్‌ కుమార్‌, ఉపాధ్యక్షులు వి. వసీఫ్‌, జైక్‌ సి. థామస్‌, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు ఆదర్శ్‌ ఎం. సాజి, ప్రధాన కార్యదర్శి శ్రీజన్‌ భట్టాచార్య, ఐషీ ఘోష్‌, శిల్పా సురేంద్రన్‌, ఎం. విజిన్‌ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. అదే విధంగా ఎఐఎడబ్ల్యూయూ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బి.వెంక‌ట్‌, డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, వెంక‌టేష్‌, డీవైఎఫ్ఐ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి జి.రామ‌న్న‌ను అరెస్టు చేశారు. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సీపీఐ ఎంపీ పి. సంతోష్‌ కుమార్‌, ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐఎస్ఎ, ఆప్‌, యూత్ కాంగ్రెస్ నేత‌లు, ఆప్ నేత సౌర‌భ్‌ భ‌ర‌ద్వాజ్‌, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర నిర్బధంలోనూ యువతరం పోలీస్ స్టేష‌న్‌లోనూ తమ ఆందోళనను కొనసాగించింది. జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా, యువతకు ఉద్యోగాల కల్పన వంటి డిమాండ్లతో సాగిన ఈ ఉద్యమం గాంధీ జయంతి రోజున ఢిల్లీలో జరిగిన ప్రధాన యువజన నిరసనల్లో ఒకటిగా నిలిచింది.


సీఈసీని తొలగించాలని ప్రతిపక్షాల ఆందోళన
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు జంతర్‌మంతర్‌ వద్ద నిరసనలు చేపట్టారు. ‘సేవ్‌ డెమోక్రసీ’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించగా అక్కడికి చేరుకున్న ఆప్‌ నేత సౌరభ్ భరద్వాజ్ సహా యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.ప్రతిపక్షాల నిరసనలను అణచివేసేందుకు ఢిల్లీ అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వేలాది మంది పోలీసులను మోహరించి, బారికేడ్లు పెట్టి నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఢిల్లీ ప్రతిపక్ష నేత అతిషి అరెస్టయి పోలీసు బస్సులో వెళ్తుండగా డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలకు అభివాదం చేశారు. ఆప్‌ కార్యకర్తలున్న పోలీసు బస్సును ఆందోళనకారులు అడ్డుకుని, అరెస్టయిన వారిని విడిపించారు. ఆందోళనకు డీవైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు, రాజ్య‌స‌భ ఎంపీ ఎఎ రహీం, ప్రధాన కార్యదర్శి హిమాగ్నరాజ్‌ భట్టాచార్య, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు ఆదర్శ్‌ ఎం సాజి, ప్రధాన కార్యదర్శి శ్రీజన్‌ భట్టాచార్య నాయకత్వం వహించారు. సీపీఐ(ఎం)ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, సీనియర్‌ నాయకురాలు బృందాకరత్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌. అరుణ్‌కుమార్, ఎఐఎడ‌బ్ల్యూయూ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బి.వెంక‌ట్‌ ఈ నిరసనలో పాల్గొన్నారు.


​​నాడు గాంధీ.. నేడు ప్ర‌జాస్వామ్యాన్ని హ‌త్య చేశారు సీపీఐ(ఎం) నాయకురాలు బృందాక‌ర‌త్‌
నాడు మ‌హాత్మా గాంధీని హ‌త్య చేశారు... ఇప్పుడు ప్ర‌జాస్వామ్యాన్ని హ‌త్య చేశారని సీపీఐ(ఎం) సీనియ‌ర్ నేత బృందాక‌ర‌త్ విమ‌ర్శించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 13 కోట్ల ఓట్ల‌ను తొల‌గించార‌ని అన్నారు. 2023లో కేంద్రం తీసుకువచ్చిన ఎన్నిక‌ల క‌మిష‌నర్ల నియామక చట్టాన్ని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. అదే విధంగా ‘సర్‌‌’ను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని, ఓట్ల తొల‌గింపునకు కార‌ణ‌మైన సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. యువ‌త రోడ్ల‌పైకి వ‌చ్చార‌ని, ఢిల్లీలోని ప్ర‌తి గ‌ల్లీ జంత‌ర్ మంత‌ర్ లా మారింద‌ని పేర్కొన్నారు.


ఈసీ విశ్వసనీయతపై ఆందోళన : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ

ఎన్నిక‌ల సంఘం విశ్వ‌స‌నీయ‌త‌పై స‌ర్వ‌త్రా ఆందోళ‌న నెల‌కొంద‌ని సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీ అన్నారు. యువత తమ భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలపై గొంతెత్తుతున్న సమయంలోనే దేశంలో ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థగా ఎన్నికల సంఘం వ్యవహరించాల్సి ఉందని, అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ పనితీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విమర్శించారు. ‌బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ ప్రయోజనాలకు ఎన్నికల వ్యవస్థను అనుకూలంగా మలుస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. ఇటీవల ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్ జ‌ర్న‌లిస్టు రితికా చోప్రా జరిపిన పరిశోధనాత్మక కథనం ఈ వివాదానికి మరింత ప్రాధాన్యత తెచ్చిందని తెలిపారు. ఎన్నికల సంఘంలోనే ఇద్దరు కమిషనర్లు కీలక నిర్ణయాలపై అభ్యంతరాలు నమోదు చేసిన పరిస్థితి ప్రజాస్వామ్య వ్యవస్థపై ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను కాపాడేందుకు జ్ఞానేష్‌ కుమార్‌ బాధ్యత వహించాల్సి ఉందని పేర్కొన్నారు. ‘‘జ్ఞానేష్‌ కుమార్‌కు ఏమాత్రం గౌరవం ఉన్నా ఇప్పటికే పదవికి రాజీనామా చేసి ఉండాలి. కానీ ఆయన కొనసాగుతున్నారు. ఆయన ఎంతకాలం పదవిలో కొనసాగితే అంతకాలం ఆయనతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌లపై కూడా రాజకీయంగా ప్రశ్నలు మరింత తీవ్రమవుతాయి’’ అని బేబీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. యువత ఉపాధి, విద్య, క్రీడలు, సాంస్కృతిక హక్కుల కోసం పోరాడుతూనే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కూడా ముందుకు వస్తున్నారని తెలిపారు. ఎన్నికల సంఘం విశ్వసనీయత, ఓటర్ల హక్కులు, స్వేచ్ఛాయుత ఎన్నికల పరిరక్షణ కోసం పోరాటాన్ని మరింత విస్తృతం చేస్తామని తెలిపారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్