ఈ రోజుల్లో మనం ఫోన్ చేతిలో పట్టుకుని రీల్స్, షార్ట్స్ స్క్రోల్ చేస్తుంటే చాలామంది అమ్మాయిలు బ్యాక్‌ప్యాక్ వేసుకుని, కొండల నడుమ నుంచుని ప్రశాంతంగా టీ తాగుతూనో, సముద్రపు అలల మధ్య నిలబడి నవ్వుతూనో కనిపిస్తారు. అది చూసినప్పుడు రొటీన్ లైఫ్‌తో విసిగిపోయిన ప్రతీ స్త్రీ మనసులో ఓ చిన్న మెరుపు మెరుస్తుంది.. ఇలా నేను కూడా ఎప్పటికైనా ప్రయాణం చేయగలనా?’ అని. అవును, మనం కూడా కచ్చితంగా వెళ్ళగలం! ప్రయాణాలనేవి కేవలం ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి పనికొచ్చే టైమ్‌పాస్ వ్యాపకం ఎంత మాత్రమూ కాదు. నిన్ను నువ్వు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి, నీలో దాగి ఉన్న అనంతమైన శక్తులను నీకే పరిచయం చేయడానికి ఒక అద్భుతమైన మార్గం.
చాలామంది దృష్టిలో టూరిజం అంటే ఆఫీస్ సెలవుల్లో లేదా సమ్మర్ వెకేషన్‌లో ఒక ట్రైన్ ఎక్కి, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడం, మారడం మాత్రమే. కానీ నిజమైన ప్రయాణం అంటే మనస్సులో కొత్త ఆలోచనలతో నూతన మైదానాల్లో స్వేచ్ఛగా విహరించడం. కొత్త మనుషులు, కొత్త భాషలు, సరికొత్త సంస్కృతులు, మన నోటికి పరిచయం లేని కొత్త రుచులు.. వీటన్నింటినీ మనస్ఫూర్తిగా అనుభవించడమే ప్రయాణం. నిత్యం చూసే నాలుగు గోడల మధ్య నుంచి బయటకు వచ్చి, ప్రపంచం ఎంత పెద్దదో, ఎంత అందమైనదో కళ్ళారా చూసి ఆనందించడమే అసలైన పర్యటన.
భారాలన్నీ క్షణాల్లో మాయం
ఉదయాన్నే లేవడం, కాఫీ తాగడం, ఆఫీస్ వర్క్ లేదా ఇంటి పనులు, మళ్ళీ రాత్రికి పడుకోవడం.. ఈ రొటీన్ లైఫ్ చక్రంలో పడి మన మనస్సులు యంత్రాల్లా మారిపోతాయి. దీనికి ఎవరం అతీతులం కాదు. మన ఆలోచనల నుంచి, ఆందోళనల్లోంచి, మానసిక ఒత్తిడి నుంచి ఒక రీసెట్ బటన్ అవసరం. నమ్మండి, ప్రయాణాన్ని మించిన ఆ రీసెట్ బటనే ప్రపంచంలోనే లేదు. అదొక బెస్ట్ థెరపీ. కొండల మధ్య వీచే చల్లని గాలి, సముద్రపు అలల హోరు మన మెదడులోని భారాన్ని క్షణాల్లో మాయం చేస్తాయి. ఒకే ఊరిలో, ఒకే వాతావరణంలో ఉంటే మన ఆలోచనలు కుంచించుకుపోతాయి. వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రజల జీవిత పోరాటాలు, వారి ప్రశాంతత చూస్తే మన సమస్యలు ఎంత చిన్నవో అర్థమవుతుంది. రోజువారీ బోర్ కొట్టే ఆలోచనల నుంచి బయటపడి కొత్త కొత్త విషయాలను ఎక్స్‌ప్లోర్ చేయడం వల్ల మనలో సృజనాత్మకత పరుగులెత్తుతుంది.
కాన్ఫిడెన్స్ పెరుగుతుం
ది
మన సమాజంలో మహిళల జీవితం ఎక్కువగా ఇతరుల కోసమే గడిచిపోతుంది. చిన్నప్పుడు తల్లిదండ్రులు, పెళ్ళయ్యాక భర్త, పిల్లలు, ఇల్లు, ఉద్యోగం.. ఇలా ప్రతి దశలోనూ ఇతరుల అవసరాలకే ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలో ‘తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రపంచం ఉండాలి?’ అనే విషయాన్నే పూర్తిగా మర్చిపోతారు. అందుకే ప్రయాణాలు మన భారతీయ మహిళలకు మరింత అవసరం. ఇంట్లో ఉన్నప్పుడు ప్రతీ చిన్న దానికి ఇతరులపై ఆధారపడే అమ్మాయి, ఒంటరిగా ఒక ప్రయాణం చేసి సురక్షితంగా తిరిగి వస్తే ఆమెలో వచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది. బస్సు టిక్కెట్టు నుంచి హోటల్ రూమ్ బుక్ చేసుకోవడం వరకు అన్నీ తనే చూసుకున్నప్పుడు ‘నేను దేన్నైనా ఫేస్ చేయగలను’ అనే ధైర్యం వస్తుంది. ఇల్లు, పిల్లలు, ఆఫీస్ బాధ్యతల నుంచి కొన్ని రోజులు విరామం తీసుకుని, కేవలం తన కోసం మాత్రమే సమయం కేటాయించడం స్వయం సంరక్షణ కిందకే వస్తుంది.
ఒంటరిగా ప్రయాణిస్తే...
స్త్రీల ప్రయాణంలో పూల బాట మాత్రమే ఉండదు, చిన్నచిన్న ముళ్ళు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగని భయపడి ఇంట్లోనే కూర్చుంటే బయటి ప్రపంచాన్ని ఎప్పటికీ చూడలేం. భారతదేశంలో ఒంటరిగా ప్రయాణించే స్త్రీలను సమాజం కొన్నిసార్లు వింతగా చూస్తుంది. రాత్రి వేళల్లో ప్రయాణాలు, వేధింపులు, దొంగతనాల భయం ఎక్కువ. కొత్త ప్రదేశాల్లో నీళ్ళు, తిండి పడకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఆడపిల్లవి ఒంటరిగా వెళ్ళడం ఏంటి, సేఫ్ కాదు అని ఇంట్లో అమ్మానాన్నలు లేదా పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం పెద్ద అడ్డంకి. ప్రయాణంలో అంతా బాగానే ఉన్నా, కొన్ని క్షణాల్లో ఎవరైనా తోడు ఉంటే బాగుణ్ణు అనే ఒంటరితనం కూడా ఆవరిస్తుంది. కానీ ఏ సమస్యా పరిష్కారం లేనిది కాదు. సరైన ప్లానింగ్, కొద్దిపాటి చాకచక్యంతో తెలివిగా వ్యవహరిస్తే ఈ కష్టాలన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తాయి.
సోలో ట్రావెల్ ఓ అద్భుతం
ప్రయాణాల్లో స్త్రీలకు ‘గ్రూప్ ట్రావెల్’ ‘సోల
(ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా)
ట్రావెల్’ అని రెండు విధానాలు ఉన్నాయి. రెండింటికీ దానికదే ప్రత్యేకమైన మజా ఉంటుంది. గ్రూప్ ట్రావెల్‌లో గుంపుగా వెళ్తాం కాబట్టి సేఫ్టీ చాలా ఎక్కువ, భయం ఉండదు. టాక్సీలు, రూమ్‌లు, గైడ్ ఖర్చులు అందరూ షేర్ చేసుకుంటారు కాబట్టి బడ్జెట్ తగ్గుతుంది. కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు, నవ్వులు, కబుర్లు, హడావుడి ఉంటుంది. ఓన్లీ లేడీస్ గ్రూప్ టూర్ అంటే ఇంట్లో వాళ్ళు కూడా సులభంగా ఒప్పుకుంటారు. కానీ ఇందులో గ్రూప్ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి, మనకి నచ్చినట్లు సమయం మార్చలేం. అదే సోలో ట్రావెల్ అయితే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది! ఎప్పుడు లేవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఏం తినాలి అనేది కేవలం మన ఇష్టం. మనతో మనం గడపడానికి, ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి. కొంచెం ఖర్చు ఎక్కువ కావచ్చు. ఒకవేళ మీరు బిడియస్తులు అనుకుంటే మొదట ‘విమెన్ గ్రూప్ ట్రావెల్’తో స్టార్ట్ చేయడం మంచిది. ఇప్పటికే కొన్ని ప్రయాణాలు చేసి, ‘నా నిర్ణయాలు నేనే తీసుకోగలను, నన్ను నేను ఎక్స్‌ప్లోర్ చేసుకోవాలి’ అనుకుంటే ‘సోలో ట్రావెల్’ అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది.
తగు జాగ్రత్తలు అవసరం
ప్రయాణం హ్యాపీగా సాగాలంటే కొన్ని ముందస్తు జాగ్రత్తలు అవసరం. మీరు వెళ్ళే ప్రదేశం గురించి, అక్కడి రవాణా సదుపాయాలు, నైట్ టైమ్ వాతావరణం గురించి ముందే ఇంటర్నెట్‌లో సరిగ్గా తెలుసుకోవాలి. మీ ప్రయాణం మొదలైనప్పటి నుండి ముగిసే వరకు మీ ఇంట్లోని వాళ్ళకి లేదా నమ్మకమైన ఫ్రెండ్‌కి గూగుల్ మ్యాప్స్‌లో లైవ్ లొకేషన్ షేర్ చేయడం మంచిది. ఎప్పుడైనా సరే మెయిన్ సిటీకి, బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్‌కి దగ్గర్లో ఉండే హోటల్స్ లేదా హాస్టల్స్ ఎంచుకోవాలి. వాటి రివ్యూలు, రేటింగ్ చూసుకోవాలి. సాధారణంగా ట్రావెలర్స్ అందరూ నిజాయితీగా రివ్యూలు ఇస్తారు. ధరతక్కువని మారుమూల ప్రదేశాల్లో రూమ్‌లు తీసుకోవద్దు. కొత్త ప్రదేశాలకు మరీ రాత్రిళ్ళు చేరుకునేలా ప్లాన్ చేసుకోవద్దు. పగటి వెలుతురు ఉన్నప్పుడే డెస్టినేషన్‌కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోవడం సురక్షితం. మీ హ్యాండ్ బ్యాగ్‌లో ఎప్పుడూ పెప్పర్ స్ప్రే, పవర్ బ్యాంక్, ఎమర్జెన్సీ క్యాష్ ఉంచుకోవాలి. ప్యాక్ చేసిన మంచినీటిని మాత్రమే తాగడం శ్రేయస్కరం. ఫస్ట్ ఎయిడ్ కిట్, మీకు అవసరమైన మెడిసిన్స్ దగ్గర ఉంచుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా, ఏదైనా ప్రదేశంలో లేదా ఎవరైనా మనిషి దగ్గర మీకు ఏదో తేడాగా ఉంది అనిపిస్తే, ఆలోచించకుండా ఆ ప్రదేశం నుంచి వెంటనే బయటపడాలి. మన అంతరాత్మ చెప్పే మాట ఎప్పుడూ వినాలి.
సో మై డియర్ లేడీ...!
ఇక ఆలోచించడం ఆపి ఇంట్లోంచి ఒక్క అడుగు బయటకు వేయి. నీ భయాన్ని కాళ్ళకిందేసి తొక్కి నడిస్తే నీ కళ్ళ ముందున్న అద్బుతమైన ఆనంతలోకంలోకి అడుగు పెడతావు. నాకు పెళ్ళయిపోయింది, పిల్లలున్నారు, ఆఫీస్ వర్క్ ఉంది, ఇంట్లో ఒప్పుకోరు అని సాకులు చెప్పడం ఆపేయ్. స్త్రీ అయినా, పురుషుడైనా ఉన్నది ఒకటే జీవితం. ఒక్కసారే వస్తుంది. పనులన్నీ అయిపోయాక ప్రయాణాలు చేస్తాను అనుకుంటే, ఆ రోజు ఎప్పటికీ రాదు. ఎందుకంటే నీ బాధ్యతలు ఎప్పటికీ ముగిసేవి కావు. ఇంట్లో పర్మిషన్ విషయానికొస్తే, మొదట ఒక చిన్న రెండు రోజుల ట్రిప్‌తో మొదలుపెట్టవచ్చు. లేదా మీకు తెలిసిన భద్రమైన ప్రదేశాల నుండి ప్రారంభించవచ్చు. మీ సేఫ్టీ ప్లాన్, బస చేసే హోటల్ వివరాలు ఇంట్లో వారికి ముందే చెప్తే వాళ్ళకి కూడా ధైర్యం వస్తుంది.
ధైర్యంతో తిరిగి వస్తావు
పాండిచ్చేరి అందమైన ఫ్రెంచ్ వీధుల్లో నడుస్తూ ఫిల్టర్ కాఫీ తాగడం, జైపూర్ గులాబీ రంగు కోటలను చూస్తూ రాజసం అనుభవించడం, రిషికేష్‌లో గంగా హారతి వెలుగుల్లో ప్రశాంతతను వెతుక్కోవడం, కేరళ బ్యాక్‌వాటర్స్‌లో హౌస్‌బోట్‌లో ప్రశాంతంగా తేలియాడడం.. ఇవన్నీ నీ కోసం ఎదురుచూస్తున్నాయి. ఒక్కసారి బ్యాగ్ తగిలించుకుని బయటకు అడుగుపెడితే, వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు నువ్వు పాత మనిషిలా రావు. నీలో ఒక కొత్త కాన్ఫిడెన్స్, ముఖంలో ఒక అందమైన నవ్వు, గుండెల్లో కొండంత ధైర్యంతో తిరిగి వస్తావు. ప్రపంచం చాలా పెద్దది, అందమైనది. అది కేవలం పుస్తకాల్లోనో, ఫోన్ స్క్రీన్లలోనో చూసేది కాదు. నువ్వు స్వయంగా రంగంలోకి దిగి అనుభవించాలి! ఇంతకీ ఈ ‘వరల్డ్ టూరిజం డే’ సందర్భంగా ట్రిప్‌కి వెళ్ళడానికి నీ ట్రావెల్ బ్యాగ్ ఎప్పుడు సర్దుకుంటున్నావు? ఇంతకీ ఎక్కడికి వెళ్ళబోతున్నావు?
- స్వర్ణ కిలారి







కామెంట్‌లు (0)