Magazines

ఎవరి మాట వినాలి?

37 నిమిషాల క్రితం

Whose words
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 4 నిమిషాల చదవడం

పెండ్లి తర్వాత అతను భార్య మాట వినాలా? లేదా కొడుకుగా తల్లి మాట వినాలా? ఒకరి మాట వింటే మరొకరికి కోపం. ఇద్దరి స్థానాలు వేరు. కానీ జీవితంలో ఇద్దరూ ముఖ్యమే. ఒకరే ముఖ్యం అనుకుంటూ వారి మాటే వినడం సరైనది కాదు. ఒకరి సంతోషం కోసం మరొకరిని బాధపెట్టలేరు. అలా అని ప్రతి సారీ ఇద్దరినీ సంతృప్తి పరచలేరు. ఇలాంటి సమస్యలు చాలా ఇండ్లల్లో సర్వసాధారణం. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోవలసి వుంటుంది. లేదంటే ఇల్లు రణరంగంగా మారుతుంది. అలాంటి కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌‌(ఐలమ్మ ట్రస్ట్‌)‌లో మీ కోసం....


శేఖర్‌‌కు 35 ఏండ్లు ఉంటాయి. వీళ్లది పెద్దలు కుదిర్చిన వివాహం. పెండ్లి జరిగి 12 ఏండ్లు అవుతుంది. ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. శేఖర్‌ ‌తల్లి బాలామణి కూడా ఉద్యోగం చేసేది. రిటైర్‌ ‌కావడంతో మూడేండ్ల నుండి ఇంట్లోనే ఉంటుంది. భార్య జ్యోతి గత ఐదేండ్ల నుండి ఉద్యోగం చేస్తుంది. చెల్లికి పెండ్లి జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల భర్త నుండి విడిపోయి తన బిడ్డతో పాటు అన్న దగ్గరే ఉంటుంది. శేఖర్‌ ‌గత పదేండ్ల నుండి కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాడు. వాటిని చెప్పుకోడానికి ఐద్వా లీగల్‌‌సెల్‌‌కు వచ్చాడు. ‘‘నా భార్య నన్ను ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ‘నువ్వు ఎప్పుడూ తల్లి, చెల్లి అని వాళ్లతోనే ఉంటావు. వాళ్ల మాటే వింటావు. నేనంటే అసలు నీకు లెక్కే లేదు, ఏదో సమాజం కోసం పెండ్లి చేసుకున్నావు’ అంటూ గొడవ చేస్తుంది. మరోపక్క మా అమ్మ ‘పెండ్లయిన నాటి నుండి నువ్వు పెళ్లాం మాటే వింటున్నావు, మమ్మల్ని అస్సలు లెక్క చేయడం లేదు’ అని తిడుతుంది. చివరకు మా చెల్లి కూడా ‘నీ పెండ్లి కాక ముందు నాకు ఏం కావాలన్నా తెచ్చి పెట్టేవాడివి. పెండ్లి తర్వాత నన్నూ నా కూతుర్ని అస్సలు పట్టించుకోవడం లేదు, నీ పిల్లల్నే చూసుకుంటున్నావు. ఆ పనీ ఈ పని చేయాలని మాకే చెబుతున్నావు. ఆ పనులు నీ భార్యా, పిల్లలకు చెప్పొచ్చు కదా’ అంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. మీరే ఎలాగైనా నా భార్య, అమ్మకు సర్ధి చెప్పి నా సమస్యకు ఓ పరిష్కారం చూపండి’ అన్నాడు. మేము అందరినీ మా ఆఫీసుకు పిలిపించాము. ముందుగా వాళ్ల అమ్మతో మాట్లాడితే ‘నా కొడుకు పొద్దన వెళ్లి సాయంత్రం వస్తాడు.

వాడికి ఇంటి పనులు చెబుతూనే ఉంటుంది. మగపిల్లాడితో పని చేయిస్తారా! ఆమెకు మేము సహాయం చేయడం లేదా? నేను ఇంట్లో ఉన్నప్పటి నుండి కూరగాయలు కట్‌ ‌చేసి ఇస్తాను. బట్టలు మడత పెడతాను. అప్పుడప్పుడు ఇల్లు కూడా ఊడుస్తాను. ఇంకా ఏం చేయాలి. నా కూతురంటే ఆమె చేసే పని దగ్గర పొద్దున నుండి సాయంత్రం వరకు నిలబడే వుండాలి. ఇంటికి వచ్చే సరికి బాగా అలసిపోతుంది. ఇంక ఆమె చేస్తుంది చెప్పండీ! ఇంట్లో సరుకులకు నా కూతురే డబ్బులిస్తుంది. ఆమె ఊరికనే ఉంట్లో ఉండటం లేదు. ఏమైనా అంటే జ్యోతి ఆమెపైన ఏడుస్తుంది. మాట్లాడితే బయట బతికితే తెలుస్తుంది మీకు అంటారు. అయినా నా కూతురు ఎందుకు వెళ్లాలి. ఇక్కడే ఉంటుంది. ఏదో ఆమె అదృష్టం బాగోక వస్తే అన్నగా బాధ్యత లేదా. భార్య మాట విని మమ్మల్ని ఇది చేయండి, అది చేయండి అంటూ ఆమెకు వత్తాసు పలుకుతాడు’ అంటూ చెప్పుకొచ్చింది. జ్యోతితో మాట్లాడితే ‘నేను ఉదయం తొమ్మిదిన్నర లోపు ఆఫీసులో వుండాలి. మా ఇంటి నుండి ఆఫీసుకు గంట పడుతుంది. మా ఆడపడుచు ఆఫీసు 11 గంటలకు. కనీసం పొద్దున లేచి పిల్లలకు జడ కూడా వేయదు. ఆమె ఇంట్లో ఏం చేయకపోయినా పర్లేదు. కనీసం పిల్లలను స్కూల్‌‌కి రెడీ చేసినా చాలు. కనీసం అది కూడా చేయడం లేదు. అందుకే పిల్లల్ని నేను రెడీ చేస్తూ లంచ్‌ ‌బాక్సులు సర్దమని శేఖర్‌‌కి చెబుతాను. మా పిల్లలతో పాటు ఆమె పాపను కూడా నేనే రెడీ చేస్తాను. అంతేకాదు వాళ్లు కూర్చున్న దగ్గరకే టీ, కాఫీ, టిఫెన్‌ ‌తీసుకెళ్లాలి. రాత్రి నేను ఇంటికి వచ్చే సరికి 8 అవుతుంది.

వచ్చి వంట చేసి గిన్నెలు కడిగి పడుకునే సరికి 11-12 అవుతుంది. మళ్లీ 5గంటలకు లేవాలి. నేను మనిషినా, యంత్రాన్నా? అలసిపోయేది కొడుకూ, కూతురేనా, నేను కాదా? నా ఆరోగ్యం బాగోకపోయినా ఒక్క పనిలో కూడా సాయం చేయరు. మా ఆడపడుచు ఇంట్లో ఉండడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆమె నాకు చిన్న సాయం కూడా చేయదు. నేను ఏం తెచ్చుకున్నా ఆమెకు కూడా తెస్తాను. అలాంటి నా గురించి శేఖర్‌ ‌తప్పుగా చెప్పడం నాకు నచ్చలేదు. శేఖర్‌‌కి ఇద్దరు అన్నయ్యలున్నారు. తల్లిని, కూతురిని చూసే బాధ్యత మాతో పాటు వాళ్లకు కూడా ఉంటుంది. కానీ నేను ఎప్పుడూ ఆ మాట అనలేదు. మేము ఉండే ఇల్లు చిన్నగా ఉంటుంది. ప్రస్తుతం ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం. ఒకరి జీతంతో ఇల్లు తీసుకుంటే ఇంకొకరి జీతంతో ఇల్లు గడుస్తుంది. కానీ నేనేం చెప్పినా పట్టించుకోడు. ప్రతిదీ తల్లి, చెల్లికి చెప్పాలంటాడు. వాళ్లు మాత్రం మాకు చెప్పకుండా ఇల్లు, ఐదు తులాల బంగారం కొన్నారు. మా ఆడపడుచు ఇంట్లోకి నెలకు రెండు వేలే ఇస్తుంది. పాప స్కూల్‌ ‌ఫీజు కట్టుకుంటుంది. నేను ఇల్లు కొందామని మా అమ్మ వాళ్ల దగ్గర నుండి డబ్బులు తీసుకొచ్చాను. ఆ డబ్బులు కూడా ఏదో అవసరమని మా ఆడపడుచు తీసుకుంది. వాటికి కొంత డబ్బులు కలిపి ప్లాట్‌ ‌తీసుకుంది. ఇప్పుడు ఆ డబ్బు అడిగితే శేఖర్‌ ‌తీసుకురావడం లేదు. పైగా అమ్మను, చెల్లిని ఎలా అడుగుతాను? అంటాడు. నేను అత్తమ్మను అడిగితే ‘మీరు ఎలాగో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారు కదా మేము వంద గజాల స్థలం తీసుకున్నాము, అందులో సగం మీరు తీసుకోండి’ అంటుంది.

సరే మా పేరుతో రాసివ్వమని అడిగితే ఎందుకు ఎవరి పేరుతో వుంటే ఏమవుతుంది అంటున్నారు’ అని చెప్పి బాధపడింది. మేము అందరినీ కూర్చోబెట్టి అందరూ కలిసి ఉండేటప్పుడు ఇంట్లో అందరూ బాధ్యతగా ఉండాలి. ఆడపడుచుతో మీరు కూడా కాస్త త్వరగా లేచి పిల్లల్ని రెడీ చేయండి. అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఇంటి పనుల కోసం ఓ అమ్మాయిని పెట్టుకోండి. లేదంటే అందరూ కలిసి చేసుకోండి. ఇలా ఒకరిపైనే భారం వేయడం సరైనది కాదు. అలాగే పిల్లలకు కూడా చిన్న చిన్న పనులు అలవాటు చేయాలి’ అని చెప్పాము. శేఖర్‌‌తో ‘మీరు తల్లి, చెల్లితో పాటు భార్యకు కూడా విలువ ఇవ్వాలి. సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలి’ అని చెప్పాము. శేఖర్‌ ‌తల్లితో ‘మీ అబ్బాయి ఇంట్లో సాయం చేస్తే తప్పేముంది. మీరూ, మీ కూతురు చేయరు. అతన్నీ చేయనీరు. మగవాళ్లు ఇంటి పని చేస్తే పరువు పోతుందనే ఆలోచనలో నుండి బయటకు రండి? మీ కోడలికి సపోర్ట్‌ ‌చేయండి. మీ మనవళ్లు, మనవరాళ్ల జీవితం బాగుంటుంది. అంతే కానీ కూతురిని ఒకలా కోడలిని ఒకలా చూడకండి’ అని అర్థమయ్యేలా చెప్పాము. జ్యోతితో ‘నువ్వు ప్రతి విషయానికి శేఖర్‌‌పై గొడవ పెట్టుకోకు. అతనికి నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చెయ్యి అని చెప్పాము. చివరగా శేఖర్‌తో ‘మీరు ఇంట్లో పనుల్లో సాయం చేయండి, లేదంటే ఓ అమ్మాయిని పెట్టండి. ఇన్ని పనులు ఆమె ఒక్కతే చేయడం సాధ్యం కాదు’ అప్పుడే మీ సమస్యలకు పరిష్కారం’ అని చెప్పి పంపించాము.



- వై వరలక్ష్మి, 9948794051

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్