Magazines

ఇద్దరు మహిళల బ్రెయిన్‌‌డెడ్‌... ఎనిమిది మందికి జీవదానం

55 నిమిషాల క్రితం

Two women declared brain-dead... eight people given the gift of life.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బ్రెయిన్‌ ‌డెడ్‌‌కు గురైన ఇద్దరు మహిళలు ఎనిమిది మందికి మరోజన్మనిచ్చారు. భార్యలను కోల్పోయిన పుట్టెడు దు:ఖంలోనూ వారి భర్తలు తీసుకున్న నిర్ణయాలు ఎనిమిది మంది ప్రాణాలను నిలబెట్టాయి. రంగారెడ్డి జిల్లా మణికొండ ప్రాంతంలోని సన్‌‌షైన్‌ ఐరిస్‌కు చెందిన మడుగుల దీప్తిరెడ్డి (42) పారిశ్రామికవేత్త. ఉమెనర్జీ, వి ఎయిమ్ సంస్థల వ్యవస్థాపకురాలు. ఈ నెల 22న ఆమెకు అకస్మాత్తుగా తలనొప్పి వచ్చింది. తదనంతరం ఇంట్రాక్రానియల్ బ్లీడ్‌కు గురయ్యారు. కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స కోసం ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 26న ఆమె బ్రెయిన్‌‌డెడ్‌కు గురయ్యారు. అవసరంలో ఉన్న నలుగురు రోగులకు సహాయం చేయడానికి తన భార్య అవయవాలను దానం చేసేందుకు ఆమె భర్త ప్రదీప్‌‌రెడ్డి ముందుకొచ్చారు. రెండు మూత్రపిండాలు, కాలేయం, గుండె దానం చేశారు. మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా ఘట్‌‌కేసర్‌ ‌మండలం కొర్రెముల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన నీరుడి శారద(43) ఈ నెల 23న తలనొప్పి, వాంతులతో ఇంట్లోనే కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను అత్యవసర చికిత్స కోసం దగ్గర్లోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె బ్రెయిన్‌ ‌డెడ్‌ అయినట్టు అక్కడ డాక్టర్లు నిర్ధారించారు. భార్య చనిపోయిందనే తీవ్ర దు:ఖంలోనూ కొందరి ప్రాణాలనైనా నిలబెట్టాలనే ఆలోచనతో ఆమె మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులను దానం చేయాలనే గొప్ప నిర్ణయాన్ని ఆమె భర్త నర్సింగ్‌‌రావు తీసుకున్నారు. తద్వారా అవసరంలో ఉన్న నలుగురు రోగులకు సహాయపడ్డారు. అవయవ దానం ద్వారా ప్రాణాలను కాపాడటమే కాకుండా స్ఫూర్తిని నింపిన శారద, దీప్తిరెడ్డి కుటుంబసభ్యులకు 'జీవన్‌దాన్ తెలంగాణ' నోడల్‌ ఆఫీసర్‌ ‌ప్రొఫెసర్‌, డాక్టర్‌ ‌భూషణ్‌‌రాజ్‌ కృతజ్ఞతలు తెలిపారు. అవయవ దానంపై అవగాహన కల్పించడానికి, అవయవ దాన ప్రక్రియను సులభతరం చేయడానికి జీవన్‌దాన్ కార్యక్రమం కృషిచేస్తోందన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 153 'బ్రెయిన్ డెడ్' అవయవ దానాలు నమోదయ్యాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్