కనీస చార్జీ రూ.30, ఆపై కిలోమీటర్కు రూ.14
రవాణాశాఖ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్: తెలంగాణలో ఆటో చార్జీలు పెంచుతూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీచేసింది. సుమారు పన్నేండేళ్ల తర్వాత ఆటోచార్జీలు పెరిగాయి. 1.6 కి.మీ. వరకు ఆటో కనీస చార్జీ రూ.30 గా ఉండనుంది. కనీస చార్జీ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.14 వసూలు చేయనున్నారు. ప్రతి నిమిషానికి ఆటో డిటెన్షన్ చార్జీలు 75 పైసలుగా నిర్ణయించారు. అర్హత ఉన్న ప్రతి లగేజీ ప్యాకేజీకి చార్జీ 25 పైసల నుంచి 50 పైసలకు పెంచారు.గరిష్ఠ లగేజీ పరిమితి 100 కిలోలుగానే కొనసాగించారు. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 వరకు ఒకటిన్నర శాతం అదనపు చార్జీలు వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. మూడు నెలల్లోపు డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
అసలేం జరిగిందంటే
ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఆగస్టు 23 నుంచి బంద్ చేయాలని రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత రవాణా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ గతంలో వెల్లడించింది. దీంతో ఆగస్టు 22వ తేదీన కార్మికులతో ప్రభుత్వం సుధీర్ఘ చర్చలు జరిపింది. ప్రభుత్వం తరఫున రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులు చర్చల్లో పాల్గొన్నారు.ఆటో కార్మికుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేయనుందనే వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. మంత్రి హామీతో బంద్ విరమించిన కార్మికులు, వారి ప్రతిపాదనలను రవాణా శాఖకు పంపారు. దీనిపై ఏర్పాటైన అధికారుల కమిటీ చార్జీల పెంపుపై సెప్టెంబర్ నెలలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
రాష్ట్రంలో ఆటో చార్జీలు పెంపు
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)