Magazines

బీజేపీకి తొత్తుగా సీఈసీ

54 నిమిషాల క్రితం

Cash prizes awarded to photography winners
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 3 నిమిషాల చదవడం

ఓట్ల తొలగింపులో బీఎల్‌ఓల పాత్ర శూన్యం
కేంద్రంలోనే ఆ కుట్రలు : ఎస్వీకే వెబినార్‌లో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు అరుణ్‌కుమార్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూత్వ అజెండా అమలు చేయడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రధానాధికారి జ్ఞానేష్‌కుమార్‌ పనిచేస్తు న్నారని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌ ఆరుణ్‌కుమార్‌ అన్నారు. సీఈసీ వివాద కేంద్రంగా మారడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని హెచ్చ రించారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మేనేజింగ్‌ కమిటీ కన్వీనర్‌ ఎస్‌ వినయకుమార్‌ అధ్యక్షతన 'ప్రజాస్వామ్యం-భారత ఎన్నికల సంఘం' అంశంపై వెబినార్‌ జరిగింది. దీనిలో ఆరుణ్‌కుమార్‌ ప్రధాన వక్తగా మాట్లాడారు. భారతదేశ ఎన్నికల వ్యవస్థ అధ్యయనానికి విదేశీయులు అత్యంత ఆసక్తి చూపుతారనీ, అదే సమయంలో భిన్నత్వంలో ఏకత్వం ఎలా సాధిస్తున్నారో తెలుసుకోవడంపై వారికి ఆసక్తి ఉంటుందని తెలిపారు. అలాంటి ఎన్నికల వ్యవస్థ ఓ రాజకీయపార్టీకి తొత్తుగా మారితే అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఈసీ ప్రారంభించిన ఎస్‌ఐఆర్‌తో ఈ వివాదం ప్రారంభమై, ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై అనేక ప్రశ్నలు తలెత్తాయని వివరించారు. ఉన్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కు కోసం బీఎల్‌ఓలను ప్రాధేయపడుతున్నారనీ, అవసరమైన డాక్యుమెంట్లు అన్నీ అప్‌లోడ్‌ చేశాక కూడా, ఆ ఓట్లు ఉంచాలో లేదో నిర్ధారించేది కేంద్రంలోని ఈసీఐ.నెట్‌ మాత్రమేనని విశ్లేషించారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను ఇప్పటి వరకు తొలగించారనీ, ఢిల్లీలో ఓటర్ల సంఖ్య 1.58 కోట్ల నుంచి 98 లక్షలకు పడిపోయిందని తెలిపారు. ఓట్లు కోల్పోతున్న వారంతా వలస కార్మికులు, దళితులు, మైనార్టీలు, పేదలేనని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘంలో అధికారాలు కేంద్రీకృతం కావడాన్ని ఎన్నికల కమిషనర్లు ప్రశ్నించారని గుర్తుచేశారు.

వారు లేవనెత్తిన ప్రధానాంశాలకు సమాధానాలు చెప్పకుండా చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ గ్రూప్‌ ఫోటో దిగి, తమ మధ్య వివాదాలు లేవని చెప్పే ప్రయత్నం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఫామ్‌-6లో మార్పులు చేయాలంటే పార్లమెంటు చట్టం చేయాలనీ, అలా కాదని ఎన్నికల ప్రధానాధికారి ఎలా చేస్తారంటూ, ప్రజాస్వామ్యం పట్ల చులకన భావానికి ఇది పరాకాష్ట అని చెప్పారు. సీఈసీలోని ఇతర కమిషనర్లు లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకు ఆయన సమాధానాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. సీఈసీపై పౌర సమాజం విమర్శలు చేస్తుంటే, బీజేపీ నేతలు ఎందుకు సమాధానాలు చెప్తున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజం అని మాట్లాడుతున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తులు వాటిని ఎంతమేరకు గౌరవిస్తున్నారో చేతల్లో తెలుస్తున్నదని అన్నారు. మెజారిటీ మీడియా బీజేపీ నేతల చేతుల్లో ఉందనీ, చిన్న మాట అంటే దాన్ని వ్యాప్తి చేసే ధనబలం వారికి ఉందన్నారు. దానిద్వారానే ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. బెంగాల్‌లో 'సర్‌' ద్వారా ఓట్ల తొలగింపుపై 22 లక్షల మంది అభ్యంతరాలు వ్యక్తంచేశారనీ, వాటి పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేశారన్నారు. ఈ కేసులన్నీ ఎప్పటికి పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్తున్నారనీ, ఓటర్లుగా ఎవరు ఉండాలో.. వద్దో వారే నిర్ణయిస్తున్నారని చెప్పారు. భారత పౌరసత్వాన్ని జాతి, మతం ప్రాతిపదికగా నిర్థారించే బాధ్యతను సీఈసీ తీసుకుందనీ, వాస్తవానికి ఆ పనిచేయాల్సింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అని వివరించారు. పౌరసత్వ నిర్థారణను రాజ్యాంగం సీఈసీకి ఇవ్వలేదని స్పష్టం చేశారు. సర్‌, జనగణన, ఆధార్‌, ఈసీ డేటాను క్రోడీకరించి నియోజకవర్గాల పునర్విభజనను బీజేపీకి అనుకూలంగా ఉండేలా ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర చేస్తున్నదని చెప్పారు. స్వతంత్రంగా, రాజ్యాంగ బద్ధంగా పనిచేయాల్సిన సీఈసీ హిందుత్వవాదుల తొత్తుగా మారిందనీ, జ్ఞానేష్‌కుమార్‌ ఆ పదవిలో ఉండటానికి అర్హుడు కాదనీ, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అలాకాని పక్షంలో పార్లమెంటు ద్వారా ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించాలన్నారు. దీనికోసం ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తేనే ప్రజా స్వామ్యాన్ని కాపాడుకోగలుగుతామని తెలిపారు. అదే సమయంలో ఓటుహక్కు పోతే జరిగే ప్రమాదాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉందని చెప్పారు. అనంతరం పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్