Magazines

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మనదే

51 నిమిషాల క్రితం

బీఆర్‌ఎస్‌
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 2 నిమిషాల చదవడం

పార్టీ శ్రేణులంతా ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి : 
బీఆర్‌ఎస్‌‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలపై రగిలిపోతున్న యువతరం
సిట్టింగ్‌ 
స్థానాన్ని నిలబెట్టుకోవాలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
హైదరాబాద్- రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం బీఆర్‌ఎస్‌దే‌నని ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కె తారక రామారావు (కేటీఆర్) ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై యువతరం రగిలిపోతోందని అన్నారు. సోమవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో మూడు ఉమ్మడి జిల్లాల నేతలతో కేటీఆర్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకునేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీకి అన్నిరకాల అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. పార్టీ శ్రేణులంతా ఓటరు నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని అన్నారు. పార్టీ నేతలు, వారి కుటుంబ సభ్యులతోపాటు అర్హులైన ప్రతి ఒక్క పట్టభద్రుడితో ఓటు నమోదయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గతంలో ఈ స్థానం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణిదేవిని నిలబెట్టి విజయాన్ని సాధించామని గుర్తుచేశారు. పార్టీ నేతలంతా ప్రణాళికాబద్ధంగా సమిష్టిగా పనిచేయడం వల్లే ఆరోజు గెలుపు సాధ్యమైందని వివరించారు. ఈసారి కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని పార్టీ నేతలకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, పి సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, వి శ్రీనివాస్‌‌గౌడ్‌, పద్మారావు, సి లక్ష్మారెడ్డి, నిరంజన్‌‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు రావుల చంద్రశేఖర్‌‌రెడ్డి, ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌‌కుమార్‌, పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

పడిపోతున్న బీజేపీ గ్రాఫ్‌
దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ వేగంగా తగ్గుతోంద‌నీ, యువత ఆ పార్టీకి దూరమైందనే ఆందోళన ఆ పార్టీ అగ్రనేతలను కూడా వెంటాడుతోందని కేటీఆర్ చెప్పారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత తారాస్థాయికి చేరిందని అన్నారు. రెండు పార్టీలపై ప్రజాక్షేత్రంలో యువతరం రగిలిపోతోందనీ, వారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నదని వివరించారు. ఈ తరుణంలో బీఆర్‌ఎస్‌ పార్టీ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్ సర్కారు చేసిన మోసంపై మండిపడుతున్నారనీ, మరోవైపు నిరుద్యోగులు కోపంతో ఉన్నారని అన్నారు. ఇటీవలే వెయ్యి రోజులు పూర్తిచేసుకున్న ఈ ప్రభుత్వంపై విద్యావంతులు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా పక్కా ప్రణాళికతో ఓటర్ నమోదును సమర్థంగా చేపట్టి పార్టీ గెలుపు కోసం ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్