జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలపై సమగ్ర చర్చ : టీఎస్ యూటీఎఫ్ హర్షం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా సానుకూలంగా స్పందించారు. బుధవారం హైదరాబాద్ లో ఉపాధ్యాయులు, విద్యారంగానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలపై వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) పక్షానా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.వెంకట్, రాష్ట్ర కార్యదర్శి సింహాచలం పాల్గొని 35 అంశాలతో కూడిన ప్రాతినిథ్యాన్ని సమర్పించారు. దాదాపు అన్ని అంశాలపై విద్యాశాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో చర్చించిన అంశాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలకు కాలపరిమితితో పరిష్కారం చూపాలని వారు కోరారు. సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి.
ఈ ఏడాది ప్రయోగాత్మకంగా 9వ తరగతికి మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా, 6వ తరగతికి తొమ్మిది జిల్లాల్లో మాత్రమే బాహ్య మూల్యాంకనం నిర్వహిస్తారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించేందుకు అవసరమైన న్యాయపరమైన సహకారం కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు లేఖ రాస్తారు. సీనియర్ ప్రధానోపాధ్యాయులకు డిప్యూటీ డీఈఓలుగా ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించే చర్యలు చేపడతారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తగిన చర్యలు తీసుకుంటారు. కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనాలు వర్తింపజేసే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో బోధన సజావుగా కొనసాగేందుకు అవసరమైన తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. వాటికి త్వరగా అనుమతులు వచ్చేలా కృషి చేస్తారు.
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సర్వీస్ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఎంఈవోలకు తిరిగి అధికారాలు కల్పించే అంశాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించి పరిష్కరించేందుకు ప్రతి రెండు నెలలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలన్న సూచనకు విద్యాశాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలాస్ అడిషనల్ డైరెక్టర్స్ శ్రీహరి, లింగయ్య, రమణతో పాటు జాయింట్ డైరెక్టర్లు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి విద్యాశాఖ కార్యదర్శి సానుకూల స్పందన
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 01, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)