తెలంగాణలో 18 లక్షల కనెక్షన్లకు కోత
ఈ-కేవైసీ లింక్‌తో
సబ్సిడీ కోల్పోయిన పేద కుటుంబాలు
గడువు పొడిగించని కేంద్రం
వారంతా బహిరంగ మార్కెట్ ధరకు
5, 10 కిలోల సిలిండర్లు కొనుక్కోవల్సిందే
నేటి నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు
ఎస్‌ఎస్‌ఆర్ శాస్త్రి
దేశంలో దాదాపు 3 కోట్ల 8 లక్షల మంది ఎల్‌పీజీ గ్యాస్ గృహ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని ఎత్తేసింది. వీరంతా కేవలం తమ గ్యాస్ కనెక్షన్లను ఆధార్‌తో అనుసంధానం చేసుకుని ఈ-కేవైసీ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ-కేవైసీ గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది. అక్టోబర్ 1 నుంచి సవరించిన కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వినియోగదారులకు సంక్షిప్త సందేశాలు (ఎస్‌ఎమ్‌ఎస్) పంపాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలో దాదాపు 18 లక్షల మంది గ్యాస్ గృహ వినియోగదారులు నష్టపోతున్నారు. గ్యాస్ బండకు ఈ-కేవైసీ పేరుతో వేలిముద్రను లింక్ చేయడంతో పేదలు, వృద్ధులు, కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే వీరికి గ్యాస్ సరఫరాను నిలిపివేయబోమనీ, సబ్సిడీ లేని బహిరంగ మార్కెట్ ధరకు ఆయా గ్యాస్ ఏజెన్సీల నుంచి 5, 10 కిలోల సిలిండర్లను తీసుకోవచ్చని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు దేశంలో 5, 10 కిలోల సిలిండర్లు పరిమిత సంఖ్యలోనే ఉండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గృహ వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి సబ్సిడీ సొమ్మును జమచేయడం లేదు. అయితే సిలిండర్‌పై రూ.210 సబ్సిడీ ఇస్తున్నామనీ, ఆ సొమ్మును చమురు కంపెనీలకు నేరుగా చెల్లిస్తున్నామని కేంద్రం చెప్తున్నది. కేవలం ఉజ్వల్ స్కీం లబ్దిదారులకు మాత్రమే మొదటి 4 సిలిండర్లకు రూ.300 చొప్పున నేరుగా వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తున్నది.
దేశంలో మొత్తం గ్యాస్ గృహ వినియోగదారులు 32 కోట్ల 77 లక్షల 50వేల మంది ఉన్నారు. సాధారణ గృహ కనెక్షన్లు 22 కోట్ల 20 లక్షల 29 వేలు ఉన్నాయి. వాటికి అదనంగా ఉజ్వల్ కనెక్షన్స్ 10 కోట్ల 57 లక్షల 21 వేలు ఉన్నాయి. వీరిలో ఈ-కేవైసీ చేయని వినియోగదారులు ఎంతమంది అనే లెక్కల్ని కేంద్రం ప్రకటించలేదు. వంటగ్యాస్ కనెక్షన్ ఉంది. ఆధార్ ఉంది. బ్యాంకు ఖాతా ఉంది. ఏండ్లుగా సిలిండర్ తీసుకుంటున్నా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ నిబంధన అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. నకిలీ కనెక్షన్లు, గఅహ సిలిండర్ల అక్రమ మళ్లింపును అడ్డుకోవడమే లక్ష్యమని కేంద్రం చెప్తున్నా, సబ్సిడీ భారాలను తగ్గించుకోవడమే దీనివెనుక ఉన్న కుట్ర అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేంద్ర నిర్ణయం వల్ల అక్టోబర్ 1 నుంచి ఈ-కేవైసీ చేసుకోని వారికి 14.2 కిలోల గృహ సిలిండర్ బుకింగ్ నిలిచిపోతుంది. బయోమెట్రిక్ చేయని వినియోగదారులు ఇంకా 10.1 శాతం ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. అయితే వీరంతా నకిలీ వినియోగదారులని చెప్పడానికి వీల్లేదు. వీరిలో నిజమైన కుటుంబాలు, వృద్ధులు, వలస వెళ్లినవారు, సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటు న్నవారూ ఈ జాబితాలో ఉన్నారు. నకిలీ కనెక్షన్లను పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేననీ, దానికి నిజమైన వినియోగదారుడి సిలిండర్‌ను ఎందుకు అడ్డుకోవాలని పౌరసమాజం ప్రశ్నిస్తుంది.
వేలిముద్ర పడకపోతే..
ధరే మారిపోతుంది
బయోమెట్రిక్ చేయని వారి గ్యాస్ కనెక్షన్‌ను కేంద్రం రద్దు చేయడం లేదు. కానీ ఇప్పటిలా నియంత్రిత ధరకు 14.2 కిలోల గఅహ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉండదు.అయితే వారికి కేంద్రం చూపుతున్న ప్రత్యామ్నాయం రాయితీ లేని మార్కెట్ ధరకు 5 కిలోలు లేదా 10 కిలోల సిలిండర్ తీసుకోవాలి. అదీ స్థానికంగా అందుబాటులో ఉంటేనే. బయోమెట్రిక్ పూర్తిచేస్తే మళ్లీ సాధారణ విధానంలోకి రావచ్చు అని గ్యాస్ కంపెనీలు చెప్తున్నాయి.
కేంద్రం ఇచ్చేదెంత?
గృహ వినియోగదారులకు ఇస్తున్న గ్యాస్ సబ్సిడీని డైరెక్ట్ బెనిఫిట్ స్కీం (డీబీటీ) పేరుతో కేంద్రం దశలవారీగా తగ్గించుకుంటూ వచ్చింది. ఇప్పుడు మొత్తానికే సబ్సిడీని ఎత్తేసింది. అయితే 14.2 కిలోల సాధారణ గఅహ సిలిండర్‌ను మార్కెట్‌కు అనుసంధానమైన సరఫరా వ్యయం కంటే తక్కువ ధరకు అందిస్తున్నామని కేంద్రం చెబుతోంది. సెప్టెంబరులో ఈ వ్యత్యాసం ఒక్కో సిలిండర్‌పై సుమారు రూ.210 ఉందని తెలిపింది. ఇది వినియోగదారుడి ఖాతాలో పడే నగదు కాదు. నియంత్రిత ధర కారణంగా లభిస్తున్న పరోక్ష ప్రయోజనం. ఈ సొమ్మును చమురు కంపెనీలకు నేరుగా చెల్లిస్తున్నామని కేంద్రం చెప్తుంది. అదే సమయంలో ఉజ్వల లబ్ధిదారులకు మాత్రం అదనంగా రూ.300 ప్రత్యక్ష రాయితీ ఉంది. ప్రస్తుతం సంవత్సరంలో తొలి నాలుగు బుకింగ్స్‌కు రూ.300 చొప్పున, గరిష్ఠంగా రూ.1,200 వినియోగదారుల ఖాతాల్లో జమచేస్తున్నామని కేంద్రం చెప్తుంది.
తెలంగాణలో...
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీని క్రమేణా ఎత్తేసి, ధరను పెంచడంతో వినియోగదారులపై ఆర్థికభారాలు పెరిగాయి. వంటింటి బడ్జెట్ భారంగా మారింది. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరుతో అర్హులైన కుటుంబాలకు రూ.500కే గఅహ వంటగ్యాస్ సిలిండర్ అందిస్తోంది. 2024 ఆగస్టు నాటికి ఈ స్కీంలో లబ్దిదారుల సంఖ్య 43 లక్షలు కాగా, తాజాగా మరో 5 లక్షలకు పైగా కనెక్షన్లు చేరాయి. ఈ స్కీంకు ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్‌లో రూ.723.30 కోట్లు కేటాయించింది.
వీరంతా బాధితులే..
వృద్ధాప్యంతో వేలిముద్రలు సరిగా పడనివారు, రోజూ చేతులతో కష్టపడి పనిచేసే వ్యవసాయ, నిర్మాణ కార్మికులు, స్మార్ట్‌ఫోన్ లేనివారు, గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరుతో ఉందో వారు వేరే ప్రాంతంలో ఉంటున్న కుటుంబాలకు చెందినవారంతా బాధితులుగా మిగిలారు.
తెలంగాణలో...
1. గృహ ఎల్‌పీజీ కనెక్షన్లు 1 కోటి 26 లక్షలు
2. ఈ-కేవైసీ పెండింగ్ దాదాపు 18 లక్షలు
3. తెలంగాణ మహాలక్ష్మి లబ్ధిదారులు 42.90 లక్షలు (రూ.500 గ్యాస్ పథకం)
4. అదనంగా గుర్తించిన మహాలక్ష్మి అర్హులు 5 లక్షలకు పైగా
5. మహాలక్ష్మి వార్షిక కేటాయింపు రూ.723.30 కోట్లు
దేశంలో గ్యాస్ సబ్సిడీ కోత అంశం గణాంకం
1. మొత్తం గృహ ఎల్‌పీజీ కనెక్షన్లు
32 కోట్ల 77 లక్షల 50 వేలు
2. ఉజ్వల కనెక్షన్లు 10 కోట్ల 57 లక్షల 21 వేలు
3. సాధారణ గృహ కనెక్షన్లు
22 కోట్లు 20 లక్షల 29 వేలు
4. ఉజ్వల వాటా 32.3 శాతం
5. ఈ-కేవైసీ పూర్తి 27 కోట్లు 43 లక్షలు
6. ఈ-కేవైసీ పూర్తి శాతం 89.9 శాతం (దేశవ్యాప్తంగా)
7. ఈ-కేవైసీ పెండింగ్ 3 కోట్ల 8 లక్షలు
8. సాధారణ గ్యాస్ ప్రత్యక్ష సబ్సిడీ ఏమీ లేదు
9. సాధారణ గ్యాస్ పరోక్ష రాయితీ సుమారు రూ.210 (ఖాతాలో జమ కాదు)
10. ఉజ్వల ప్రత్యక్ష సబ్సిడీ రూ.300
(ఒక్కో 14.2 కిలోల సిలిండర్‌పై)
11. ఉజ్వల సబ్సిడీ పరిమితి 4 సిలిండర్లకు (గరిష్టం రూ.1,200)







కామెంట్‌లు (0)