Magazines

జ్ఞానేశ్‌‌కుమార్‌ రాజీనామా చేయాల్సిందే

2 గంటల క్రితం

Gyanesh Kumar
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 4 నిమిషాల చదవడం

సర్ ప్రక్రియను తక్షణమే నిలిపేయాలి
తొలగించిన ఓట్లలో అర్హులైన వారిని చేర్చాలి
వామపక్ష, బీఆర్ఎస్, టీజేఎస్ నేతల డిమాండ్
అదనపు సీఈవో వెంకటేశ్వర్‌‌రెడ్డికి వినతి

బీఆర్‌కేఆర్‌ భవన్ వద్ద ‌ తీవ్ర ఉద్రిక్తత .. పలువురి అరెస్టు


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని వామపక్ష, బీఆర్ఎస్, టీజేఎస్ పార్టీలు డిమాండ్ చేశాయి. రాజ్యాంగ వ్యతిరేకం గా పని చేస్తున్న ‌సీఈసీని అరెస్టు చేయాలని కోరాయి. సర్ ప్రక్రియను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశాయి. తొలగించిన ఓట్లలో అర్హులైన వారి ఓట్లను తిరిగి చేర్చాలని కోరాయి. ఈ మేరకు అదనపు సీఈవో వాసం వెంకటేశ్వర్‌‌రెడ్డిని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జా‌న్‌వెస్లీ, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరాం, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఎంసీపీఐ(యూ) నాయకులు అనిల్ కుమార్, ఎస్ యూసీఐ (సీ) రాష్ట్ర కార్యదర్శి మురహరి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా, ఆర్ ఎస్ పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న కలిసి వినతి పత్రం అంద జేశారు. ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ‌దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.


బీఆర్‌కేఆర్‌‌ భవన్‌ ‌వరకు ప్రదర్శన
అంతకు ముందు ట్యాంక్‌బండ్ వద్ద ‌డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ విగ్రహానికి ‌వామపక్ష, బీఆర్‌ఎస్‌, టీజేఎస్‌‌ పార్టీల నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి బీఆర్‌కేఆర్ భవన్ ‌వరకు ప్రదర్శన నిర్వహిం చారు. ఓట్ల దొంగ జ్ఞానేశ్‌ కుమార్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పటికే బీఆర్‌కేఆర్ భవన్ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు.ప్రదర్శనగా వచ్చిన నాయకులు, కార్యకర్తలను బీఆర్‌‌కేఆర్‌‌ భవన్‌‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు యత్నించగా తోపులాట జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల జులుం నశించాలి అని నినాదాలు చేశారు. ‌బారికేడ్లను తొలగించేందు కు తీవ్రంగా ప్రయత్నించడంతో పోలీసులు సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి సహా పలువురిని అరెస్టు చేశారు. జాన్‌వెస్లీ, ఎమ్మెల్సీలు కోదండరాం, ఎల్ రమణ విజ్ఞప్తితో పోలీసులు బారికేడ్లను తొలగించారు. బీఆర్ కేఆర్ భవన్ వద్ద బైటాయించి కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. Gyanesh Kumar


సీఈసీని తొలగించకుంటే 
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం : జాన్‌‌వెస్లీ సీ
ఈసీ జ్ఞానేశ్‌ కుమార్ రాజీనామా చేయకుంటే ఈ ఉద్యమం ఇక్కడితో ఆగబోదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపే ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు. జ్ఞానేశ్‌ కుమార్ సీఈసీగా కాకుండా బీజేపీకి, ప్రధాని మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సర్ ప్రక్రియ వల్ల రాష్ట్రాల్లో ప్రభుత్వాలే మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి వ్యతిరేకంగా ఉండే 37 లక్షల ఓ‌ట్లను తొలగించడంతో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నా రు. తమిళనాడులో డీఎంకే ఓడిపోయిందని తెలిపారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే బీజేపీ ఓడిపోయే పరిస్థితి ఉన్నందునే బీజేపీ వ్యతిరేక ఓట్లు సుమారు 13 కోట్ల ఓట్లను ఈసీ తొలగించిందని విమర్శించారు. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ఈసీ ద్వారా ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్ రాజీనామా చేయాలని, ఆయనపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జ్ఞానేశ్‌ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ గురువారం అన్ని జిల్లాల్లో చేపట్టే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు.


జ్ఞానేశ్‌‌కుమార్‌ ‌రాజీనామా ప్రజల డిమాండ్‌ : టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరాం
జ్ఞానేశ్‌ కుమార్ రాజీనామా చేయడం ప్రజల డిమాండ్ అని టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ఈసీని నడపాలి కానీ ఆయన నిబంధనలను తుంగలో తొక్కారని తెలిపారు. ఎన్నికలే ప్రజాస్వామ్యానికి మూలమని చెప్పారు. జ్ఞానేశ్‌ కుమార్ ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోయేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ ఈసీ పారదర్శకంగా సర్ ప్రక్రియను నిర్వహించాలని చెప్పారు. కానీ అర్హులైన వారి ఓట్లను తొలగిస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తీసేయడం సరైంది కాదన్నారు. అర్హులైన ఓట్లను కేంద్రం, ఈసీ తిరిగి చేర్చాలని డిమాండ్ చేశారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ మాట్లాడుతూ అర్హులైన వారి ఓట్లను తొలగించి అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ భావిస్తున్నదని విమర్శించారు. వారణాసిలో ప్రధాని మోడీ దొంగ ఓట్లతో గెలిస్తే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి ఈసీ ఊడిగం చేస్తున్నదని విమర్శించారు. సర్ పేరుతో జ్ఞానేశ్‌ కుమార్ ఓట్లను తొలగిస్తుంటే ప్రధాని మోడీ ఎందుకు నోరు మెడపడం లేదని ప్రశ్నించారు. మాస్ లైన్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ జ్ఞానేశ్‌ కుమార్ ను సీఈసీ నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అర్హుల 13 కోట్లు కాదు 20 కోట్ల ఓట్లు తొలగించే ప్రమాదం ఉందన్నారు. ఎంసీపీఐ(యూ) నాయకులు అనిల్ కుమార్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న మాట్లాడుతూ బీజేపీ ఏజెంట్ గా జ్ఞానేశ్‌ కుమార్ పని చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టీ జ్యోతి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్, మల్లు లక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ శ్రీరామ్ నాయక్, ఆర్ వెంకట్రాములు, బి ప్రసాద్, అరుణ జ్యోతి, ఎం వెంకటేష్, సీనియర్ నాయకులు డిజి నరసింహ రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ బోస్, హైదరాబాద్ కార్యదర్శి స్టాలిన్, మాస్‌లైన్ నాయకులు హన్మేష్, రమ, ప్రదీప్, టీజేఎస్‌ నాయకులు పిఎల్‌ ‌విశ్వేశ్వరరావుతోపాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.








ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్