Magazines

ప్రభుత్వాస్పత్రుల్లో అవస్థలు

1 గంట క్రితం

Hardships in Government Hospitals
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 3 నిమిషాల చదవడం

సీజనల్‌ వ్యాధులతో పెరిగిన ఓపీ
అత్యవసర సేవల మెరుగుదలలో నిర్లక్ష్యం
ప్రయివేటు కాంట్రాక్టర్లు, ఏజెన్సీలతో పలువురి హెచ్‌ఓడిలు, అధికారుల కుమ్మక్కు
నల్లగొండ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో సమస్యలు తీవ్రం
పెరుగుతున్న రద్దీ సౌకర్యాలు నిల్‌ ఉచిత మందుల కొరత సిబ్బందీ అరకొరే
నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి/విలేకరులు ​
రాష్ట్రంలోని పలు ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులు సమస్యల నిలయాలుగా ఉన్నాయి. శానిటేషన్‌ ‌మొదలు అత్యవసర యంత్రాల నిర్వహణ, ఉచిత మందుల కొరత, ఓపీకి తగ్గట్టుగా సిబ్బంది లేకపోవడం, పరీక్షలు చేసే పరికరాలు పాడైపోవడం, ఇలా ఏదో ఒకటి లేకపోవడంతో ‌ వైద్యం కోసం వచ్చిన రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్‌ వ్యాధులు, సాధారణ అనారోగ్య సమస్యలతో ఓపీకి వచ్చే వారి సంఖ్య పెరగడంతో రిజిస్ట్రేషన్‌ నుంచి వైద్య పరీక్షలు, డయాగ్నస్టిక్‌ సేవలు, మందుల పంపిణీ వరకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ.. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు, సిబ్బంది, విశ్రాంతి సౌకర్యాలు విస్తరించకపోవడం ఇబ్బందులకు కారణమవుతోంది. ఎక్కడోచోట ఏదో ఒక సంఘటన జరుగుతుండడంతో భయాందోళన మధ్య ఉంటున్నారు. వరంగల్‌ ఎంజీఎంలో పై పెచ్చులు ఊడిపడటంతో రోగులు భయాందోళన మధ్య చికిత్స చేయించుకుంటున్నారు. ఆదిలాబాద్‌ ‌రిమ్స్‌‌లో అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యుద్ఘాతానికి పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవల్చి వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో నీటి సమస్యతో పాటు బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. నీలోఫర్‌, తదితర ఆస్పత్రుల్లో రాత్రి సమయాల్లో అత్యవసర సమయాల్లో వైద్యం అందించే డాక్టర్లు కొరత వేధిస్తోంది. కార్పొరేట్‌ ‌వైద్యం అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా దానికి తగ్గ రీతిలో పలువురు హెచ్‌ఓడీలు, అధికారులు ఉండటం లేదని తెలుస్తోంది. ప్రయివేటు కాంట్రాక్టర్లు, ఏజెన్సీలతో కుమ్మక్కు కావడం వల్లే నాసిరకం పనులు జరిగి ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయలు అవినీతి జరుగుతున్నా ప్రభుత్వం చూసీచూడనట్టు పోతుందని పలువురు ఆరోపిస్తున్నారు. నిత్యం ఎదుర్కోనే సమస్యలు కూడా చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిష్కారం కావడం లేదు. ముఖ్యంగా నల్లగొండ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో పెరుగుతున్న ఓపీకి అనుగుణంగా మందుల పంపిణీ లేదు. డయాగ్నస్టిక్‌ ‌సేవలు లేవు.
​​రోజూ 1200 మందికి పైగా రాక
నల్లగొండలోని ​జీజీహెచ్‌కు రోజూ 1200 మందికి పైగా రోగులు వస్తుండగా.. సుమారు వెయ్యి మంది ఓపీ సేవలను వినియోగిస్తున్నట్టు సమాచారం. దాదాపు 180 మంది ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిగా జీజీహెచ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రస్తుత సౌకర్యాలు, సిబ్బంది సామర్థ్యాన్ని పెంచకపోతే ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీపీఐ(ఎం)తో పాటు ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
​​పరీక్షలకూ.. మందులకూ క్యూనే..
అవసరమైన రక్త పరీక్షలు, ఎక్స్‌రే, ఇతర డయాగ్నస్టిక్‌ సేవల కోసం కూడా రోగులు వేచి ఉండాల్సి వస్తోంది. పరీక్షలు పూర్తయిన తర్వాత మందుల కోసం ఫార్మసీ కౌంటర్‌ వద్ద మరో క్యూ తప్పడం లేదు. ఓపీ రద్దీకి అనుగుణంగా రిజిస్ట్రేషన్‌, ఫార్మసీ కౌంటర్ల సంఖ్య పెంచడంతోపాటు.. రోగులను విభాగాల వారీగా క్రమబద్ధీకరించే విధానం అమలు చేయాలని రోగులు కోరుతున్నారు. వసతుల కొరత ఉంది. చాలామంది నేలపైనే పడుకుంటున్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు, మరుగుదొడ్ల పరిశుభ్రతపై ఫిర్యాదులు ఉన్నాయి.

​​సిబ్బంది కొరత ​ప్ర
భుత్వ వైద్య కళాశాల-ఆస్పత్రిగా విస్తరిస్తున్న జీజీహెచ్‌లో రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు, నర్సింగ్‌, పారామెడికల్‌, ఇతర సహాయక సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంది. ఓపీ, డయాగ్నస్టిక్‌, ఫార్మసీ విభాగాల్లో అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచితే నిరీక్షణ సమయం తగ్గే అవకాశం ఉంది.

​​న్యూరో.. కార్డియాక్‌ సేవలు ఎప్పుడు?
​జీజీహెచ్‌ స్థాయి పెరుగుతున్నప్పటికీ న్యూరో సర్జరీ, కార్డియాక్‌ వంటి సూపర్‌ స్పెషాలిటీ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. వాటి సేవలను అందుబాటులో ఉంచాలని వైద్యసంఘాలు కోరుతున్నాయి.


​​ఓపీ కష్టాలు
​ఉదయం ఆస్పత్రి ప్రారంభ సమయానికే ఓపీ రిజిస్ట్రేషన్‌ కౌంటర్ల వద్ద రోగుల క్యూ ఉంటోంది. రిజిస్ట్రేషన్‌ స్లిప్‌ కోసం గంట నుంచి రెండు గంటల వరకు వేచి చూడాల్సి వస్తోంది. స్లిప్‌ తీసుకున్న తర్వాత జనరల్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్స్‌, గైనకాలజీ, పీడియాట్రిక్స్‌ తదితర విభాగాల వద్ద వైద్యుల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. ఒక్కో విభాగం వద్ద రద్దీని బట్టి గంట వరకు సమయం పడుతోందని రోగులు వాపోతున్నారు.

​​రద్దీకి తగ్గట్టు వసతులు పెంచాలి
​జీజీహెచ్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రోగుల రాక పెరుగుతోంది. రోగుల సంఖ్యకు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ కౌంటర్లు, వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, డయాగ్నస్టిక్‌ సేవలు, ఫార్మసీ కౌంటర్లు, తాగునీరు, మరుగుదొడ్లు, అటెండెంట్‌ రెస్ట్‌హౌస్‌ వంటి మౌలిక సదుపాయాలను విస్తరించాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ ‌చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్