Magazines

కేవీపీఎస్‌ లక్ష్యం అసమానతల అంతం


3 గంటల క్రితం

KVPS's goa
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా అంటరానితనం

బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆరు లక్షలమంది దళితులపై 
దాడులు : కేవీపీఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో 
ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాన్‌‌వెస్లీ


నవతెలంగాణ-హైదరాబాద్‌ బ్యూరో
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలోనే కులం పేరుతో వివక్ష, అంటరానితనం ఉన్నాయనీ, అసమానతలు లేని సమాజ నిర్మాణమే తమ అంతిమ లక్ష్యమని కేవీపీఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు జాన్‌‌వెస్లీ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని చిక్కడపల్లిలో గల కేవీపీఎస్‌ ‌రాష్ట్ర కార్యాలయం వద్ద ఆ సంఘం 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్‌‌వెప్లీ కేవీపీఎస్‌ ‌జెండాను ఎగుర వేశారు. డాక్టర్‌ ‌బీఆర్‌.అంబేద్కర్‌, జ్యోతిబాపూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.స్కైలాబ్‌‌బాబు అధ్యక్షతన జరిగిన సభలో జాన్‌‌వెస్లీ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే దళితులపై ఆరు లక్షలకుపైగా దాడులు జరిగాయనీ, కులవివక్షను ప్రశ్నించిన రెండు వేల మంది దళితులను చంపేశారనీ, ఏటా ఐదు వేల మందికిపైగా దళిత మహిళలపై లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయని వివరించారు. రిజర్వేషన్లు అమలవుతున్నది ప్రభుత్వ రంగంలో మాత్రమేననీ, ఆ రంగాన్నీ మోడీ సర్కారు ప్రయివేటుపరం చేసి వెనుకబడిన సామాజిక తరగతుల వారికి తీరని అన్యాయం చేస్తున్నదని ఎండగట్టారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ పోతున్నదని విమర్శించారు. మనువాదాన్ని తెరపైకి తీసుకొస్తున్న తీరును వివరించారు.

ఇలాంటి పరిస్థితుల్లో హక్కుల పరిరక్షణ కోసం విశాల వేదిక ద్వారా విస్తృత ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని భూములపై సమగ్ర విచారణ జరిపించి మిగులు భూముల్ని దళిత పేదలకు పంచాలని డిమాండ్‌ ‌చేశారు. విద్యా వైద్యం కార్పొరేట్ల చేతుల్లో పెట్టి పేదలకు సర్కార్ దవాఖానాలు మాత్రమే ఉండటం వల్ల సరైన వైద్యం దక్కట్లేదని వాపోయారు. విద్యా, వైద్య రంగాలను ప్రభుత్వ పరం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అరుణజ్యోతి, మల్లులక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, చేతివృత్తిదారుల సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ఎంవీ.రమణ, కేవీపీఎస్‌ ‌రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌ ‌బాబు మాట్లాడుతూ.. దళితుల హక్కులు కాగితాల్లోనే ఉంటున్నాయనీ, ఇదేంటని దళితులు ప్రశ్నిస్తే దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండ కొనసాగుతున్నాయని చెప్పారు. సామాజిక ఆర్థిక అసమానతలు కొనసాగుతున్న ఈ సమాజంలో ఆ అసమానతలను అంతం చేయడం కోసం సామాజిక, ఆర్థిక పోరాటాలు జమిలీగా నిర్మించాలనీ పిలుపునిచ్చారు.

గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ నేటికీ కుల వివక్ష పోలేదనీ, రూపం మార్చుకుని బుసలు కొడుతున్నదని వివరించారు. కేవీపీఎస్‌ ఏర్పడిన తొలినాళ్లలో వేలాది గ్రామాల్లో సర్వే నిర్వహిం‌చి 63 రకాల వివక్షా రూపాలను గుర్తించి వాటిని పోగొట్టేందుకు పోరాడుతున్నదని చెప్పారు. దేశం వెలిగిపోతుందంటూ బీజేపీ పాలకులు గొప్పలు చెప్పు కుంటుండగా... మరోవైపు పేదలు, వెనుకబడిన సామాజిక తరగతుల వారి జీవితాలు నలిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతున్న తీరును వివరించారు. వీడీసీలతో సాంఘిక బహిష్కరణలు దారుణమనీ, ఇలాంటి చర్యలకు పాల్పడేవారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ ‌చేశారు. రాజ్యాంగం, రిజర్వేషన్ల పరిరక్షణ నేటి సామాజిక శక్తులకు కర్తవ్యమని చెప్పారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది గడిపే నాగయ్య, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్, పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్‌ ఉద్యోగి ఈ.నర్సింగరావు, జూనియర్ కళాశాల లెక్చరర్ ఇందిర, నీటిపారుదల శాఖ సూపరిండిండెంట్‌ బొల్లి చెన్నయ్య, కంటోన్మెంట్ బోర్డ్ రిటైర్డ్ ఇం‌జినీర్ దుబ్బ రాజేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు, జగతి ఆర్ట్స్ అధ్యక్షులు ఆర్ సైదులు, జై భీమ్ మహాసేన రాష్ట్ర అధ్యక్షులు రాజ్యాంగం అంజన్న, ఎన్‌‌పీఆర్‌‌డీ రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకట్, కేవీపీఎస్‌ నగర కార్యదర్శి బి సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్