గోదావరిలో వరద పోతుంటే రాజకీయాలొద్దు
ఎల్‌నినో కారణం చూపి బాధ్యత నుంచి తప్పించుకోవద్దు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్‌రావు లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గోదావరిలో వరద వచ్చినప్పుడు ఆ నీటిని ఒడిసిపట్టి రిజర్వాయర్లను నింపితే రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు తెలిపారు. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు గోదావరిలో భారీ వరద ప్రవాహం ఉన్నా, ఆ నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. నీళ్లు అందక పంటలు ఎండిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల మీద రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు.
గోదావరి జలాలను ఎత్తిపోయకుండా చోద్యం చూస్తున్నదని తెలిపారు. మోటార్లు నడిపి రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హరీశ్‌రావు శుక్రవారం లేఖ రాశారు. గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతుంటే, అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజీలో ఉన్నాయని తెలిపారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 13 టీఎంసీలు మాత్రమే ఉండడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఇక్కడ 50 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం అందుబాటులో ఉందని తెలిపారు.
మల్లన్న సాగర్ నిండుకుండలా మారితే హైదరాబాద్ తాగునీటి అవసరాలతోపాటు, మూసీ ప్రాజెక్టుకు కూడా ఇక్కడి నుంచి నీటిని తరలించే అవకాశం ఉంటుందని వివరించారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోనూ 15 టీఎంసీలకు కేవలం ఆరు టీఎంసీలే ఉన్నాయని తెలిపారు. ఇక్కడికి సైతం నీటిని ఎత్తిపోస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలోని బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
ఈ రిజర్వాయర్లను నింపడం వల్ల దాదాపు ఐదు లక్షల ఎకరాల సాగు విస్తీర్ణానికి దోహదం చేసినట్లవుతుందని వివరించారు. మిడ్ మానేరు దిగువన ఉన్న లోయర్ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ)లో ప్రస్తుతం 11 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఇక్కడికి నీటిని తరలిస్తే కరీంనగర్, వరంగల్ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయని పేర్కొన్నారు. పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్ జిల్లాల్లోని రైతులు, ప్రజలకు ఎంతో మేలు చేసిన వారవుతారని పేర్కొన్నారు.
పామాయిల్ రైతుల్లో ఆందోళన
సిద్దిపేట జిల్లా నర్మెట్టలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఈ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్వహణ కోసం రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని తెలిపారు. రంగనాయక సాగర్‌లో నీళ్లు లేకపోవడం వల్ల పామాయిల్ ఫ్యాక్టరీ నిర్వహణ ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితితో పామాయిల్ సాగు చేస్తున్న రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి కోసం రైతులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తుంటే, ప్రభుత్వం నదుల్లో వస్తున్న నీళ్లను లిఫ్ట్ చేయకుండా కిందకు
వదిలిపెడుతున్నదని విమర్శించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపం
గోదావరి నదిలో ఎల్లంపల్లి వద్ద వరద ప్రవాహం భారీగా కొనసాగుతున్నదని హరీశ్‌రావు తెలిపారు. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని అన్ని మోటార్లను నడిపి నీళ్ళు లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతున్నదని విమర్శించారు. జలకళతో కనిపించాల్సిన రిజర్వాయర్లు ఎండిపోయి కనిపిస్తున్నాయంటే దానికి కారణం నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యమేనని తెలిపారు.
కండ్లు తెరవాలనీ ఎల్‌నినోను సాకుగా చూపకుండా, అందివచ్చిన గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకునేలా ఆన్-ఆఫ్ పద్ధతిలో కాకుండా 24 గంటల పాటు అన్ని మోటార్లు నడిపి జలాశయాలను నింపాలని డిమాండ్ చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి రైతు ప్రయోజనాల కోసం ఆలోచించాలని, ప్రకృతిపై నెపం నెట్టి రైతులకు సాగు నీళ్లు ఇచ్చే బాధ్యత నుంచి తప్పించుకోవద్దని విజ్ఞప్తి చేశారు.






కామెంట్‌లు (0)