మంత్రి దామోదర
రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆరోగ్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర అంత్యంత కీలకమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ర రాజనర్సింహ చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి రాజనర్సింహ కేక్ కట్ చేశారు. ఫార్మసిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన మందులు అందించడంలో, సరైన మోతాదులో మందుల వినియోగంపై అవగాహన కల్పించడంలో ఫార్మసిస్టుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. 2026 సంవత్సరానికి గాను "ఫార్మసిస్టులు – ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసే భాగస్వాములు" అనే థీమ్‌తో అంతర్జాతీయ ఫార్మసిస్టుల సమాఖ్య (ఎఫ్ఐపీ) ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం అత్యంత సముచితమన్నారు. ఫార్మసీ వృత్తిని మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. నాణ్యమైన మందుల లభ్యతను మెరుగుపరచడానికి, ఫార్మసీ విద్యను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతంలో భాగంగా ప్రభుత్వాస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లోని మెడికల్ స్టోర్లలో ఫార్మసిస్టుల నియామకాలను దశలవారీగా భర్తీ చేస్తున్నామని చెప్పారు. ఫార్మసిస్టులకు తగిన గుర్తింపు, అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కోవిడ్ సమయంలో ఫార్మసిస్టులు చూపిన అంకితభావం, సేవా తత్పరత చిరస్మరణీయమన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజారోగ్య పరిరక్షణలో ప్రభుత్వ ఫార్మసి ఆఫీసర్స్ భాగస్వామ్యం మరింత విస్తృతం కావాలని ఆకాంక్షించారు.
ఆరోగ్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం
46 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)