Magazines

సమస్యల నిలయంగా రిమ్స్‌

1 గంట క్రితం

RIMS as a place of problems
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 2 నిమిషాల చదవడం

‌కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే పసికందులు బలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ఆదిలాబాద్‌ రిమ్స్‌ను సందర్శించిన ఆ పార్టీ బృందం

నవతెలంగాణ-ఆదిలాబాద్‌ 
ప్రాంతీయ ప్రతినిధి
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రి సమస్యలకు నిలయంగా మారిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే పసికందులు మృతి చెందారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఇటీవల రిమ్స్‌లో ఏసీ పేలి ఐదుగురు నవజాత శిశువులు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆయన శుక్రవారం ఆస్పత్రిని సందర్శించారు. వార్డుల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. ఘటనపై వైద్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. ధనిక దేశమని గొప్పలు చెప్పుకుంటున్న ప్రధాని మోడీ, ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి పేద ప్రజల ప్రాణాలను కాపాడలేక పోతున్నారని విమర్శించారు. రిమ్స్‌ ఎస్‌ఎన్‌సీయూ వార్డులో చోటు చేసుకున్న దుర్ఘటనలో ఐదుగురు ముక్కుపచ్చలారని శిశువులు మృతి చెందారని, మరో 17 మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతిచెందిన శిశువుల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రిమ్స్‌లో ఎస్‌ఎన్‌సీయూ వార్డు కేంద్ర ప్రభుత్వ నిధులతో కొనసాగుతోందని, కానీ నిధులు కేటాయించక నిర్వహణ లోపం తో ఈ సంఘటన చోటుచేసుకుందని జాన్‌వెస్లీ చెప్పారు. ఆ వార్డులో సరైన సౌకర్యాలు లేకపోవడమే ఘటనకు ప్రధాన కారణమన్నారు. ఆస్పత్రిలో ఏసీలు పనిచేయడం లేదని, పారిశుధ్యం లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పది మంది పనిచేసే చోట మూడు నుంచి ఐదుగురు మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. సిబ్బందికి సరైన వేతనాలు రావడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రిమ్స్‌కు నిధులు కేటాయించి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా మృతి చెందిన శిశువుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ​భూనిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు భూనిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఆదిలాబాద్‌కు వచ్చిన ఆయన ఎయిర్‌పోర్టు ఏర్పాటులో భూములు కోల్పోతున్న అనుకుంట గ్రామ రైతులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు ఎలాంటి పోరాటాలకైనా తమ పార్టీ సిద్ధంగా ఉందని నిర్వాసితులకు భరోసా కల్పించారు. ఎకరానికి రూ.6కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విమానాశ్రయం ఏర్పాటులో అత్యధిక భూములు కోల్పోతున్న అనుకుంట రైతులతోపాటు మిగతా ఐదు గ్రామాల భూనిర్వాసితులు కలిసి న్యాయపోరాటానికి సిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్‌, నాయకులు ఉడుత రవీందర్‌, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత, టీఏజీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్‌, కార్యదర్శి వర్గ సభ్యులు లంక రాఘవులు, అన్నమొలకల కిరణ్‌, బొజ్జ ఆశన్న, ఐద్వా జిల్లా కార్యదర్శి మంజుల, నాయకులు స్వామి, నాయకులు రాములు, ఆశన్న ఉన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్