క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకాన్ని
44 శాతానికి పునరుద్ధరించాలి
మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్‌ఎస్ పరిధిలోకి తేవాలి
లోటు వర్షపాత మండలాలకు
కేంద్రం ప్రత్యేక సాయమందించాలి
రైతుల ప్రయోజనాలను కాపాడేలా సీడ్ బిల్లు తేవాలి : మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పంటల వైవిధ్యీకరణలో భాగంగా చేపట్టిన చర్యలతో పప్పుధాన్యాల సాగు గత ఖరీఫ్‌తో పోలిస్తే 36 శాతం పెరిగి దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ రబీ సదస్సులో పలు కీలక అంశాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ దృష్టికి మంత్రి తుమ్మల తీసుకెళ్లారు. తెలంగాణలో కూరగాయల సాగుకు విస్తృత అవకాశాలున్న నేపథ్యంలో ప్రస్తుతమున్న 8,800 ఎకరాల లక్ష్యాన్ని లక్ష ఎకరాలకు పెంచేందుకు కేంద్రం అనుమతితో పాటు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరారు. లోటు వర్షపాతమున్న మండలాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయమందించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో, కరువు పరిస్థితులను ఎదుర్కొనే ప్రత్యేక చర్యగా మొక్కజొన్న, జొన్నను ధరల మద్దతు పథకం (పీఎస్‌ఎస్) పరిధిలోకి తీసుకురావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ తెలంగాణలో అదనంగా దాదాపు 1.10 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు విస్తరిం చిందనీ, సుమారు 72 వేల మంది కొత్త రైతులు ఆయిల్‌పామ్ సాగులోకి వచ్చారని తెలిపారు. ఆయిల్‌పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకాన్ని గతంలో ఉన్న 44 శాతానికి పునరుద్ధరించాలని కోరారు. దేశీయంగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్న సమయంలో దిగుమతి విధానాలు కూడా దేశీయ రైతులకు అనుకూలంగా ఉండాలని నొక్కి చెప్పారు. రైతులకు రియల్‌టైమ్‌లో నేల ఆరోగ్య వివరాలను అందించేందుకు శాటిలైట్ ఆధారిత సాయిల్ హెల్త్ టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల సబ్సిడీ విధానాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణలో 33 జిల్లాలు ఉండగా ప్రస్తుతం 16 కృషి విజ్ఞాన కేంద్రాలు మాత్రమే ఉన్నాయని మంత్రి తెలిపారు. వ్యవసాయ విద్య, పరిశోధన ద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం వేగంగా రైతులకు చేరేందుకు వ్యవసాయ విస్తరణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణకు అదనంగా 16 కృషి విజ్ఞాన కేంద్రాలను ఐసీఏఆర్ ద్వారా మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు.
కొడంగల్‌లో అగ్రి బిజినెస్ పార్క్, సెమీ-అరిడ్ హార్టికల్చర్ క్రాప్స్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌లకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని విన్నవించారు. తెలంగాణలో విత్తన రంగానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని రైతు ప్రయోజనాలను కాపాడేలా కొత్త సీడ్ బిల్లును త్వరగా తీసుకురావాలని కోరారు. పంట నష్టాల సందర్భంలో రైతులకు పరిహారం అందించే తగిన నిబంధనలతో పాటు, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినమైన చర్యలు తీసుకునేలా బిల్లులో నిబంధనలు ఉండాలని విజ్ఞప్తి చేశారు.
పప్పుధాన్యాల సాగులో రెండోస్థానంలో తెలంగాణ
56 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)