Magazines

దేశగతిని మార్చిన జెన్‌ జీ ఉద్యమం

4 గంటల క్రితం

Gen Z movement
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 7 నిమిషాల చదవడం

షా Vs యోగి... వచ్చే యూపీ ఎన్నికల ప్రాతిపదిక అదే

దేశంలో విద్య, వైద్యరంగాల పట్ల తీవ్ర నిర్లక్ష్యం
ఓటర్లకు సబ్సిడీ గాయాలు హిస్టరీ షీటర్‌ తెలుగు అనువాదం వెలువడనున్న సందర్భంగా 
డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌తో నవతెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ


నవతెలంగాణ-హైదరాబాద్‌
బ్యూరో ఉత్తరప్రదేశ్‌లో 2027లో జరిగే ఎన్నికలు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మధ్యేనని సర్‌, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా పోరాడుతున్న డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ స్పష్టం చేశారు. బీజేపీలో వీరిద్దరి మధ్య తీవ్రమైన ఆధిపత్య అంతర్యుద్ధం నడుస్తున్నదనీ, యూపీ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పూర్తి స్థాయి నిఘా ఉంచిందని బాంబు పేల్చారు. డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌...2017లో ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చిన్నారుల వరుస మరణాల ఘటనతో దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చిన పేరు. ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరతపై గొంతెత్తి సంబంధిత అధికారులను ప్రశ్నించినందుకు ఆయన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేసి, తప్పుడు కేసు మోపి జైల్లో వేశారు. దానికి తోడు అనేక రకాల వేధింపులను ఆయన ఎదుర్కొన్నారు. కానీ ఆ ఘటనతో ఆయన చిన్న పిల్లల వైద్యుడిగా కొనసాగుతూనే, హక్కుల కార్యకర్తగా కూడా మారిపోయారు. ఇప్పటికీ ఆయన యోగీ సర్కార్‌పై న్యాయపోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. యూపీ ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) సహా ఆయనపై పెట్టిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు క్లీన్‌చిట్‌ ఇచ్చినా, యోగీ సర్కార్‌కు ఆయన భయం వెంటాడుతూనే ఉంది. యూపీ వదిలేసి రాజస్థాన్‌కు వెళ్లిపోయిన ఆయనపై యోగీ సర్కార్‌ 'హిస్టరీ షీట్‌' తెరిచి, ఇంకా భయభ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నించింది. డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ 'ది హిస్టరీ షీటర్‌' పేరుతో పుస్తకాన్ని రాసి, తన అనుభవాలను ప్రజల ముందుకు తెచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్న డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ను 'నవతెలంగాణ' పలుకరించింది. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఆయన నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అవే విషయాలు మీకోసం...


ఇటీవల జరిగిన జెన్‌ జీ ఉద్యమం వల్ల ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు, విధానాలపై తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసేంత ధైర్యం ప్రజల్లో వచ్చిందని మీరు భావిస్తున్నారా?
లేదు...కానీ ఇదో చారిత్రాత్మక ఘట్టం. నా జీవితంలో ఇలాంటి ఉద్యమాన్ని ఎప్పుడూ చూడలేదు. 1990ల్లో అయోధ్య ఉద్యమాన్ని చూశాను. రిజర్వేషన్ల అంశంపై మండల్‌ కమిషన్‌ అనంతర పరిణామాలను చూశాను. సీఏఏ, ఎన్‌ఆర్సీ ఉద్యమాలు, ఢిల్లీలో రైతాంగ నిరసనలను చూశాను. కానీ జంతర్‌మంతర్‌లో జరిగిన ఉద్యమం లాంటిది నేను చూడలేదు. ఈ ఉద్యమంలో పాల్గన్నవారంతా 16 నుంచి 36 ఏండ్ల మధ్య వయస్కులే. భారతదేశంలో ఏం జరుగుతోందో వారికి బాగా అర్థమైంది. బ్యూరోక్రసీ, న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో వారికి సంపూర్ణ అవగాహన ఉంది. యువతరం తాము కోరుతున్న హక్కుల కోసం, ముఖ్యంగా 'నీట్‌' సహా ఇతర పరీక్షల విషయంలో, ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్న ఉద్యమంగా ఇది నాకు కనిపించింది. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వాలు ప్రకటించిన సంక్షేమ పథకాలు ఆ ఉద్యమ ఫలితమే. చివరకు సంక్షేమ పథకాలను ఈసడించే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఆ రాష్ట్రంలో పలు పథకాలను ప్రకటించారు.


బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌పరివార్‌ వంటి శక్తులు అదో పాలపొంగు అని కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నాయి కదా?
అది ఓటమిని ఒప్పుకోలేని గడుసుతనం. జెన్‌ జీ ఉద్యమ స్ఫూర్తి జంతర్‌మంతర్‌కు పరిమితం కాలేదు. దావానలంలా ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. ముంబై, పాట్నా, కోల్‌కతా, లక్నో వంటి నగరాల్లో దాని ప్రభావం కనిపించింది. జులై 20 తర్వాత పోలీసుల దౌర్జన్య ఘటనల నేపథ్యంలో ఉద్యమం మరింత విస్తరించింది. ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం ప్రారంభిం చారు.అందుకే ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీనిలో దేశంలోని యువతరం పెద్ద సంఖ్యలో భాగస్వామ్యమై ఉంది.


జెన్‌జీ ఉద్యమం మోడీ, యోగి ప్రభుత్వాల్లో 
ఏమైనా మార్పు తీసుకువచ్చిందా?
కచ్చితంగా తెచ్చింది. దాదాపు 13 ఏండ్ల తర్వాత మొదటిసారిగా ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. గతంలో చాలా తీవ్రమైన ఘటనలు జరిగినా, పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించినా మంత్రులు రాజీనామాలు చేయలేదు. ఢిల్లీ రైతుల ఉద్యమం దాదాపు 14 నెలల పాటు సరిహద్దుల్లో తీవ్రమైన చలిలో, ఎండలో జరిగింది. అనేక మంది రైతులు మరణించారు. చివరకు 2024 ఎన్నికలకు ముందు ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని నుంచి వెనక్కి తగ్గదనే పరిస్థితిలో క్రమేణా మార్పు కనిపిస్తుంది. ఇటీవల ఈపీఎఫ్‌ పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. ఇది దాదాపు 14 ఏండ్లుగా ఉన్న డిమాండ్‌. కాబట్టి ప్రభుత్వం ప్రజల డిమాండ్లను ఇప్పుడు వింటోంది.


ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి?
జెన్‌జీ ఉద్యమ ప్రభావం కేవలం బీజేపీపైనే కాదు... ప్రతిపక్ష పార్టీలపైనా పడింది. జంతర్‌ మంతర్‌ ఉద్యమానికి ముందు, తర్వాత సమాజ్‌వాదీ పార్టీ వ్యవహరించే తీరులో మార్పు కనిపించింది. కాంగ్రెస్‌ కూడా ఇప్పుడు ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తోంది. రాహుల్‌ గాంధీ ప్రజల మధ్యకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం పౌర హక్కుల పరిస్థితి ఎలా ఉంది?
పరిస్థితులు మారడానికి కొంత సమయం పడుతుంది. న్యాయవ్యవస్థ ప్రస్తుతం అంత క్రియాశీలకంగా లేకపోయినా కొన్ని సానుకూల ఆదేశాలు ఇస్తున్నది. పరిపాలనా వ్యవస్థలో కూడా కొంతమంది రిటైర్డ్‌ బ్యూరోక్రాట్లు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మార్పు ఒక్కరోజులో రాదు. ప్రజలు తమ హక్కుల గురించి మాట్లాడటం ప్రారంభించారు. జంతర్‌ మంతర్‌ ఉద్యమం ఆ అవగాహనకు ఒక ముఖ్యమైన వేదికగా మారిందని నేను భావిస్తున్నాను.


యోగి ప్రభుత్వం మీతోపాటు మీ కుటుంబాన్ని కూడా వేధిస్తున్నట్టు కనిపిస్తుంది. 
దీనికి కారణం ఏంటి?
నేను నా పుస్తకంలో యోగి ప్రభుత్వం నన్ను వ్యక్తిగతంగా వేధిస్తున్నదని ఎక్కడా చెప్పలేదు. కానీ వేరే మతానికి చెందిన వ్యక్తిని లక్ష్యంగా వేధించడం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవచ్చని ఆయన భావిస్తు న్నారని నా అభిప్రాయం.


అదెలా ?
విషయం డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ అనే వ్యక్తి గురించి కాదు. వీధి వ్యాపారులు, పేద కుటుంబాలు, తక్కువ కులాలకు చెందినవారిపై మాత్రమే కాదు. టై వేసుకుని ఇంగ్లీష్‌ మాట్లాడే ఒక డాక్టర్‌పైనా తాను చర్య తీసుకోగలననే సందేశాన్ని తన అనుచరులకు చూపించాలనే ప్రయత్నంగానే నేను దీన్ని చూస్తాను. సీఎం యోగి ఆదిత్యానాథ్‌, నేనూ ఒకే నగరానికి చెందినవాళ్లం. ఆయనకు మా తాతగారు కూడా తెలుసు. నేను దీనిని వ్యక్తిగత కక్షగా చూడను.


భారత్‌లో హిందువులు, ముస్లింలకు ఒకే డీఎన్‌ఏ ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఇద్దరికీ సమాన హక్కులు లభిస్తున్నాయా?
మతం మనకు ఆశను, శాంతిని ఇవ్వాలని నేను నమ్ముతాను. మోహన్‌ భగవత్‌ చెప్పేదానికి, ఆచరణలో జరుగుతున్నదానికి చాలా తేడా ఉంది. మూకదాడులు అనేవి అనుకోకుండా జరిగే ఘటనలు కావు. అవి పకడ్బందీ హత్యలు, నేరాలు. ఆయా విషయాల్లో కొందరికి శిక్షణ ఇచ్చి, బ్రెయిన్‌వాష్‌ చేస్తారని నా అభిప్రాయం. ఒక వ్యక్తిని కొట్టి చంపే ఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెడుతున్నారు అంటే, తమను 'పెద్దలు' కాపాడతారనే నమ్మకం ఉండటం వల్లే అని భావిస్తున్నా.


యోగి ప్రభుత్వం మిమ్మల్ని సర్వీసు నుంచి తొలగించింది. ప్రస్తుతం మీ కేసు పరిస్థితి ఏంటి?
నా సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే ఇచ్చింది. నన్ను రెండుసార్లు సస్పెండ్‌ చేశారు. ఒకసారి సస్పెండ్‌ చేసిన వ్యక్తిని మళ్లీ ఎలా సస్పెండ్‌ చేస్తారో నా లాయర్లకు కూడా అర్థం కాలేదు. ఆ తర్వాత నవంబర్‌ 9న నన్ను టెర్మినేట్‌ చేశారు. ఆ సమయంలో నేను జూనియర్‌ డాక్టర్‌ని. ఆ రోజు సెలవులో ఉన్నప్పటికీ, ఆస్పత్రికి వచ్చి పిల్లలను కాపాడేందుకు ప్రయత్నించానని ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సైతం అంగీకరించారు. అయినప్పటికీ చివరికి నన్ను టెర్మినేట్‌ చేశారు. ఆ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేశా. ఐదేండ్లుగా (2021) ఈ కేసు వాయిదాలు పడుతూనే ఉంది. ఇప్పటికీ తుది ఫలితం రాలేదు.


మీరు దేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రాంతాలను బట్టి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై మీ పరిశీలనలు ఏమిటి? మీరు ఇప్పటికీ వైద్య శిబిరాలను కొనసాగిస్తున్నారా?
ఆరోగ్యం, విద్య మన సమాజంలో అత్యంత ముఖ్యమైన అంశాలు. కానీ ఇవే అత్యంత నిర్లక్ష్యానికి గురైన రంగాలు.ఇది కేవలం మోడీ ప్రభుత్వానికి మాత్రమే సంబంధించిన విషయం అని నేను చెప్పను. గత ప్రభుత్వాలు కూడా విద్య, ఆరోగ్య రంగాలను నిర్లక్ష్యం చేశాయి. కేవలం మోడీని నిందిస్తే నేను పాక్షిక సత్యం చెప్పినట్టవుతుంది. దాదాపు 80 ఏండ్లుగా ఈ రెండు రంగాలు తగిన ప్రాధాన్యం పొందలేదని నేను భావిస్తున్నాను. ప్రజలకు ఏదైనా చేయాలనే తపన ఉన్న వైద్యుల బృందం తోడ్పాటు మాకుంది. మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ వైద్య శిబిరాలు నిర్వహిస్తూనే ఉన్నాం. 2018 నుంచి దాదా పు 350కి పైగా హెల్త్‌ క్యాంపులు నిర్వహించాం.


దేశంలో చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు సూచిస్తారు?
ప్రభుత్వాలు ఆరోగ్యంపై బడ్జెట్‌ కేటాయింపుల్లో ఖర్చు పెంచాలి. 2006లో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆరోగ్యంపై మన ఖర్చు జీడీపీలో సుమారు ఒక శాతమే ఉండేది. ఇతర దేశాలు 6 నుంచి 8 శాతం వరకు ఖర్చు చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాల ప్రకారం 1 : 1000 నిష్పత్తిలో వైద్యులు ఉండాలి. కానీ ఉత్తర భారతంలోని జార్ఖండ్‌లో 8వేల మంది ప్రజలకు ఒకే డాక్టర్‌ ఉన్నారు. వైద్య సేవలు సంపూర్ణంగా అందుబాటులో లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న పిల్లల ఆరోగ్యాలు మరింత ఆందోళనకరంగా ఉంటున్నాయి.


జెన్‌ జీ 'స్కూల్‌ ఠీక్‌ కరో' అంటోంది. 
దీన్నెలా చూడాలి
చదువు ఒక ఆయుధం. అది అందరి చేతుల్లో ఉండాలి. 'స్కూల్‌ ఠీక్‌ కరో' ఉద్యమాన్ని నేను చాలా ముఖ్యమైనదిగా భావిస్తాను. విద్యార్థులు గుడికి, మసీదుకు లేదా గురుద్వారాకు వెళ్లడం లేదు. వారు పాఠశాలలకు వెళ్తున్నారు. అక్కడ కనీస సౌకర్యాలు కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలదే. పాలకులకు దాన్ని గుర్తుచేసేందుకే ఈ ఉద్యమం పుట్టుకొచ్చింది. విద్యద్వారానే సమాజ మార్పు సాధ్యం. దానికి నా జీవితం కూడా ఓ ఉదాహరణ. ప్రభుత్వాలు కక్షకట్టి కేసులు పెడితే ఎంతోమంది జైళ్లకు వెళ్లి అక్కడే ఏండ్లుగా మగ్గుతున్నారు. కానీ నేను హైకోర్టుకు వెళ్లగలిగాను. సుప్రీంకోర్టులో పోరాడేందుకు ఒక న్యాయ బఅందాన్ని ఏర్పాటు చేయగలిగాను. దానికి నాకు లభించిన విద్యే కారణం.


యోగి ప్రభుత్వం ముస్లింల పట్ల తీవ్ర పక్షపాతంతో వ్యవహరిస్తోందనేది వాస్తవమేనా? అందుకు కొన్ని ఉదాహరణలు చెప్పగలరా?
నా విషయాన్నే నేను ఒక ఉదాహరణగా చూస్తాను. నాపై ఎన్‌ఎస్‌ఏ ప్రయోగించినప్పుడు అది చట్టపరంగా నిలబడదని హైకోర్టు స్పష్టం చేసింది. 2019లో అలీగఢ్‌ ముస్లిం నివర్సిటీలో నేను చేసిన ప్రసంగం ఆధారంగా నన్ను ఎన్‌ఎస్‌ఏ కింద నిర్బంధించారు. 2020లో అలహాబాద్‌ హైకోర్టు ఆ నిర్భందాన్ని రద్దు చేసింది. నా ప్రసంగంలో ఏ వర్గంపైనా ద్వేషాన్ని లేదా హింసను ప్రోత్సహించే ప్రయత్నం కనిపించలేదని కోర్టు స్పష్టంగా చెప్పింది. కాబట్టి నా అనుభవం ఆధారంగా నేను చెప్పేది ఏంటంటే... ప్రభుత్వ చర్యలు ఒక వ్యక్తి గుర్తింపుతో ముడిపడినప్పుడు వాటిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది.


యోగి ప్రభుత్వ హయాంలో దళితులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శలు ఉన్నాయి. హత్రాస్‌, ఉన్నావ్‌ ఘటనలు దళితుల పట్ల ప్రభుత్వ వైఖరికి ఉదాహరణలుగా పేర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో దళితుల పరిస్థితిపై మీ పరిశీలనలు ఏమిటి?
సమాజంలో అణగారిన వర్గాల హక్కుల విషయంలో ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. నా దఅష్టిలో ఇది కేవలం ఒక కులం లేదా ఒక మతానికి సంబంధించిన సమస్య కాదు. పేదలు, అణగారిన వర్గాలు, సామాజికంగా వెనుకబడిన ప్రజలు తమ హక్కుల కోసం మాట్లాడగలిగే పరిస్థితి ఉండాలి. విద్య, ఆరోగ్యం, న్యాయం అందరికీ సమానంగా అందు బాటులో ఉండాలి. యూపీలో ముస్లింలకంటే దళితు లు, మహిళలపైనే రాజ్యహింస అధికంగా ఉంది.


2027లో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దాన్ని మీరెలా చూస్తారు?
ఈ ఎన్నికలు కేవలం బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్‌ లేదా సమాజ్‌వాదీ పార్టీ పోటీగా నేను చూడను. రానున్న ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రం మధ్య సంబంధం కూడా ముఖ్యమైన అంశంగా ఉంటుంది. బీజేపీలో మోడీ ప్రభావం తగ్గుతున్న కొద్దీ అమిత్‌ షా తన పాత్రను పెంచుకోవాలను కుంటున్నారు. ఒక స్థానం కోరుకుంటున్నారు. కానీ ఆ స్థానం కోసం వరుసలో మరొకరు ఉన్నారు. అందువల్ల 2027 ఎన్నికలు బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్‌ లేదా సమాజ్‌వాదీ పార్టీ కంటే అమిత్‌ షా వర్సెస్‌ యోగి మధ్య జరగనున్న ఆధిపత్య పోరుగానే చూస్తాను. ఇప్పటికే పీ ప్రభుత్వ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి కేంద్రం పలువురు అధికారులను పంపింది. దినేష్‌ శర్మతో పాటు మరికొందరు వచ్చారు. అయితే వారికి యోగి పెద్దగా ప్రాధాన్యత లేని శాఖలు ఇచ్చారని నేను భావిస్తున్నాను. అదే సమయంలో గత పదేండ్లలో యోగి తన ప్రతిష్టను పెంచుకున్నారన్న విషయాన్ని అంగీకరించాలి. కేవలం ఉత్తరప్రదేశ్‌లోనే కాదు. హిందుత్వానికి ఒక ప్రతీకగా ఆయన దేశవ్యాప్తంగా ఎదిగా రు. యూపీ ఎన్నికల తర్వాత కేంద్రంలో మోడీ స్థానాన్ని భర్తీ చేసే మరో నాయకత్వం బలపడుతుందని భావిస్తున్నా.


డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌ పిల్లల వైద్యుడే కాదు. మంచి రచయిత. పోరాట జీవి కూడా. గోరఖ్‌పూర్‌ జైలు అనుభవాలతోపాటు, వైద్యరంగంపై పలు పుస్తకాలు రాశారు. ఆయన రాసిన పుస్తకాలు పలు భాషల్లోకి అనువాదమయ్యాయి. తనపై మోపిన ఎన్‌ఎస్‌ఏ కేసు, మధుర జైల్లో నిర్భంధంపై తాను రాసిన 'హిస్టరీ షీటర్‌' త్వరలో తెలుగులో వెలువడనుంది. ఎస్‌ వినయకుమార్‌ చేసిన ఆ అనువాదాన్ని నవతెలంగాణ బుకహేౌస్‌ ప్రచురించనుంది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, సర్‌ వ్యతిరేకపోరాటాల్లో డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌ చురుగ్గా పాల్గొన్నారు. అందుకే ఆయనపై మోడీ, యోగి ప్రభుత్వాలు కక్షగట్టాయి.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్