Magazines

ఉరకలేస్తున్న గోదావరి

1 గంట క్రితం

The surging Godavari
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 2 నిమిషాల చదవడం

మొదటి ప్రమాద హెచ్చరిక

43 అడుగులకు చేరిన వరద..43.10 అడుగుల వద్ద నిలకడ

గంటల వ్యవధిలోనే భారీగా పెరుగుదల

​ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో తగ్గుముఖం పట్టే అవకాశం


నవతెలంగాణ–భద్రాచలం
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగి ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులకు చేరుకుంది. అనంతరం స్వల్పంగా పెరిగిన నీటిమట్టం సాయంత్రం 6 గంటలకు 43.10 అడుగులకు చేరుకుని నిలకడగా ఉంది. దీంతో భద్రాచలం సబ్‌కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ట మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. శనివారం అర్ధరాత్రి 12 గంటలకు 35.80 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం ఆదివారం తెల్లవారుజాము నుంచి వేగంగా పెరిగింది. ఉదయం 4 గంటలకు 38.70 అడుగులు, 7 గంటలకు 40.40 అడుగులకు చేరింది. అనంతరం ఉదయం 11 గంటలకు 41.50 అడుగులు, సాయంత్రం 4 గంటలకు 42.90 అడుగులకు చేరుకుంది. చివరకు 5.30 గంటలకు 43 అడుగుల మార్కును తాకడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

ఆ తర్వాత 6 గంటలకు 43.10 అడుగుల వద్ద నీటిమట్టం నిలకడగా కొనసాగింది.కొద్ది గంటల వ్యవధిలోనే గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరగడంతో భద్రాచలం పరిసర ప్రాంతాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం చేరడంతో నీటిమట్టం వేగంగా పెరిగినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పెరుగుదల నిలిచినప్పటికీ పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నారు. కాగా, ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం తగ్గుముఖం పట్టడంతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు లేకపోవడంతో గోదావరి వరద ఉధృతి రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నీటిమట్టం పూర్తిగా తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటిమట్టం చేరడంతో లోతట్టు ప్రాంతాల పరిస్థితిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వరద ప్రవాహంలో మార్పులను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ అవసరమైన చర్యలు చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్