Magazines

జేసన్‌ను చూస్తుంటే 90వ దశకంలోని విజయ్ గుర్తుకువస్తున్నాడు : చిరంజీవి

2 గంటల క్రితం

Chiranjeevi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : సందీప్ కిషన్ కథానాయకుడిగా, దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిగ్మా’ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర బృందానికి తన ఆశీస్సులు అందించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.




ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, “‘కాకా’ సినిమా షూటింగ్ నుంచి నేరుగా ఇక్కడికే వచ్చాను. యువ ప్రతిభను ప్రోత్సహించడం నా బాధ్యతగా భావిస్తాను. సందీప్ కిషన్ నాకు కుటుంబ సభ్యుడి వంటి వాడు. ‘ప్రస్థానం’ నుంచి నేటి వరకు విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అతడిని చూస్తుంటే నా కెరీర్ తొలి రోజులు గుర్తుకువస్తున్నాయి” అని పేర్కొన్నారు.

దర్శకుడు జేసన్ సంజయ్‌పై చిరు ప్రశంసల వర్షం కురిపించారు. “జేసన్ తాతగారు ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వంలో నేను ‘చట్టానికి కళ్లులేవు’, ‘దేవాంతకుడు’ వంటి సూపర్ హిట్ చిత్రాలు చేశాను. ఇప్పుడు ఆయన మనవడితో వేదిక పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. జేసన్‌ను చూస్తుంటే 90వ దశకంలోని విజయ్ గుర్తుకువస్తున్నాడు. తన తండ్రిలాగే జేసన్ కూడా వృత్తిలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడని ఆకాంక్షిస్తున్నాను” అని చిరంజీవి అన్నారు.

‘సిగ్మా’ టైటిల్ గురించి ప్రస్తావిస్తూ “గూగుల్ చేస్తే ఎవరి మాటా వినని వాడు అని అర్థం వచ్చింది. ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా ఫస్ట్ కాపీ నాకే చూపించాలి” అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లాతో సరదాగా సంభాషించిన చిరంజీవి, సంగీత దర్శకుడు థమన్‌ను “రాముడికి హనుమంతుడి వంటి వాడు” అని కొనియాడారు. “‘కాకా’ రీ-రికార్డింగ్ పనులు అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ సంక్రాంతి పక్కా మనదే” అంటూ తన చిత్రంపై ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్