Magazines

ఫ్రాన్స్‌లో విద్యార్థుల ఆందోళనలు ఉధృతం

11 గంటల క్రితం

france
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఫ్రాన్స్‌లో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని, పాఠశాల భవనాల దుస్థితిని వెంటనే బాగుచేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 400కు పైగా పాఠశాలలు మూతపడ్డాయి. నిరసనలకు దిగిన దాదాపు 2,000 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఫ్రాన్స్‌లో ప్రారంభమైన ఈ సెగ పొరుగున ఉన్న బెల్జియంకు కూడా పాకింది.


ఇటీవల ఈ ఆందోళనలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. మార్సెయ్ నగరంలోని ఒక పాఠశాలలో పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నించగా, మరో రెండు పాఠశాలలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. పలు ప్రాంతాల్లో దొమ్మీ నిరోధక (అల్లర్ల నివారణ) పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రక్షోభం వెనుక తీవ్ర వామపక్ష పార్టీల ప్రమేయం ఉందంటూ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను కార్యాలయం ఆరోపించింది. అయితే విద్యార్థి నాయకులు ఈ ఆరోపణలను ఖండించారు. ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత విద్యా రంగానికే ఇవ్వాలని వారు స్పష్టం చేశారు.


బెల్జియంకు పాకిన సెగ :

ఫ్రాన్స్ నిరసనల ప్రభావం బెల్జియంపై కూడా పడింది. లియేజ్ నగరంలో విద్యార్థులు అవే డిమాండ్లతో ఆందోళన బాట పట్టడంతో శుక్రవారం అక్కడ అన్ని పాఠశాలలను మూసివేశారు. బెల్జియంలోని వలోనియా ప్రాంతంతో పాటు రాజధాని బ్రస్సెల్స్‌లో అత్యధికులు ఫ్రెంచ్ భాషే మాట్లాడతారు. ఇటీవల ఇక్కడ కూడా విద్యా బడ్జెట్‌లో కోతలు విధించడమే ఈ అసంతృప్తికి ప్రధాన కారణం. ప్రస్తుతం రెండు దేశాల్లోనూ పాఠశాల విద్యార్థులకు మద్దతుగా విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా రోడ్లపైకి వచ్చారు.


ఆందోళనలకు కారణాలు :

ఫ్రెంచ్ ప్రభుత్వం ఇటీవల 54 బిలియన్ యూరోల మేర ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోవడానికి తీవ్రమైన పొదుపు చర్యలను ప్రకటించింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు, అగ్నిమాపక సిబ్బంది సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. దీంతో విద్యా రంగంలో తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి.

ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని ప్రతి తరగతిలో 32 నుండి 35 మంది విద్యార్థులు ఉన్నారు. దానికితోడు ప్రత్యేక ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఇప్పుడు సిబ్బందిని మరింత తగ్గిస్తే తమ భవిష్యత్తు నాశనమవుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పాఠశాలల్లో విశాలమైన క్యాంటీన్లు లేకపోవడం, వేసవిలో ఏసీలు, చలికాలంలో హీటర్లు పనిచేయకపోవడం, భవనాల మరమ్మతులు చేపట్టకపోవడం, తగినంత శౌచాలయాల సౌకర్యం లేకపోవడం వంటి సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాపించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్