Magazines

సాంకేతికతలో అమెరికాకు సవాలు విసురుతున్నచైనా

53 నిమిషాల క్రితం

America in technology
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 3 నిమిషాల చదవడం

భారీ ఏఐ విప్లవం దిశగా బీజింగ్‌
ఉలాంకాబ్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద డేటా సెంటర్‌ నిర్మాణం

ఉలాంకాబ్‌ (ఇన్నర్‌ మంగోలియా):

ఉత్తర చైనాలోని ఇన్నర్‌ మంగో లియా ప్రాంతంలో ఉన్న ఉలాంకాబ్‌ నగరం రాజధానిబీజింగ్‌కు కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ వాతావరణం చల్లగా ఉండడం, భూమి చౌకగా లభించడం, సౌర విద్యుత్‌ సమృద్ధిగా అందుబాటులో ఉండడంతో చైనా దీనిని ఓ పెద్ద డేటా సెంటర్‌గా మార్చేసింది.

ఇక్కడ ప్రపంచంలోనే అతి పెద్ద డేటా సెంటర్‌ను చైనా నిర్మించింది. ఆపిల్‌, హార్డ్‌వేర్‌ దిగ్గజం హువావే, అలీబాబా, సోషల్‌ మీడియా వేదిక క్వాయిషౌ, సర్వీస్‌ ప్రొవైడర్‌ వీనెట్‌ వంటి ప్రముఖ కంపెనీలు ఇక్కడ తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేశాయి. విశాలమైన గడ్డి భూములు, అందమైన సరస్సులకు కూడా ఈ ప్రాంతం నెలవు కావడంతో ఇది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. చూడడానికి ఈ ప్రదేశం ఓ అందమైన సాంకేతిక మాయాజాలంగా కన్పిస్తుంది. విశాలమైన మైదానాలు, పొద్దుతిరుగుడు-జన్న పొలాల మధ్య నిర్మాణంలో ఉన్న భారీ డేటా సెంటర్లను చూస్తుంటే అవి అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఊడి పడినట్లు కన్పిస్తాయి.

టెక్నాలజీ రేసులో ముందంజ

చైనాలో భారీ ఏఐ విప్లవానికి దారి చూపుతున్న డేటా హబ్‌లలో ఉలాంకాబ్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏఐ రంగంలో ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటున్న అమెరికా దూకుడుకు బ్రేక్‌ వేస్తున్న ఏకైక పోటీదారుగా చైనాను నిలుపుతున్నది ఈ కేంద్రమే. ఈ నగర జనాభా ఇరవై లక్షల కంటే తక్కువే అయినా ఇక్కడ సుమారు 90 డేటా సెంటర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ చెబుతున్న దాని ప్రకారం గత సంవత్సరం నాటికి చైనా కంటే అమెరికాలో సుమారు పది రెట్లు ఎక్కువగా ఏఐ డేటా సెంటర్లు ఉన్నాయి. అమెరికాలో కంప్యూటంగ్‌ సామర్ధ్యం కూడా ఎక్కువే. చైనా సంస్థల వద్ద లేని అత్యంత అధునాతన చిప్‌లు అమెరికా కంపెనీల వద్ద ఉన్నాయి. ఏఐ అభివృద్ధిలో ఇవే అత్యంత కీలకం. అయితే ఉలాంకాబ్‌లో ఏఐ, అతి పెద్ద డేటా కేంద్రాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో 21వ శతాబ్దాన్ని నిర్దేశించగల సాంకేతికత రేసులో చైనా వైపు మొగ్గు కన్పిస్తోంది.

ప్రజల నుంచి సానుకూలత

ఈ నగరంలో ఉన్న ఎత్తయిన డేటా యూనిట్లు అత్యంత వేగంగా నిర్మిత మయ్యాయి. జనసాంద్రత అధికంగా ఉన్న బాయిన్‌ బేగ్‌ పారిశ్రామిక పార్కులో అధిక భాగాన్ని కేవలం రెండు సంవత్సరాలలోనే నిర్మించారు. ఇది చైనా నిర్మాణ సామర్ధ్యా నికి నిదర్శనం. అమెరికాలో భారీ డేటా సెంటర్ల నిర్మాణానికి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండగా చైనాలో ఆ వాతావరణం మచ్చుకైనా కన్పించదు. నిర్మాణ పనులు స్థానికులను పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదు. వ్యవసాయంపై ఆధారపడిన ఈ ప్రాంతం ఇప్పుడు వలస నిర్మాణ కార్మికులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో వ్యాపారాలు కూడా జోరుగా సాగుతున్నాయి. అతిథి గృహాలు కళకళలాడుతున్నాయి. ప్రజల ఆదాయాలు పెరిగాయని, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నదని వ్యాపారులు తెలిపారు.
ప్రత్యేకతలు ఇవే
చైనా వద్ద పారిశ్రామిక విద్యుత్‌ వనరులకు కొదువ లేదు. అవసరమైన దాని కంటే ఎక్కువ హరిత విద్యుత్‌ ఆ దేశం వద్ద ఉంది. చైనా పశ్చిమ, గ్రామీణ ప్రాంతాలలో సూర్యరశ్మి, గాలి, భూమి సమృద్ధిగా లభిస్తున్నాయి. వాటిని వినియోగించుకోవాల్సిందిగా చైనా ప్రభుత్వం డేటా సెంటర్లను కోరుతోంది. తక్కువ శక్తివంతమైన దేశీయ చిప్‌ల కారణంగా ఎదురవుతున్న లోటును అందుబాటులో ఉన్న మిగులు విద్యుత్‌తో భర్తీ చేసుకోవచ్చు. ఉలాంకాబ్‌ సెంటర్ల నుంచి రాజధానికి కనురెప్పపాటులో డేటాను ప్రసారం చేయగల కేబుల్స్‌ నిర్మాణం జరిగింది. అగ్రశ్రేణి సంస్థలు అక్కడ భారీగా వనరులను వెచ్చిస్తు న్నాయి. ఉలాంకాబ్‌లోని గ్రిడ్‌ దాదాపు సగం విద్యుత్‌ను పవన, సౌరశక్తి నుంచే పొందుతోంది. డేటా సెంటర్లకు అవసర మైన నీటి వనరులకు ఇక్కడ కొదువ ఏమీ లేదు. ఉలాంకాబ్‌లోని చల్లని వాతా వరణం శీతలీకరణ అవసరాన్ని చాలా వరకూ తగ్గిస్తుంది.
అవసరానికి మించి విద్యుత్‌ లభ్యత
అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటికే చైనాలో 70 కోట్ల మందికి పైగా ఏఐని ఉపయోగిస్తున్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో కంప్యూటింగ్‌ సౌకర్యాలతో సహా సమాచార మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించడానికి ప్రభుత్వం 56 కోట్ల డాలర్ల ప్రణాళికను ప్రకటించింది. ప్రైవేటు టెక్‌ కంపెనీలు కూడా ఏఐ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను పెంచు తున్నాయి. లిస్టెడ్‌ చైనా కంపెనీలు పెట్టే పెట్టుబడులు ఈ సంవత్సరం రెట్టింపై సుమారు 139 బిలియన్‌ డాలర్లకు చేరు కోవచ్చు. చిప్స్‌, పెట్టుబడుల లభ్యత విషయంలో చైనా సమస్యలను ఎదుర్కొం టోంది. అయితే పుష్కలంగా..అది కూడా చౌకగా లభించే విద్యుత్‌తో ఆ లోటును భర్తీ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. పైగా చైనాలో లభించే విద్యుత్‌ పర్యావరణ హతమైనది.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్