Magazines

ఉక్రెయిన్‌లో భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా దాడి..

11 గంటల క్రితం

attack on Indian pharma company in Ukraine
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్న వేళ, ఉక్రెయిన్‌లోని భారతీయ ఫార్మా కంపెనీపై భీకర దాడి జరిగింది. రష్యా ప్రయోగించిన డ్రోన్లు సుమీ నగరంలోని 'కుసుమ్ గ్రూప్'కు చెందిన ఫార్మా ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెంద‌గా, పలువురు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడిలో ప్లాంట్‌లోని ప్రధాన నిర్మాణం దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. డ్రోన్లు దాడి చేసిన ప్రాంతం నుంచి భారీగా పొగ కమ్ముకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ దాడి వల్ల సుమారు రూ.400 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 

విశేషమేమిటంటే.. రెండేళ్లకు పైగా యుద్ధం జరుగుతున్నప్పటికీ, ఈ ప్లాంట్ నిరంతరాయంగా ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉంది. తాజా దాడితో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.

భారతీయుడైన రాజీవ్ గుప్తా నేతృత్వంలో కుసుమ్ గ్రూప్ నడుస్తోంది. ఈ సంస్థ 1994లో భారతీయ ఔషధాలను ఉక్రెయిన్‌కు ఎగుమతి చేసే డిస్ట్రిబ్యూటర్‌గా ప్రారంభమై, ఆ తర్వాత సొంత బ్రాండ్లను మార్కెటింగ్ చేసింది. 2009లో సుమీ నగరంలో తయారీ ప్లాంట్‌ను స్థాపించింది. ఈ గ్రూప్ ఉక్రెయిన్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్ వంటి 9కి పైగా దేశాలకు 50 రకాల జనరిక్ ఔషధాలను విక్రయిస్తోంది.

గత కొంతకాలంగా రష్యా.. చవకైన, వేగవంతమైన షాహెద్ డ్రోన్లతో ఉక్రెయిన్‌పై నిరంతరం దాడులు చేస్తోంది. ఈ డ్రోన్లను అడ్డుకోవడం ఉక్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థలకు సవాలుగా మారింది. 

ఇదే సమయంలో, ఉక్రెయిన్ కూడా దేశీయంగా తయారుచేసిన 'ఎఫ్‌పీ-7' బాలిస్టిక్ క్షిపణిని ఈ వారంలో తొలిసారిగా ప్రయోగించినట్లు ప్రకటించింది. దీని పరిధి సుమారు 250 కిలోమీటర్లు కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్