ఫ్రాన్స్‌లో 70 వేల మంది పోలీసుల మోహరింపు
మూతపడిన మ్యూజియంలు
పారిస్ : ఫ్రాన్స్‌లో పెరుగుతున్న జీవనవ్యయం, ప్రభుత్వ వ్యయాల్లో కోతలు, పాఠశాలల్లో దిగజారుతున్న విద్యా ప్రమాణాలను నిరసిస్తూ విద్యార్థులు, కార్మిక సంఘాలు ఆందోళనలను తీవ్రతరం చేయడంతో శాంతి భద్రతల పరిరక్షణ పేరిట ప్రభుత్వం శనివారం 70,000 మంది పోలీసులను రంగంలోకి దింపింది. నిరసనకారులను అడ్డుకోవడానికి హెలికాప్టర్లు, సాయుధ వాహనాలు, వాటర్ క్యానన్లను సిద్ధం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు జరగకుండా అడ్డుకోవడానికి అత్యంత వేగంగా కదిలే ‘ఎలైట్ పోలీస్ యూనిట్ల’ను మోహరించింది. సామాజిక మాధ్యమాలలో హింసను ప్రేరేపించే వారిపై, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై, దోపిడీలకు పాల్పడే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. ఇప్పటికే సుమారు 2,700 మందిని అరెస్ట్ చేశామని తెలిపింది.
నిరసనల కారణంగా చారిత్రక కట్టడాలు, కళాఖండాలకు నష్టం జరగకుండా చూడడానికి, పర్యాటకుల భద్రతకు సాంస్కృతిక శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో భాగంగా రాజధాని పారిస్‌లోని ప్రముఖ మ్యూజియంలను మూసివేసింది. వీటిలో ప్రపంచ ప్రసిద్ధ లూవర్ మ్యూజియం, ఓర్సే మ్యూజియం, పికాసో మ్యూజియం, గ్రాండ్ పలైస్ మ్యూజియం ఉన్నాయి. అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘ఆర్ట్ బాసెల్ పారిస్’ ప్రదర్శనను కేవలం ఒక్క రోజుకే పరిమితం చేసి వారాంతపు కార్యక్రమాలను రద్దు చేశారు. ఒపెరా హౌస్, ఫౌండేషన్ లూయిస్ విట్టన్ వంటి సాంస్క తిక కేంద్రాలను కూడా మూసివేశారు.
గత వారం జరిగిన అల్లర్ల కారణంగా సుమారు మూడు వేల దుకాణాలు లూటీకి గురికావడంతో పారిస్, మార్సేయ్, లియాన్ వంటి ప్రధాన నగరాల్లోని వ్యాపారులు తమ షాపులకు రక్షణ కవచాలను ఏర్పాటు చేసుకున్నారు. భద్రతా కారణాల రీత్యా ఫ్రాన్స్‌లోని కొన్ని నగరాల్లో నిరసన ప్రదర్శనలపై అధికారులు నిషేధం విధించారు.







కామెంట్లు (0)