వాతావరణంలోకి విషపూరిత రసాయనాలు
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం
ప్రమాదంలో సముద్ర వన్యప్రాణుల మనుగడ
అబూదాబీ : మధ్యప్రాచ్యంలో జరిగిన యుద్ధంలో ఇరు పక్షాలు పెద్ద ఎత్తున బాంబులు, క్షిపణులను ఉపయోగించడంతో అవి వాతావరణంలోకి భారీ లోహాలను, విషపూరిత రసాయనాలను విడుదల చేశాయి. అమెరికా - ఇజ్రాయిల్ సేనలు, ఇరాన్ దళాలు ప్రధానంగా చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపాయి. ఈ దాడుల కారణంగా చెలరేగిన మంటలు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను దట్టమైన పొగతో, చమురుతో తడిసిన వర్షంతో కప్పేశాయి. ఇది లక్షలాది మంది ప్రజలను కాలుష్యానికి గురి చేసి వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. దాడుల ప్రభావం పర్షియన్ గల్ఫ్‌పై కూడా పడుతోంది. ఈ జలమార్గంలో ఓడలు, చమురు మౌలిక సదుపాయాలపై జరిగిన దాడుల కారణంగా అంతరిక్షం నుంచి సైతం కనిపించే స్థాయిలో చమురు చిందింది. ప్రపంచంలో అత్యంత సున్నితమైన, విశిష్టమైన సముద్ర వ్యవస్థల్లో ఒకటైన పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ఎదుర్కొంటున్న భారీ ప్రమాదాలకు ఇది మరో సంకేతం.
పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలక మార్గమైన హార్ముజ్ జలసంధిలో నెలల తరబడి సరకు రవాణా నౌకలను, చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి.
వీటి కారణంగా దాడి జరిగిన ప్రదేశం నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకూ ఆకాశంలో దట్టమైన పొగ మేఘాలు అలముకుంటున్నాయి. దాడుల కారణంగా పర్షియన్ గల్ఫ్‌లో చమురు కాలుష్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. నీటి ఉపరితలంపై పెద్ద ఎత్తున చమురు తెట్టెలు కన్పిస్తున్నాయి. ఈ చమురు సముద్ర వన్యప్రాణులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. పర్షియన్ గల్ఫ్ అనేక సముద్ర తాబేళ్ల జాతులకు, వందలాది చేపల జాతులకు, ప్రపంచంలోనే రెండో అతి పెద్ద డూగాంగ్ (సముద్ర ఆవులు)లకు నిలయం. తీరానికి సమీపాన ఉన్న ఇసుక ద్వీపాలు, విస్తారమైన గడ్డి పడకలు ఈ గల్ఫ్‌ను గూడు కట్టుకోవడానికి, సంతానోత్పత్తికి అనువైన ఆవాసంగా మార్చాయి. విస్తరమైన మర అడవులు, పగడపు దిబ్బల నిర్మాణాలు డాల్ఫిన్‌లు, సముద్ర పక్షులు, సొరచేపలకు రక్షిత నర్సరీలుగా ఉంటున్నాయి. ఈ జలాల్లో అత్యంత ద ఢమైన సముద్ర జీవులు మాత్రమే మనుగడ సాగించగలవు. ఎందుకంటే ఇక్కడ ఏడాది పొడవునా తీవ్రమైన ఉష్ణోగ్రత మార్పులు సంభవిస్తుంటాయి. ఏదేమైనా యుద్ధం కారణంగా పర్షియన్ గల్ఫ్‌లో పెరుగుతున్న కాలుష్యంతో ప్రజల ఆరోగ్యం పైనే కాకుండా సముద్ర వన్యప్రాణుల మనుగడ పైన కూడా ప్రభావం పడబోతోంది.







కామెంట్‌లు (0)