Magazines

ఫైనల్లో సింధు

1 గంట క్రితం

Sindhu
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 2 నిమిషాల చదవడం

సెమీస్‌‌లో జపాన్‌ షట్లర్‌‌పై గెలుపు
ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ 750


పారిస్‌ (‌ఫ్రాన్స్‌) : రెండు సార్లు ఒలింపిక్‌ ‌పతక విజేత పి.వి సింధు ఫ్రెంచ్‌ ఓపెన్‌ ‌ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం పారిస్‌‌లో జరిగిన మహిళల సింగిల్స్‌ ‌సెమీఫైనల్లో జపాన్‌ ‌షట్లర్‌ ‌హినా అకెచిపై 21-10, 20-22, 21-16తో మూడు గేముల మ్యాచ్‌‌లో సింధు గెలుపొందింది. గంట 13 నిమిషాల పాటు సాగిన సెమీఫైనల్లో పి.వి సింధు 21-10తో తొలి గేమ్‌‌ను అలవోకగా సొంతం చేసుకుంది. రెండో గేమ్‌ ‌ప్రథమార్థంలో సింధు జోరు సాగినా.. విరామం అనంతరం హినా పుంజుకుంది. 16-16 తర్వాత సింధు కాస్త తడబాటుకు గురవగా.. హినా 22-20తో కీలక రెండో గేమ్‌‌ను ఖాతాలో వేసుకుంది. దీంతో ఫైనల్‌ ‌బెర్త్‌‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌‌లో తేల్చాల్సి వచ్చింది. మూడో గేమ్‌ ఉత్కంఠగా సాగింది. సింధు, హినా పాయింట్ల పరంగా పలుమార్లు సమవుజ్జీలుగా నిలిచారు. సింధు ముందంజలో నిలిచినా.. హినా పోరాడింది. స్కోరు సమం చేసింది. 14-14 నుంచి ఓ దశలో 16-15తో ముందంజ వేసింది.

కానీ ఆ తర్వాత భారత అగ్రశ్రేణి షట్లర్‌ ఎటువంటి పొరపాటుకు అవకాశం ఇవ్వలేదు. వరుసగా ఆరు పాయింట్లను సాధించి 21-16తో మూడో గేమ్‌‌తో పాటు ఫైనల్‌ ‌బెర్త్‌‌ను సొంతం చేసుకుంది. ఈ సీజన్‌‌లో పి.వి సింధుకు ఇది రెండో సూపర్‌ 750 టోర్నమెంట్‌ ‌ఫైనల్‌. ఈ ఏడాది జులైలో జపాన్‌ ఓపెన్‌ ‌ఫైనల్‌‌కు చేరిన సింధు, టైటిల్‌ ‌సాధించింది. నేడు జరిగే మహిళల సింగిల్స్‌ ‌ఫైనల్లో వరల్డ్‌ ‌నం.1, ప్రపంచ చాంపియన్‌ అన్‌ ‌సె యంగ్‌‌తో సింధు తలపడనుంది. ఇప్పటివరకు సింధు, యంగ్‌‌లు పది సార్లు ముఖాముఖి తలపడగా భారత స్టార్‌ ‌దక్షిణ కొరియా షట్లర్‌‌పై తొలి విజయం నమోదు చేయాల్సి ఉంది. ‘యంగ్‌‌తో ఫైనల్లో నేను బాగా పోరాడాల్సి ఉంటుంది. ప్రతి పాయింట్‌ ‌కీలకమే. మేం ఇద్దరం చాలా సార్లు ఆడం, యంగ్‌ ఎంతో మంచి ప్లేయర్‌. ఆమె కెరీర్‌ ‌ఫామ్‌‌లో ఉంది. ప్రతి రోజు కొత్తగా మొదలెట్టాలి. టైటిల్‌ ‌పోరులో నా వంద శాతం ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాను. ఫలితం మ్యాచ్‌ ‌రోజే తేలుతుంది. పోరాడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఫైనల్‌ ‌మ్యాచ్‌ ‌ముందు పి.వి సింధు వ్యాఖ్యానించింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్