ప్రపంచంలో అత్యంత గొప్ప అన్వేషణ ఏది? కొత్త ఖండాలను కనిపెట్టడమా? కొత్త గ్రహాలను చేరడమా? అణువును చీల్చడమా? కాదు. మనిషి తనలోని మనిషిని కనుగొనడమే ప్రపంచంలో అత్యంత గొప్ప అన్వేషణ. ఎందుకంటే బయట ఉన్న ప్రపంచాన్ని జయించడం కంటే, మనలో దాగున్న అహంకారాన్ని జయించడం చాలా కష్టం. కొండలను అధిరోహించడం సులభం. మనలో పేరుకుపోయిన పక్షపాతాలను దిగజార్చడం కష్టం. చరిత్రను చూస్తే మనిషి ఎన్నో విజయాలు సాధించాడు. చక్రాన్ని కనిపెట్టాడు. అగ్నిని మిత్రుడిగా మార్చుకున్నాడు. నదులను అదుపులోకి తెచ్చాడు. ఆకాశాన్ని కొలిచాడు. విశ్వ రహస్యాలను ఛేదిస్తున్నాడు. కానీ ఒక ప్రశ్న మాత్రం ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తూనే ఉంది. మనిషి మనిషిని ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? ఈ ప్రశ్నకు సమాధానం దొరికిన రోజే నాగరికత తన అసలు అర్థాన్ని పొందుతుంది.
మనం ఒకరినొకరు కలిసినప్పుడు ముందుగా ముఖాన్ని చూడం. పేరు అడుగుతాం. పేరు తర్వాత కులం తెలుసుకోవాలనుకుంటాం. కులం తర్వాత మతం. మతం తర్వాత వృత్తి. వృత్తి తర్వాత ఆదాయం. చివరికి ఈ వివరాలన్నీ తెలుసుకున్నాకే ఆ మనిషిని ఎలా చూడాలో నిర్ణయించుకుంటాం. అంటే మనకు మనిషి అవసరం లేదు. అతని గుర్తింపులే అవసరం. అతని హృదయం కాదు. అతని పరిచయం కావాలి. ఇది కేవలం ఒక సామాజిక అలవాటు కాదు. ఇది మానవత్వాన్ని నెమ్మదిగా చంపుతున్న ఒక సాంస్కృతిక వ్యాధి.
ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠాలు చెబుతాడు. కానీ, అతని హృదయంలో ఒక కవి ఉండొచ్చు. ఒక రైతు పొలంలో నాగలి పట్టుకుంటాడు. కానీ, అతని ఆలోచనలు ఒక తత్వవేత్తవిగా ఉండొచ్చు. ఒక కార్మికుడు ఇటుకలు పేర్చుతాడు. కానీ, అతని కలలు ఒక శిల్పి కలల కంటే గొప్పవిగా ఉండొచ్చు. మనం వారి పనిని చూస్తాం. వారి ప్రపంచాన్ని చూడం. అందుకే ప్రతి మనిషి గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. తెలియనిది చాలా ఎక్కువ. మనిషిని అర్థం చేసుకోవడం అంటే అతని మాటలను వినడం కాదు. అతని మౌనాన్ని కూడా వినగలగడం. అతని విజయాన్ని చూడడం కాదు. అతని పోరాటాన్ని కూడా గుర్తించడం. ఈ సామర్థ్యం కోల్పోయిన సమాజం ఎంత చదువుకున్నా, ఎంత ధనవంతమైనా, ఎంత ఆధునికమైనా పూర్తిగా నాగరికం కాలేదు.
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధం తుపాకి కాదు. ముందస్తు తీర్పు. ఒక మనిషిని కలవకముందే అతని గురించి ఒక నిర్ణయానికి రావడం. అతని కథ వినకముందే అతన్ని కొలవడం. అతని బాధను అర్థం చేసుకోకముందే అతన్ని తప్పుపట్టడం. ఇవి శరీరాన్ని గాయపరచవు. కానీ మనస్సును నెమ్మదిగా విరగ్గొడతాయి. చాలామంది జీవితాల్లో కనిపించే గాయాలకు రక్తం ఉండదు. అవమానంతో ఏర్పడిన గాయాలు కనిపించవు. నిర్లక్ష్యంతో ఏర్పడిన గాయాలు ఎక్స్‌రేలో కనిపించవు. ఒంటరితనంతో ఏర్పడిన పగుళ్లు వైద్యశాస్త్రానికి కనిపించవు. కానీ, అవే జీవితాలను నిశ్శబ్దంగా ఖాళీ చేస్తుంటాయి. అందుకే మనిషికి అన్నం ఎంత అవసరమో, గౌరవం కూడా అంతే అవసరం. ఒక సమాజం తన పిల్లలకు పోటీని మాత్రమే నేర్పితే, వారు గెలవడం నేర్చుకుంటారు. విజయాన్ని మాత్రమే నేర్పితే, ఓడిపోయిన వారిని గౌరవించడం రాదు. సంపాదించడం మాత్రమే నేర్పితే, పంచుకోవడం మరచిపోతారు. విద్య అంటే కేవలం ఉద్యోగం కాదు. విద్య అంటే మనిషిని మనిషిగా గుర్తించే వివేకం.
ఒక చిన్న పిల్లవాడు మొదటిసారి పాఠశాలకు వెళ్లినప్పుడు తన పక్కన కూర్చున్న బిడ్డ ఏ కులానికి చెందినవాడో అడగడు. ఇద్దరూ కలిసి ఆడుకుంటారు. అంటే సమానత్వం మనిషి సహజ స్వభావం. అసమానత్వం నేర్పించబడిన సంస్కారం. ఇక్కడే సమాజం తన మొదటి తప్పు చేస్తుంది. పిల్లల చేతుల్లో పుస్తకాలు పెట్టేముందు, మనసుల్లో గోడలు కడుతుంది. అక్షరాలు నేర్పేముందు, విభజనలు నేర్పుతుంది. ప్రశ్నలు అడగమని చెప్పేముందు, భయపడమని చెబుతుంది. అక్కడే ఒక మనిషి క్రమంగా ముద్రగా మారడం మొదలవుతుంది. కసారి మనిషి తనను తాను ఒక ముద్రతో గుర్తించడం మొదలుపెడితే, అతని చూపు కూడా అదే ముద్రలతో ప్రపంచాన్ని కొలవడం మొదలుపెడుతుంది. అప్పుడు ఎదురుగా కనిపించేది మనిషి కాదు, గుర్తింపు మాత్రమే.
కానీ, జీవితానికి ఒక గొప్ప లక్షణం ఉంది. అది మనం కట్టిన గోడల కంటే చాలా విశాలమైనది. ఒక ప్రమాదం జరిగినప్పుడు రక్తం అందించే చేయి, రక్తం తీసుకునే మనిషి కులాన్ని అడగదు. ఆసుపత్రి అత్యవసర గదిలో మతాలకు వేర్వేరు ఆక్సిజన్ ఉండదు. ఆకలి వేసినప్పుడు అన్నం అందరికీ ఒకే రుచిగా ఉంటుంది. దాహం వేసినప్పుడు నీరు అందరికీ ఒకేలా దాహం తీర్చుతుంది. చెట్లను చూడండి. ఒకే నేలలో వేప కూడా పెరుగుతుంది, మామిడి కూడా పెరుగుతుంది, రావి కూడా పెరుగుతుంది. భూమి ఎప్పుడూ వాటిని పోల్చదు. ఆకాశం ఒక చెట్టుకు ఎక్కువ వెలుతురు, మరొక చెట్టుకు తక్కువ వెలుతురు ఇవ్వదు. ప్రకృతి భిన్నత్వాన్ని ప్రేమిస్తుంది, ఆధిపత్యాన్ని కాదు. మనిషి మాత్రం భిన్నత్వానికి భయపడ్డాడు. అందుకే భిన్నత్వాన్ని పండుగగా చూడాల్సిన చోట సమస్యగా మార్చుకున్నాడు.
నిజానికి ప్రతి మనిషి ఒక ప్రత్యేక ప్రపంచం. ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. ఇద్దరి స్వరాలు ఒకేలా ఉండవు. ఇద్దరి జీవితాలు ఒకేలా ఉండవు. మరి ఆ భిన్నత్వాన్ని ఎందుకు ఒకే కొలమానంతో కొలవాలి? ఎందుకు ఒకే మూసలో బంధించాలి? ఈ ప్రపంచంలో గొప్పవాళ్లు ఎవరంటే, ఎక్కువ మందిని పాలించినవాళ్లు కాదు, ఎక్కువ మందిని అర్థం చేసుకున్నవాళ్లు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మనుషులు అధికారంతో కాదు, అనురాగంతో నిలిచారు. వారి చేతుల్లో ఆయుధాలు ఉండకపోవచ్చు. కానీ వారి హృదయాల్లో మనిషి మీద నమ్మకం ఉండేది. అదే వారిని కాలాన్ని దాటేలా చేసింది.
నేడు మనిషి జీవితంలో ఒక కొత్త విషాదం కనిపిస్తోంది. అతడు నిరంతరం తనను తాను నిరూపించుకోవాల్సి వస్తోంది. తన విలువను చెప్పుకోవాలి. తన సామర్థ్యాన్ని రుజువు చేయాలి. తన ఉనికికి ఆధారాలు చూపాలి. ఇది ఒక మౌన హింస. ఎందుకంటే నిజమైన గౌరవం ఎప్పుడూ రుజువులతో రాదు. అది మనిషిని మనిషిగా అంగీకరించే సంస్కృతితో వస్తుంది. మనం తరచూ ‘మంచి రోజులు రావాలి’ అంటాం. కానీ, మంచి రోజులు క్యాలెండర్లో మారే తేదీలతో రావు. మన చూపు మారినప్పుడు వస్తాయి. ఒక కూలీని ‘కూలీగా కాకుండా, సమాజాన్ని నిలబెట్టే సృష్టికర్తగా చూసినప్పుడు వస్తాయి. ఒక రైతును ‘అన్నదాత’ అని పిలవడం మాత్రమే కాదు, అతని జీవితానికి గౌరవం ఇచ్చినప్పుడు వస్తాయి. ఒక మహిళను నియంత్రించాల్సిన వ్యక్తిగా కాదు, సమాన మనిషిగా అంగీకరించినప్పుడు వస్తాయి. ఒక ట్రాన్స్‌జెండర్‌ను ఆసక్తిగా చూడకుండా, ఆప్యాయంగా పలకరించినప్పుడు వస్తాయి.
మనిషి జీవితంలో అతి పెద్ద విజయం మరొకరిపై గెలవడం కాదు. తనలోని ద్వేషంపై గెలవడం. అతి పెద్ద సంపద బ్యాంకులో ఉండేది కాదు. మరొక మనిషి నిన్ను నమ్మే విశ్వాసం. అతి పెద్ద హోదా పదవి కాదు. ఎవరో ఒకరు ‘నువ్వు ఉండటం వల్ల నా జీవితం కొంచెం మెరుగైంది’ అని చెప్పగలగడం. కాలం చివరికి అన్నింటినీ నిశ్శబ్దంగా వడపోస్తుంది. పేర్లు చెరిగిపోతాయి. హోదాలు మారిపోతాయి. భవంతులు శిథిలాలవుతాయి. సంపద యజమానులను మార్చుకుంటుంది. కానీ, ఒక మనిషి మరొక మనిషికి చేసిన మంచిని కాలం చెరపలేదు. ప్రేమతో పలికిన ఒక మాట, కష్టకాలంలో అందించిన ఒక చేయి, అవమానంలో అండగా నిలిచిన ఒక భుజం.. ఇవే చరిత్ర నిజంగా గుర్తుంచుకునే స్మారకాలు.
మామిండ్ల రమేష్ రాజా, 7893230218





కామెంట్లు (0)