ఛేదనలో తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి ధనాధన్
రెండో టీ20లో కివీస్‌పై భారత్ ఘన విజయం
2-0తో టీ20 సిరీస్‌లో అయ్యర్‌సేన ముందంజ
ఈ నెల 14న హైదరాబాద్ టీ20. నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ క్రీజులో ఉండగా వెస్టిండీస్‌పై విజయానికి భారత్‌కు 19 బంతుల్లో 48 పరుగులు అవసరం. తిలక్ వర్మ నిష్క్రమణతో ఆ మ్యాచ్‌లో భారత్ ఓటమి చెందింది.
పది రోజుల తర్వాత, క్రైస్ట్‌చర్చ్ టీ20. భారత్ విజయానికి 69 పరుగులు అవసరమైన వేళ జతకట్టిన తెలుగు తేజాలు ఈసారి పట్టు వదల్లేదు. తిలక్ వర్మ (51 నాటౌట్) అజేయ అర్థ సెంచరీతో దంచికొట్టగా.. నితీశ్ కుమార్ రెడ్డి (26 నాటౌట్) ధనాధన్ జోరు చూపించాడు. తెలుగోళ్ల తడాఖాతో రెండో టీ20లో న్యూజిలాండ్‌పై భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐదు టీ20 సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది.
నవతెలంగాణ-క్రైస్ట్‌చర్చ్
క్రైస్ట్‌చర్చ్‌లో టీమ్ ఇండియా వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. 181 పరుగుల ఛేదనలో తెలుగు తేజాలు తిలక్ వర్మ (51 నాటౌట్, 26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (26 నాటౌట్, 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఏడో వికెట్‌కు అజేయంగా 30 బంతుల్లోనే 69 పరుగులు జోడించారు. దీంతో న్యూజిలాండ్‌పై భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నమన్ ధీర్ (31, 17 బంతుల్లో 1 ఫోర్,3 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (27, 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (70, 43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), బెవాన్ జాకబ్స్ (58, 46 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో రాణించారు. ఛేదనలో చెలరేగిన తిలక్ వర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. భారత్, న్యూజిలాండ్ మూడో టీ20 మంగళవారం వెల్లింగ్టన్‌లో జరుగనుంది.
ఈసారి కొట్టేశారు
హైదరాబాద్ టీ20లో భారీ ఛేదనలో ఆశలు రేపినా.. తడబాటుకు గురైన తెలుగు తేజాలు క్రైస్ట్‌చర్చ్‌లో విజయాన్ని వడిసిపట్టారు. 181 పరుగుల ఛేదనలో 112 పరుగులకే భారత్ 6 వికెట్లు కోల్పోయింది. వైభవ్ సూర్యవంశీ (4), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (7), అక్షర్ పటేల్ (11) సహా సంజు శాంసన్ (14 ) నిరాశపరిచారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (27) ఒక్కడే టాప్-5లో ఫర్వాలేదనపించాడు. 70/5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న టీమ్ ఇండియాను తిలక్ వర్మ, నమన్ ధీర్ (31) ఆదుకుంది. ఆరో వికెట్‌కు 25 బంతుల్లో 42 పరుగులు జోడించి భారత్‌ను ట్రాక్‌లోకి తీసుకొచ్చింది. కానీ నమన్ ధీర్ నిష్ర్కమణతో కథ మళ్లీ మొదటికొచ్చింది. 112/6తో టీమ్ ఇండియా ఒత్తిడిలో పడిన వేళ తిలక్ వర్మతో జతకట్టిన నితీశ్ కుమార్ రెడ్డి (26 నాటౌట్) అదరగొట్టాడు. తిలక్ వర్మ ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా.. నితీశ్ కుమార్ రెడ్డి ఓ ఫోర్, సిక్సర్‌తో మెరిశాడు. ఈ ఇద్దరూ ఆఖరు వరకు క్రీజులో నిలిచి భారత్‌ను విజయ తీరాలకు చేర్చారు. ఏడో వికెట్‌కు అజేయంగా 30 బంతుల్లోనే 69 పరుగులు జోడించి మరో బంతి ఉండగానే విజయాన్ని అందించారు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (4/21) నాలుగు వికెట్లతో మాయాజాలం చేశాడు. అయినా, తెలుగోళ్లు తిలక్, నితీశ్ దంచికొట్టారు. మిడిల్ ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 82 పరుగులే చేసిన భారత్.. డెత్ ఓవర్లలో నితీశ్, తిలక్ దెబ్బకు వికెట్ నష్టపోకుండా 55 పరుగులు పిండుకుంది.
మళ్లీ అతడే బాదాడు
టాస్ ఓడిన న్యూజిలాండ్ మరోసారి తొలుత బ్యాట్ పట్టింది. టాప్ ఆర్డర్‌ను భారత పేసర్లు కకావికలం చేశారు. టిమ్ సీఫర్ట్ (7), డార్లీ మిచెల్ (6), ఫిన్ అలెన్ (16) తేలిపోయారు. ఈ తరుణంలో గ్లెన్ ఫిలిప్స్ (70), బెవాన్ జాకబ్స్ (58) నిలబడ్డారు. 41/3తో కష్టాల్లో కూరుకున్న కివీస్‌ను ఈ జోడీ ఆదుకుంది. ఫిలిప్స్ సిరీస్‌లో వరుసగా రెండో అర్థ సెంచరీ బాదగా.. బెవాన్ జాకబ్స్ సైతం ఫిఫ్టీతో మెరిశాడు. ఫిలిప్స్ దూకుడుగా ఆడినా, బెవాన్ నెమ్మది ఇన్నింగ్స్ ప్రతికూల ప్రభావం చూపించింది. ఈ జోడీ నాల్గో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసినా.. ఆతిథ్య జట్టు 20 ఓవర్లలో 180 పరుగులే చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ (2/33), ప్రిన్స్ యాదవ్ (1/30), నితీశ్ కుమార్ రెడ్డి (1/31) రాణించారు. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (1/50) దారుణ గణాంకాలు నమోదు చేసుకున్నాడు.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : టిమ్ సీఫర్ట్ (సి) తిలక్ వర్మ (బి) అర్ష్‌దీప్ సింగ్ 7, ఫిన్ అలెన్ (బి) ప్రిన్స్ యాదవ్ 16, డార్లీ మిచెల్ (సి) తిలక్ వర్మ (బి) భువనేశ్వర్‌కుమార్ 6, గ్లెన్ ఫిలిప్స్ (సి) నమన్ ధీర్ (బి) అర్ష్‌దీప్ సింగ్ 70, బెవాన్ జాకబ్స్ (సి) అక్షర్ పటేల్ (బి) నితీశ్ కుమార్ రెడ్డి 58, మిచెల్ శాంట్నర్ నాటౌట్ 4, మైకల్ బ్రాస్‌వెల్ నాటౌట్ 10, ఎక్స్‌ట్రాలు : 9, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 180.
వికెట్ల పతనం : 1-9, 2-18, 3-41, 4-157, 5-165.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 4-0-50-1, అర్ష్‌దీప్ సింగ్ 4-0-33-2, ప్రిన్స్ యాదవ్ 4-0-30-1, నమన్ ధీర్ 1-0-7-0, అక్షర్ పటేల్ 4-0-28-0, నితీశ్ కుమార్ రెడ్డి 3-0-31-1.
భారత్ ఇన్నింగ్స్ : సంజు శాంసన్ (సి) ఫిలిప్స్ (బి) డఫ్ఫీ 14, అభిషేక్ శర్మ (సి) స్మిత్ (బి) శాంట్నర్ 27, వైభవ్ సూర్యవంశీ (సి) డార్లీ (బి) స్మిత్ 4, శ్రేయస్ అయ్యర్ (బి) శాంట్నర్ 7, అక్షర్ పటేల్ (సి) డార్లీ (బి) శాంట్నర్ 11, తిలక్ వర్మ నాటౌట్ 51, నమన్ ధీర్ (సి) ఫిలిప్స్ (బి) శాంట్నర్ 31, నితీశ్ కుమార్ రెడ్డి నాటౌట్ 26, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (19.5 ఓవర్లలో 6 వికెట్లకు) 181.
వికెట్ల పతనం : 1-40, 2-44, 3-56, 4-69, 5-70, 6-112.
బౌలింగ్ : మాట్ హెన్రి 2-1-11-0, జాకబ్ డఫ్పీ 3.5-0-41-1, లాకీ ఫెర్గుసన్ 3-0-37-0, మైకల్ బ్రాస్‌వెల్ 4-0-35-0, నాథన్ స్మిత్ 3-0-34-1, మిచెల్ శాంట్నర్ 4-0-21-4.
క్రైస్ట్‌చర్చ్‌లో తెలుగు వెలుగు!
భారత్, న్యూజిలాండ్ రెండో టీ20లో తెలుగు వెలుగు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా జాతీయ జట్టులో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరు ప్రాతినిథ్యం వహించటమే గగనం. అటువంటిది, టీ20 జట్టులో తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి సుస్థిర స్థానాలతో ఆడుతున్నారు. క్రైస్ట్‌చర్చ్ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ 16.1 ఓవర్లో ఫెర్గుసన్ వేసిన బంతికి నితీశ్ కుమార్ సింగిల్ తీసి, రెండో రన్‌కు సగం వరకు పరుగెత్తాడు. కానీ తిలక్ వర్మ రెండో రన్‌ను తిరస్కరించి నితీశ్‌ను వెనక్కి పంపాడు. ఈ సమయంలో నితీశ్‌తో తిలక్ ఇలా అన్నాడు. నేను నిన్ను చూసి వెనక్కి తగ్గాను, రెండో రన్ కావాలంటే ముందే చెప్పు’ అన్నాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ అనంతరం ఓ చానల్‌లో విశ్లేషణను వ్యాఖ్యాత హర్షా భోగ్లె, క్రికెటర్ దినేశ్ కార్తీక్‌లను యాంకర్ తెలుగులో మాట్లాడించింది. దీంతో రెండో టీ20లో మైదానం లోపల, వెలుపల తెలుగుదనం ఉట్టిపడింది.






కామెంట్‌లు (0)