తెలుగు నాటక రంగంలో రచయిత స్థానం ప్రశ్నార్థకంగా నిలిచే పరిస్థితుల మధ్య రచయితకి సముచితమైన గుర్తింపు ఉందా ఉంటుందా అనేది పునరాలోచించవలసిన విషయం. నాటకానికి రచయిత వెన్నెముక. కనిపించే నటులు దర్శకుని ప్రతిభ సంగీతం లైటింగ్ సెట్ ఆహార్యం వీటన్నిటితో పాటు ఆలోచనలకు ప్రాణం పోసి కథను రచించి పాత్రలకు సంభాషణలు జోడించి నాటక ప్రతిష్ట చేసేది రచయిత!
నాటకం రచించడం కష్ట సాధ్యం. ఒక ప్రదర్శన ఎంత సులభంగా కనిపిస్తుందో దాని వెనుక నటీనటులు దర్శకుడు సాంకేతిక నిపుణులతో పాటు రచయితది ప్రత్యేకమైన స్థానం. శక్తి సామర్థ్యాలు కలిగి కనుల ముందు ప్రత్యక్ష, సజీవ సన్నివేశాలతో మన మనసుల్ని రంజింప చేసే నాటకంలో మూల భావన ఇతివృత్తం రచన. దానిని ప్రదర్శింప చేయడంలో దర్శక ప్రతిభ, నటీనటుల నటన, సహకరించే సాంకేతిక బృందం ఈ మొత్తం ఈ ప్రక్రియలో నాటక కళానుభూతిని కలిగించేందుకు గాను రచయిత పంచాగ్ని మధ్యంలో తపస్సు చేసి కథను నడిపిస్తూ సన్నివేశాలను రూపకల్పన చేస్తాడు.
పరిమితులు
నాటక రచన విషయంలో రచయిత స్వతంత్రంగా తనకు నచ్చినట్లుగా కథలాగా రచించలేడు పాత్రలు రంగస్థలం మీద కదలాడాలి ఆయా పాత్రలు తమ పరిధిలో ఎక్కువ తక్కువ కాకుండా పలకాలి రచయిత తాను వెనుక ఉండి పాత్రను ముందు నిలబెడతాడు. ఎక్కువమంది పాత్రలను పెడితే ఆ నాటకం ప్రదర్శనకు భారీ ఖర్చుకు సిద్ధపడే వారు ఉండాలి. ప్రస్తుత పరిస్థితులలో నాటక ప్రదర్శన సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో సాగించాలంటే తక్కువ పాత్రలతో చెప్పాలనుకున్నది చెప్పించాలి. నేడు వివిధ వ్యయ ప్రయాసల మధ్య పాత్రలలో పరిమితులు స్త్రీ పాత్రలు ఒకటి రెండు కంటే ఎక్కువ పెడితే వారికి పారితోషికం ఇవ్వవలసి ఉంటుంది. నాటకంలో పురుష పాత్రలు కూడా ఎక్కువ పాత్రలు ఎన్ని ఉంటే అంత ఖర్చు. తక్కువ పాత్రలతో చెప్పదలుచుకున్న విషయాలను చెప్పడం రచయితకు కత్తి మీద సామే!
రచనా పటిమ
నాటక రచయిత సామాజిక చైతన్యం కలిగి ఉంటాడు. సంస్కరణల కోసం కృషి చేస్తాడు. మానవ విలువలను తన రచన ద్వారా అందించే ప్రయత్నం చేస్తాడు. సమకాలీన సమస్యలపై తన భావాలను నాటకంగా మలుస్తాడు. ఈ ప్రయోజనాలతో ఆనాటి నుంచి నేటి వరకు నాటక రచయితలు తమ రచనలు కొనసాగిస్తున్నారు. ఒక నాటకంలో రచయిత అన్ని పాత్రలను సరిచూసుకుంటూ ఆయా పాత్రలకు అనుగుణంగా భావవ్యక్తీకరణ చేస్తూ, విషయం చెడకుండా, వస్తువులో లోపం లేకుండా, జీవం మారకుండా, నడకలో తేడాలు లేకుండా అన్ని రకాలైన జాగ్రత్తలను తీసుకుని నాటకాన్ని రచిస్తాడు. నాటకానికి ఒక ఆకారాన్ని తీసుకువస్తాడు. ఆ రచనకు దర్శకుడు ప్రదర్శన జోడించి రచనను తెరమీద సాక్షాత్కరింప చేస్తాడు దీనికి మిగిలిన వారి పాత్ర కూడా తోడై నాటకం తెరమీద ప్రదర్శించబడుతుంది. దీనికి అంతటికి మూలకర్తగా నిలిచిన రచయిత తగిన గుర్తింపుకు అర్హుడు.
పారితోషికం
కథా రచయితను తీసుకుంటే కథల పోటీలలో ఉత్తమ కథకు అక్షరాల లక్ష రూపాయలు లేదా 50, 000/- ఉత్తమ కథకు 25,000/-, 15,000/- అంటూ ఆయా సంస్థలు తమ తమ ప్రకటనలు చేసి ఉత్తమ కథా రచయితలను గౌరవ పారితోషికం ఇచ్చి సత్కరిస్తున్నారు. నవలా రచనకు ఏకంగా రెండు లక్షలు బహుమతులు కూడా ఉన్నాయి. నాటక రంగంలో ఏ రచయితకు అంతటి పారితోషికం లేదు. మొత్తం నాటక ప్రదర్శనకు కూడా ఇప్పుడిప్పుడే ఆ పారితోషికం పెరిగినట్లుగా తెలుస్తుంది. ఒక కథా రచయిత తాను రచించిన పది నుంచి 15 పేజీల కథకు అంత పారితోషికం లభిస్తుంటే ముందు కథను రచించి దాన్ని పాత్రలుగా మలిచి సంభాషణలు జోడించి దృశ్యాలుగా విభజించి నాటకంగా మలిచి 30 నుంచి 60 పేజీల వరకు రాసే రచయితకు ఏం దక్కుతుంది? ఇక్కడ కథారచయితలను కించపరచడం లేదు. కథా రచన లేకుండా నాటకం లేదు. ఏ రచయిత అయినా కథ రాయడం కష్టం కానీ నాటకం రాయడం మరింత శ్రమతో కూడుకున్న పని. నాటకాలను ప్రోత్సహించే దిశలో కథానాటక పోటీలను నిర్వహిస్తూ మూల కథను తీసుకొని నాటకంగా మలిచి ప్రదర్శించవచ్చనే అవకాశం అందుబాటులో ఉంది. ఇక్కడ ఆ నాటకంలో మూల కథా రచయిత మరణిస్తూ అది వేరే విషయం. కానీ జీవించి ఉన్న రచయిత అయితే ఆ రచయితకు ఏ రకమైన పారితోషకం లభిస్తుంది? మూల రచయిత లేకుండా కథానాటకం ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నా దానికి మూలం ఆ రచయితే కదా! ఇటువంటి కథా రచన నాటికలలో రచయిత స్పష్టంగా అందరికీ పరిచయం అవుతున్నారా అన్నది ఆలోచించవలసిన విషయం.
ప్రచురణ సమస్య
మంచి నాటకాలు రచించి వాటిని పుస్తక రూపంలో ప్రచురించడానికి అనేకమైన సమస్యలు ఉన్నాయి. కొందరు ప్రచురణకి ఒప్పుకోరు. వ్యయం ఒక కారణమైతే ఆ నాటకం తిరిగి అనేక చోట్ల వేయాలి కనుక అది అందరికీ తెలిసిపోతుంది అనే ఉద్దేశంతో ప్రచురించడానికి ఇష్టపడని వారు కూడా ఉన్నారు. నాటకం ప్రదర్శనకు ఒప్పుకొని ఆ స్థలానికి వెళ్లి ప్రదర్శించి రావడమే ఒక గొప్ప టాస్క్. ఇక ముద్రణ ప్రయత్నమే చేయరు చాలామంది. రచయిత నాటకాలు రచించడం ఒక ఎత్తు దానిని ముద్రించుకోవడానికి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం ఒక ఎత్తు. నాటకం ప్రదర్శనకు స్పాన్సర్లు ముందుకు వస్తారు. రచయిత నాటక ముద్రణకు ఎవరు ముందుకు రారు. ఒకవేళ వచ్చినా నాటక పుస్తకాలు కొనుక్కునే వారెందరూ అన్నది వారి ఆలోచన! ‘నాటకాలు పుస్తకాలుగా విరివిగా లభిస్తేనే కదా వాటిని చదివి ఒకరు ఇంకొకరితో పంచుకొని తెలుసుకోవడానికి అసలు’ అంటూ ముందే మనం ఎవరూ కొనరు అని ఒక ముద్ర వేసుకోవడం ఎంతవరకు సబబు? బుక్ ఫెయిర్స్లో నాటక పుస్తకాల కోసం ప్రత్యేకమైన స్టాల్స్ లేవు. ఏమన్నా నాటికలకు పుస్తకాలు ఉన్నాయా అని ప్రశ్నించిన వారు, లేవని తెలుసుకొని వెనుతిరిగినవారు సందర్శకులలో ఉన్నారు. నాటికల పుస్తకాలు చూద్దాం ఆ నాటికల్ని పిల్లలతోనూ, పెద్దవారితోను, యువతి యువకులతోను ప్రదర్శింప చేద్దాము అంటే పుస్తకాలు అందుబాటులో లేవు. ఒకటి రెండు తప్ప పరిషత్తుల వారు, వారు స్వీకరించి ప్రదర్శింప చేసిన నాటికలను ఒక పుస్తకంగా ముద్రింప చేయడం లేదు. అలా చేసినట్లయితే ఈపాటికి అనేక ప్రదర్శనలతో అటు పరిషత్తుల గురించిన వివరణలతో ప్రదర్శించిన నాటికలతో నాటకాల గురించి చాలామందికి స్పష్టంగా తెలిసే అవకాశం ఉండేది.
డోలాయమానంలో రచయిత
ఒక రచయిత ఒక నాటికను/నాటకం రచిస్తే దానిని స్వీకరించి ప్రదర్శనకు తీసుకోవడానికి ఒక నాటక సంస్థ కావాలి. దర్శకుడు ఆ బాధ్యత తీసుకొని ఫలానా సంస్థ ద్వారా నాటకం ప్రదర్శించడానికి తన రచన తీసుకొని ముందుకు వస్తేనే ఆ నాటకం ముందుకు సాగుతుంది. ఇలా కాకుండా ఈ ప్రయత్నంలో రచయిత ప్రమేయం లేకుండా దర్శకుడు నాటక రచయితగా మారి రచన, నటన, దర్శకత్వం బాధ్యతలు చూసుకోవడం కూడా జరుగుతుంది. తను రాసిన నాటికను తన దర్శకత్వంలో తన సంస్థ ద్వారా అందించడం సాధారణంగా జరుగుతున్న విషయం. కొత్తగా ఒక రచయిత ఒక నాటిక రచిస్తే ఆ రచన పరిషత్తుల ప్రదర్శన కోసం ఎలా రచించాలి? ప్రదర్శనకు అనుగుణంగా ఏ మార్పులు చేసుకోవాలి అనే కోణంలోనే రాయాలి లేకపోతే ఆనాటిక వెలుగు చూడదు. దీనికి బదులు కథను రాసుకుంటే కనీసం బహుమతి వచ్చినా రాకున్నా సాధారణ ప్రచురణలో అన్నా రచయిత కథ కనిపించే అవకాశం ఉంటుంది. నాటక రచయిత స్వతంత్రంగా రచయితగా ఎక్కడ కనిపించడు. ఆ రచయిత ప్రతిభావంతుడైతే ముందుకు వచ్చి సంస్థలు స్వీకరిస్తాయి. ఇక్కడ ఔత్సాహిక నూతన రచయితల మార్గం ఏమిటన్నది ప్రశ్న? అలాగని పరిషత్తులను తప్పు పట్టలేము. వారి ప్రోత్సాహం లేకుండా నాటకం ప్రదర్శనలకు నోచుకోదు. వారి నియమాలు వారికుంటాయి. ఏ ఏ పరిషత్తుల వారు ఆయా పరిషత్తుల ద్వారా తమ స్థాయికి తగినట్లుగా నాటకాలను ఎంపిక చేసుకొని న్యాయ నిర్నేతలను పెట్టి నాటకాలకు బహుమతులు ఇస్తున్నారు. అందులో రచయితకు కూడా బహుమతులు ఇస్తున్నారు అన్నది వాస్తవం.
తగిన చేయూతనివ్వాలి
నాటకోత్సవాలలోను ఉత్తమ రచనకు నగదు బహుమతి ఇచ్చినప్పటికీ ఉత్తమ ప్రదర్శనకు ఎంపికైన నాటకం రచించిన రచయితకు లభించే పారితోషకం మరింత పెరగాల్సిన అవసరం ఉన్నది. నాటకంలో రచయితకు సముచిత స్థానం లభిస్తే రచయితను గౌరవిస్తే రచయిత ప్రధానమైన వ్యక్తిగా భావిస్తే కంటెంట్ రైటర్స్‌గా ఉన్న వారంతా నాటికలు రాయడానికి క్యూ కడతారు. నాటక స్థాయి కూడా పెరుగుతుంది. వెబ్ సిరీస్‌లు ఓటీడీలు షార్ట్ ఫిలిమ్స్ వంటి వాటికి రచనలు చేసే వారంతా నాటకం రాస్తే మన భవిష్యత్తు ఇంకా బాగుంటుంది అనే భరోసా కలిగించేంతగా రచయితను ఉన్నత స్థానంలో నిలబెట్టాలి. ఆ కాలంలో గురజాడ అప్పారావు లేకుండా కన్యాశుల్కం లేదు బలిజేపల్లి లక్ష్మీకాంతం లేకుండా సత్య హరిశ్చంద్ర నాటకం లేదు. వేలూరి శివరామశాస్త్రి లేకుండా సుల్తానీ నాటకం లేదు.. ఇలా చెప్పుకుంటూ పోతే మన తెలుగు భాషకు వన్నెతెచ్చిన నాటిక/నాటకాలు ఆయా రచయితలు కోకొల్లలు. కొన్ని నాటికలు రచయిత పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేలా ఉన్నవి ఎన్నో ఎన్నెన్నో! గురు బ్రహ్మ గురు విష్ణు అంటూ గురువుకి ప్రథమ స్థానం ఎలా ఉంటుందో నాటకంలో రచయితకు అటువంటి స్థానం ఉండాలి. అప్పుడు నాటకం విలువ రచయితకు సముచిత గౌరవం రెండూ పెరుగుతాయి. ఈ దిశలో నాటక రంగంలోని పెద్దలు ఒకసారి ఆలోచించి రచయిత కలం పదునుగా సమాజంలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని, వినోదాన్ని, సామాజిక చైతన్యాన్ని కలిగించేందుకు తగిన చేయూతనివ్వాలి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నాటక రచయితను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాలి. సమాజ పరివర్తనకు నాటకాలు సాధకాలు. నాటక రచయితలు ఆ మార్పుకు మూల స్థంభాలు.
డాక్టర్. సమ్మెట విజయ 9989820215






కామెంట్లు (0)