హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ 193/2
పంజాబ్ తొలి ఇన్నింగ్స్ 431 ఆలౌట్
నవతెలంగాణ-హైదరాబాద్ : పంజాబ్‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ దీటుగా రాణిస్తోంది. పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగుల భారీ స్కోరు చేయగా.. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 54 ఓవర్లలో 2 వికెట్లకు 193 పరుగులు చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (2) నిరాశపరిచినా, అభిరథ్ రెడ్డి (97, 140 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ రాదేశ్ (72 బ్యాటింగ్, 154 బంతుల్లో 9 ఫోర్లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. రెండో వికెట్‌కు 154 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఉమేశ్ యాదవ్ ఓవర్లో కవర్స్ మీదుగా బౌండరీతో అర్థ సెంచరీ సాధించిన అభిరథ్ రెడ్డి హైదరాబాద్‌ను ముందుండి నడిపించాడు. స్పిన్, పేస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న అభిరథ్ రెడ్డి సెంచీర ముంగిట ఉమేశ్ యాదవ్ ఓవర్లో వికెట్ కోల్పోయాడు.
కొడిమెల హిమతేజ (8 నాటౌట్)తో కలిసి రాహుల్ రాదేశ్ అజేయంగా ఆడుతున్నాడు. రెండో రోజు ఆట ముగిసేసరికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో మరో 238 పరుగుల వెనుకంజలో నిలిచింది. అంతకముందు, పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. వికెట్ కీపర్ సాలిల్ అరోరా (151, 268 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) టెయిలెండర్లతో కలిసి భారీ భాగస్వామ్యాలు నిర్మించాడు. రమణ్‌దీప్ సింగ్ (52), ఉమేశ్ యాదవ్ (37 నాటౌట్)లు సాలిల్కు సహకరించారు. ఉమేశ్ యాదవ్‌తో కలిసి పదో వికెట్‌కు 116 పరుగులు జోడించిన సాలిల్ ఆరోరా పంజాబ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు అందించాడు. హైదరాబాద్ కెప్టెన్ సీవీ మిలింద్ (4/79), పేసర్ రక్షణ్ రెడ్డి (3/80) రాణించారు. స్పిన్నర్లు తనయ్ త్యాగరాజన్ (1/115), అనికెత్ రెడ్డి (1/112) చెరో వికెట్ పడగొట్టారు.







కామెంట్లు (0)